ఆ సినిమాలెప్పుడూ ఛాలెంజే

ABN , First Publish Date - 2020-11-22T05:50:39+05:30 IST

ఎడిటింగ్‌.. తెరవెనకుండి కథను ముందుకు నడిపించే ఒక అతి ముఖ్యమైన శాఖ. చాలా సినిమాల జయాపజయాలు ఎడిటింగ్‌పైనే ఆధారపడి ఉంటాయి. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక క్రమపద్ధతిలో లేని సన్నివేశాలను ఎడిటింగ్‌ టేబుల్‌పై...

ఆ సినిమాలెప్పుడూ  ఛాలెంజే

ఎడిటింగ్‌.. తెరవెనకుండి కథను ముందుకు నడిపించే ఒక అతి ముఖ్యమైన శాఖ. చాలా సినిమాల జయాపజయాలు  ఎడిటింగ్‌పైనే ఆధారపడి ఉంటాయి. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక క్రమపద్ధతిలో లేని సన్నివేశాలను   ఎడిటింగ్‌ టేబుల్‌పై ఓ పద్ధతిలో పెట్టి అందంగా కథ చెప్పగలిగిన వాడే నిజమైన ఎడిటర్‌. అలాంటి నైపుణ్యమున్న ఎడిటర్స్‌లో  ప్రవీణ్‌ పూడి ఒకరు.  ‘మనం’, ‘జులాయి’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ప్రవీణ్‌ తన అనుభవాలను నవ్యతో పంచుకున్నారు. 


‘‘మాది హుజూర్‌ నగర్‌. మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాను. చిన్నతనం నుంచి సినిమాలు చూస్తూ పెరగటం వల్ల అవంటే మాత్రం బాగా ఆసక్తి ఉండేది. హుజూర్‌నగర్‌లో కన్నా హైదరాబాద్‌లో ఎక్కువ అవకాశాలు ఉంటాయని భావించి.. పొట్ట కూటి కోసం పెట్టె పట్టుకొని నగరానికి వచ్చేశా. పల్లి కేశవరావు అనే నిర్మాత నాకు దూరపు చుట్టం అవుతారు. ఆయనను కలిస్తే- ఆనంద్‌ సినీ సర్వీసె్‌సలో చేరమని సిఫార్సు చేశారు. అప్పుడు బక్కగా ఉండేవాడిని.. వయస్సు కూడా తక్కువ కావటంతో నాకు అక్కడ ఉద్యోగం దొరకలేదు. ఏదో ఒకటి చేయకపోతే బతుకు బండి నడవని పరిస్థితి. అలాంటి సమయంలో మా ఇంటి పక్కన ఉండే ఒకాయన- నెగిటివ్‌ కటింగ్‌ అనే ప్రొసె్‌సలో పనిచేసేవారు. నా అవస్థ చూసి- ‘‘ఓ పది రోజులు నాతో రా. పని చేయటం నేర్చుకొందువు గానీ...’’ అని తీసుకువెళ్లారు, నాకు మొదటి రోజే ఎడిటింగ్‌ బాగా నచ్చింది . కొద్ది కాలం పోయిన తర్వాత  కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)గారి దగ్గర చేరి రెండేళ్లు పనిచేశాను. ‘చూడాలనివుంది’, ‘రాజకుమారుడు’ వంటి చిత్రాలకు వర్క్‌ చేశాను. ఆ తర్వాత మార్తాండ్‌  వెంకటేశ్‌ గారి దగ్గర జాయిన్‌ అయ్యాను. 


ఆ రోజుల్లో..

నా కెరీర్‌ మొదలైన రోజుల్లో ఎడిటింగ్‌ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది. సినిమా ఫిల్మ్‌ను డిజిటల్‌లోకి కన్వర్ట్‌ చేయాల్సి వచ్చేది. నెగిటివ్‌ కటింగ్‌ అనే ఒక ప్రత్యేక ప్రక్రియ ఉండేది. ఫిల్మ్‌ పోయి ఇప్పుడంతా డిజిటల్‌ మయం కావడంతో  కెమెరాలో షూట్‌ చేసిన డేటాను డైరెక్ట్‌గా సిస్టమ్‌లోకి కాపీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి- ఆన్‌లైన్‌ ఎడిటింగ్‌ కూడా వచ్చేసింది. దీని వల్ల షూటింగ్‌ స్పాట్‌లోనే సీన్‌ ఎలా వచ్చిందనే విషయం తెలిసిపోతుంది. సీను బాగోలేకపోతే వెంటనే మరో  షాట్‌ తీసుకోగలుగుతున్నారు.  ఆన్‌లైన్‌ ఎడిటింగ్‌ తర్వాత చివరగా- మా వద్దకు ఫైనల్‌ రష్‌  వస్తుంది. దానిని మళ్లీ ఎడిట్‌ చేయాల్సి వస్తుంది. ఇక నా విషయానికి వస్తే- ఎడిటింగ్‌లో రాబోయే యుగమంతా డిజిటల్‌దే అని ముందుగా గమనించిన వారు మార్తాండ్‌  వెంకటే్‌షగారు. ఆయన సూచన మేరకే అమీర్‌పేటలో ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్లి కంప్యూటర్స్‌లో బేసిక్స్‌ నేర్చుకొనేవాడిని. అప్పట్లో రామానాయుడు స్టూడియో, శబ్దాలయా స్టూడియోలలో మాత్రమే ఎవిడ్‌ సూట్‌లు ఉండేవి. వాటిలో ఎడిటింగ్‌ చేసేవాడిని. 


పవన్‌తో అనుబంధం ఎక్కువ..

మొదటినుంచీ పవన్‌కల్యాణ్‌గారితో నాకు అనుబంధం ఎక్కువ. తొలిప్రేమ, బద్రి, తమ్ముడు చిత్రాలకు అసిస్టెంట్‌ ఎడిటర్‌గానే కాకుండా ఆ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశా. ఈ సినిమాల తర్వాత- పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ అనే సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థలో నేను చేరాను. పవన్‌గారి సినిమాలకు ఎడిటింగ్‌ చేయటమే నా ప్రధానమైన డ్యూటీ. ఆయనతో  పనిచేయటం చాలా ఎక్సైటింగ్‌గా ఉండేది. ఆయన పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌ పుస్తకాలు ఇచ్చి చదవమనేవారు. ఆయన ప్రతి సినిమాకూ  దాదాపు ఆరు నెలలు గ్యాప్‌ ఉండేది. ఆ సమయంలో కొత్త విషయాలు నేర్చుకొనేవాడిని. 


సవాళ్లెన్నో..

స్ర్కీన్‌ప్లే ఆధారంగా నిర్మించే సినిమాలు ఎప్పుడూ ఎడిటర్స్‌కు ఛాలెంజే! దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తీసిన ‘మనం’ అలాంటిదే! ఈ సినిమాలో చాలా లేయర్స్‌ ఉంటాయి. ఏ మాత్రం తేడా వచ్చిన ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్‌ అయిపోతాడు. అందువల్ల ఈ సినిమా ఎడిటింగ్‌కు  ఎక్కువ సమయం పట్టింది. ‘అత్తారింటికి దారేది’ విషయంలోనూ   ఇంతే! ఇలాంటి మరొక సినిమా ‘జులాయి’ . దీనిలో హీరో, విలన్‌- ఇద్దరూ తెలివైనవారే. ఎత్తుకుపై ఎత్తు వేస్తూ ఉంటారు. ప్రొడక్షన్‌లో ఉన్నవారికి సినిమా కథ ముందే తెలుసు కాబట్టి సస్పెన్స్‌ ఉండదు. కానీ ఎడిటర్‌ ప్రేక్షకుడిగా ఫీల్‌ అయి.. ఎడిటింగ్‌ చేయాలి. అప్పుడే ‘ఇది నిజంగా జరుగుతోంది’ అని ప్రేక్షకుడు ఫీల్‌ అవుతాడు. 


ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నుంచి ఎడిటర్‌ ఇన్వాల్వ్‌ అయితే సినిమాల ఫలితం బావుంటుంది. త్రివిక్రమ్‌ తీసిన ‘జులాయి’  విక్రమ్‌ కుమార్‌ తీసిన ‘మనం’, ‘24’  చిత్రాల ప్రీ ప్రొడక్షన్‌లో నేను కూడా పాల్గొన్నా.  

  1. నా ఉద్దేశంలో సినిమా అనేది దర్శకుడి ఊహ నుంచి పుట్టిన కావ్యం. దానికి మెరుగులు దిద్దటానికి ఎడిటింగ్‌ ఉపకరిస్తుంది. కొన్ని సార్లు ఎడిటర్‌ సూచనలు కూడా ఉపకరిస్తాయి. ఎక్కడైనా తప్పు అనిపిస్తే- ముందే చెప్పటం వల్ల మాత్రమే ప్రయోజనముంటుంది. 
  2. ప్రస్తుతం వకీల్‌ సాబ్‌ సినిమాకు పనిచేస్తున్నా! మూలకథలో మార్పు లేకుండా పవన్‌ కల్యాణ్‌ గారి ఇమేజ్‌కు తగ్గట్టుగా దీనిని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు.


- వినాయకరావు


Updated Date - 2020-11-22T05:50:39+05:30 IST