కారు కొనే మొఖమేనా నీది.. జేబులో రూ.10 అయినా ఉన్నాయా..?

ABN , First Publish Date - 2022-01-25T08:04:20+05:30 IST

‘స్నేహం కోసం’ సినిమా గుర్తుందా..! అందులో హీరో చిరంజీవి, ఆయన స్నేహితుడు కలిసి ఒక కార్ల షోరూమ్‌కు వెళ్తారు. ..

కారు కొనే మొఖమేనా నీది.. జేబులో రూ.10 అయినా ఉన్నాయా..?

‘కారు’కూతలపై యువ రైతు ఆగ్రహం.. అరగంటలో రూ.10 లక్షలు తెచ్చి డెలివరీకి డిమాండ్‌

బెంగళూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘స్నేహం కోసం’ సినిమా గుర్తుందా..! అందులో హీరో చిరంజీవి, ఆయన స్నేహితుడు కలిసి ఒక కార్ల షోరూమ్‌కు వెళ్తారు. వాళ్ల పంచెకట్టు, పల్లెటూరి వాలకం చూసి ఎగ్జిక్యూటివ్‌.. ఈ కాస్ట్‌లీ కారు మీరు కొనలేరులే వెళ్లండి అంటూ అవహేళనగా మాట్లాడతాడు. దీంతో వాళ్లు గోనె సంచిలో తెచ్చిన నోట్ల కట్టలు కుమ్మరించి.. ఈ కారు విలువెంతో అంత తీసుకుని మిగిలినవి మళ్లీ సంచిలో వేయమంటారు. అప్పటివరకు అవమానకరంగా మాట్లాడిన ఎగ్జిక్యూటివ్‌.. సార్‌ సార్‌.. అంటూ సాగిలపడతాడు. సరిగ్గా ఇలాంటి సీనే ఒకటి కర్ణాటకలో చోటుచేసుకుంది. తుమకూరు నగరానికి సమీపంలోని హెబ్బూరు హోబళి రామనపాళ్యకు చెందిన వక్కతోట రైతు కెంపేగౌడ మిత్రులతో కలసి మహీంద్ర కార్ల షోరూంకు వెళ్లి.. బొలెరో పికప్‌ ట్రక్‌ కావాలని అడుగుతాడు. ఆ రైతు వాలకం చూసిన సేల్స్‌మ్యాన్‌ ‘ఈ కారు విలువ రూ.10 లక్షలు.. నీ జేబులో 10 రాపాయలైనా ఉన్నాయా’ అంటూ అవహేళనగా మాట్లాడాడు. ఆ మాటలకు రైతు కోపంతో అరగంటలో రూ.10 లక్షలు తెస్తాను వెంటనే డెలివరీ ఇస్తావా అని సవాల్‌ చేశాడు. సేల్స్‌మ్యాన్‌.. అబ్బో చూద్దాంలే అన్నట్టు.. ముందు డబ్బు తీసుకురా పో ఈ రోజే డెలివరీ ఇస్తా అంటాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన కెంపేగౌడ అరగంట తర్వాత వచ్చి రూ.10 లక్షలు టేబుల్‌మీద పెడతాడు. వెంటనే డెలివరీ కావాలని సిబ్బందితో గొడవ పెట్టుకుంటాడు. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో వాళ్లు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి వెయింటింగ్‌ లిస్ట్‌ ప్రకారం ఈ బండి డెలివరీకి కనీసం నాలుగు రోజులైనా పడుతుంది. దీంతో షోరూమ్‌ సిబ్బంది ఆ రైతుకి రాతపూర్వక క్షమాపణ చెప్పి.. నాలుగు రోజుల్లో డెలివరీ ఇస్తామని మాట ఇస్తారు. శాంతించిన కెంపేగౌడ.. ‘హేళనగా మాట్లాడే నీలాంటి వాడి దగ్గర నేను కారు కొనను పో..’ అంటూ ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోతాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Updated Date - 2022-01-25T08:04:20+05:30 IST