ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలు తినాల్సిందే

ABN , First Publish Date - 2021-01-16T06:27:37+05:30 IST

మారుతున్న కాలానుగునంగా ఆహారపు అలవాట్లలో భాగంగా ప్రపంచంలో అందరికీ ఆరోగ్యరీత్యా పోషకాహార భద్రత అత్యవసరమని, ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాల వంటకాలను తినాల్సిందేనని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలు తినాల్సిందే
శంశల్లాపూర్‌లో సంప్రదాయ నృత్యాలు చేస్తున్న దృశ్యం

పోషకాహారం కోసం ప్రజలు పోటీ పడుతున్నారు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర్‌


న్యాల్‌కల్‌, జనవరి 15: మారుతున్న కాలానుగునంగా ఆహారపు అలవాట్లలో భాగంగా ప్రపంచంలో అందరికీ ఆరోగ్యరీత్యా పోషకాహార భద్రత అత్యవసరమని, ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాల వంటకాలను తినాల్సిందేనని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. డీడీఎస్‌ ఆధ్వర్యంలో గురువారం శంశల్లాపూర్‌లో పాతపంటల జాతర ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలో ప్రజలకు సరిపడా ఆహారం ఉందని చెప్పారు. కరోనా సమయంలో 21 దేశాలకు ఆహారాన్ని సరఫరా చేశామని తెలిపారు. డీడీఎస్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో మరిన్ని పోషకాలు ఉంటాయని వివరించారు. డీడీఎస్‌ 21 సంవత్సరాలుగా పాత పంటలను కాపాడుకుంటూ అందరికి పోషకాలున్న ఆహార ఉత్పత్తులను అందించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. పోషకాలున్న ఆహారం కోసం ప్రజలు పోటీ పడుతున్నారని, పోటీకి అనుగుణంగా ఆహార ఉత్పత్తులను డీడీఎస్‌ మార్కెటింగ్‌ చేయాల్సి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 720 కృషి విజ్ఞానకేంద్రాలు పోషకాహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. తాము చేపడుతున్న జాతర ఉత్సవాలకు గ్రామాల్లో అనూహ్య స్పందన వస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ గ్లోరీస్వరూప, డీడీఎస్‌ డైరెక్టర్‌ పీవీ.సతీష్‌, గ్రామ రిసోర్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ రుక్మిణీరావు, ఎంపీపీ అంజమ్మ, సర్పంచ్‌ మీనాక్షీ ఈశ్వర్‌, జాతర నిర్వాహకులు వినయ్‌కుమార్‌, జనరల్‌ నర్సమ్మ, రైతులు, డీడీఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-16T06:27:37+05:30 IST