నువ్వులు...పోషకాల దివ్వెలు

ABN , First Publish Date - 2021-04-17T05:53:15+05:30 IST

పోషకాలతో నిండిన నువ్వులు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వీటితో చేసిన వంటలు తింటే ఆరోగ్యం ఎంచక్కా ఉంటుంది. నువ్వులతో బర్ఫీ, చట్నీ, పులావు, పిల్లలు ఇష్టంగా తినే లడ్డూలు చేసుకోవచ్చు. మరి మీరూ నువ్వుల రుచులను ఆస్వాదించండి

నువ్వులు...పోషకాల దివ్వెలు

పోషకాలతో నిండిన నువ్వులు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.  వీటితో చేసిన వంటలు తింటే  ఆరోగ్యం ఎంచక్కా ఉంటుంది. నువ్వులతో బర్ఫీ, చట్నీ, పులావు, పిల్లలు ఇష్టంగా తినే లడ్డూలు చేసుకోవచ్చు. మరి మీరూ నువ్వుల రుచులను ఆస్వాదించండి.


లడ్డూలు

కావలసినవి

నువ్వులు - 100గ్రాములు, బెల్లం - 100గ్రాములు, యాలకుల పొడి - అర టీస్పూన్‌.


తయారీ విధానం

  • ముందుగా స్టవ్‌పె పాన్‌ పెట్టి నువ్వులను వేగించాలి. నువ్వులు మరీ ఎక్కువగా వేగకుండా చూసుకోవాలి. చిటపటమంటున్న సమయంలోనే దింపి ప్లేట్‌లోకి మార్చుకోవాలి.
  • అదే పాన్‌లో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి పానకం తయారుచేసుకోవాలి. 
  • తరువాత అందులో యాలకుల పొడి, నువ్వులు వేసి కలపాలి. 
  • మిశ్రమం చల్లారిన తరువాత కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూలు తయారుచేసుకోవాలి.
  • గాలి తగలని జాడీలో పెట్టుకుంటే ఇవి నిల్వ ఉంటాయి. ఐరన్‌ సమృద్ధిగా లభించే ఈ లడ్డూలను పిల్లలు ఇష్టంగా తింటారు.

నువ్వుల బర్ఫీ


కావలసినవి

నువ్వులు - 300గ్రాములు, బెల్లం - 250గ్రాములు, నెయ్యి - 50గ్రాములు, యాలకులు - పది, బాదం పలుకులు - పది.


తయారీ విధానం

  • యాలకులను పొడి చేసుకోవాలి. బర్ఫీ ట్రేకి నూనె లేదా నెయ్యి రాసుకోవాలి. 
  • స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నువ్వులను వేగించాలి. రెండు మూడు నిమిషాల పాటు వేగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగించకూడదు. తరువాత ఆ నువ్వులను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. 
  • స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి కొద్దిగా వేడి అయ్యాక నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తరువాత బెల్లం వేయాలి. పావుకప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు చిన్నమంటపై ఉంచాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ ఉండాలి.
  • ఇప్పుడు నువ్వుల పొడి వేసి కలపాలి. యాలకుల పొడి వేయాలి. మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉంచి దింపాలి.
  • నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో పోయాలి. బాదం పలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి. స్పూన్‌తో బాదం పలుకులను కాస్త ఒత్తితే బర్ఫీకి పట్టుకుంటాయి. 
  • పావుగంట తరువాత బర్ఫీని మీకు నచ్చిన సైజులో కట్‌ చేసుకోవాలి. అంతే రుచికరమైన నువ్వుల బర్ఫీలు రెడీ.

ఫ్రైడ్‌ చికెన్‌

కావలసినవి: చికెన్‌ బ్రెస్ట్‌లు - ఆరు, ఎగ్‌వైట్‌ - రెండు, ఉప్పు - కొద్దిగా, నువ్వులు - అర కప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం

  • ముందుగా చికెన్‌ బ్రెస్ట్‌లను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక పాత్రలో ఎగ్‌వైట్‌లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. మరొక ప్లేట్‌లో నువ్వులు తీసుకోవాలి.
  • ఇప్పుడు చికెన్‌ ముక్కలను ఎగ్‌వైట్‌లో డిప్‌ చేసి, నువ్వులు సమంగా అంటేలా అద్దాలి. తరువాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
  • స్టవ్‌పై డీప్‌ ఫ్రై పాన్‌ పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి వేగించాలి. ఐదు నిమిషాల పాటు వేగిన తరువాత ముక్కలు మరోవైపు తిప్పి మరికాసేపు వేగించి తీసుకోవాలి.
  • నువ్వుల చికెన్‌ బ్రెస్ట్‌లను చిల్లీ సాస్‌తో కలిపి సర్వ్‌ చేయాలి.

నువ్వుల పులావు

కావలసినవి

మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, శనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి - మూడు, కరివేపాకు - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, నువ్వులు - మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఎండుకొబ్బరి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, ఆవాలు - పావు టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, బియ్యం - ఒకటిన్నర కప్పు.


తయారీ విధానం

  • ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండి సిద్ధంగా పెట్టుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి.
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి.
  • తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ఎండుకొబ్బరి వేసి కలపాలి. కాసేపు వేగించి దింపాలి.
  • చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్‌పై మళ్లీ పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి.
  • మినప్పప్పు వేగిన తరువాత కరివేపాకు, ఇంగువ వేసుకుని దింపాలి.
  • ఇందులో నువ్వుల పొడి, తగినంత ఉప్పు వేయాలి.
  • వండి అన్నం తీసుకుని అందులో ఈ మిశ్రమం కావలసినంత వేసుకుని కలపాలి. 
  • రుచికరమైన ఈ నువ్వుల పులావును ఇతర కూరలతో లేదా పెరుగుతో సర్వ్‌ చేయాలి.

నువ్వుల చట్నీ

కావలసినవి

నువ్వులు - 200 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, నిమ్మరసం - కొద్దిగా, పంచదార - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత. 


తయారీ విధానం

  • ముందుగా నువ్వులను వేగించాలి. తరువాత మిక్సీలో వేసి పొడి చేయాలి.
  • తరువాత అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి పట్టుకోవాలి. 
  • ఇప్పుడు నిమ్మరసం వేయాలి. కొద్దిగా ఉప్పు, పంచదార వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి.
  • సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని అన్నం లేదా చపాతీతో వడ్డించాలి.

పోషక విలువలు

  • నువ్వుల్లో కాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారికి నువ్వులు మంచి ఆహారం.
  • ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. శాకాహారులు ప్రొటీన్‌ కోసం నువ్వులు తీసుకోవచ్చు. 
  • క్రమంతప్పకుండా నువ్వులు తింటే హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటాయి. 
  • నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. 
  • వీటిలో మోనోశాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. గుండెకు మేలు చేసే ఒలెయిక్‌ యాసిడ్‌ నువ్వుల్లో లభిస్తుంది.
  • ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన జింక్‌, మెగ్నీషియం, కాల్షియం వీటిలో లభిస్తాయి.
  • నువ్వుల్లో ఔషధగుణాలు పుష్కలం అని ఆయుర్వేదం చెబుతోంది. చర్మ సంరక్షణ కోసం నువ్వుల నూనె పనికొస్తుంది.
  • రోజూ ఆహారంలో నువ్వుల నూనె తీసుకోవచ్చు. 

Updated Date - 2021-04-17T05:53:15+05:30 IST