యువతి నుంచి ఫోన్.. ఆమె చెప్పిన మాటలు విని.. చివరికి..!

ABN , First Publish Date - 2021-07-02T14:48:20+05:30 IST

తన పేరు అశ్వినీ నాయక్‌ అని, తాము నిర్వహిస్తున్న...

యువతి నుంచి ఫోన్.. ఆమె చెప్పిన మాటలు విని.. చివరికి..!

  • ఆన్‌లైన్‌ సేల్స్‌ పెట్టుబడి పేరుతో మోసం


హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : తమ కంపెనీలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించిన యువతి లక్షన్నర టోకరా వేసింది. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం పంజగుట్టకు చెందిన సురేష్‌ యాదవ్‌కు ఇటీవల ఓ యువతి కాల్‌ చేసింది. తన పేరు అశ్వినీ నాయక్‌ అని, తాము నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ సేల్స్‌ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెడితే తక్కువ వ్యవధిలోనే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించింది. ఆమె మాటలతో మోసపోయిన సురేష్‌ యాదవ్‌ వెంటనే రూ.1.60లక్షలు పెట్టుబడి పెట్టాడు. రెండురోజుల పాటు అతన్ని మభ్యపెడుతూ వచ్చిన యువతి ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసింది. ఆమె చెప్పిన వెబ్‌సైట్‌ కూడా ఓపెన్‌ కాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన సురే‌ష్‌యాదవ్‌ సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.


అమెజాన్‌ సేల్స్‌ పేరుతో...

అమెజాన్‌ సంస్థ తరఫున సేల్స్‌ బిజినెస్‌ పేరుతో ఓ వ్యక్తిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు రెండు లక్షల దాకా టోపీ పెట్టారు. అంబర్‌పేట్‌కు చెందిన రవీందర్‌ అనే వ్యక్తికి ఇటీవల అతని వాట్సాప్‌ నకు మెసేజ్‌ వచ్చింది. అమెజాన్‌ సంస్థ సేల్స్‌ విభాగంలో చేరి సేల్స్‌ చేస్తే పెద్దమొత్తంలో డబ్బులు వస్తాయని, పెట్టుబడిని బట్టి లాభాలు ఉంటాయని ఆ మెసేజ్‌ సారాంశం. మెసేజ్‌తోపాటు ఒక లింక్‌ కూడా ఉంది. రవీందర్‌ ఆ లింక్‌ను క్లిక్‌ చేయడంతో ఈషాట్‌ జాబ్స్‌ పేరుతో ఒక వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయ్యింది. ఇంతలో ఓ కేటుగాడు ఫోన్‌ చేసి అందులో పెట్టుబడికి సంబందించిన వివరాలు నమోదు చేయాలని సూచించాడు. ముందుగా రవీందర్‌ పదివేలు పెట్టాడు. ఒక్కరోజులోనే అందులో రెట్టింపు లాభాలు కనిపించాయి. దీంతో ఏకంగా రూ.1.70లక్షలు డిపాజిట్‌ చేశాడు. ఆ వెంటనే వెబ్‌సైట్‌ తెరుచుకోవడం ఆగిపోయింది. తనకు ఫోన్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చిన నెంబర్లకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో రవీందర్‌ సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.


క్రెడిట్‌ కార్డు పరిమితి పెంచుతామని..

క్రెడిట్‌ కార్డు పరిమితిని మరో రెండు లక్షలు పెంచుతామని నమ్మించి ఓ వ్యక్తిని మభ్యపెట్టిన కేటుగాళ్లు లక్షకు పైగా కాజేశారు. ధూల్‌పేట్‌కు చెందిన అనీల్‌సింగ్‌కు ఆర్‌బీఎల్‌ బ్యాంకు, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఇటీవల ఓ యువతి కాల్‌ చేసి తాను ఆర్‌బీఎల్‌ బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నానని, మీ కార్డులో ఉన్న లిమిట్‌ను పెంచేందుకు అప్రోవల్‌ వచ్చిందని, కార్డు వివరాలతో పాటు, ఇతర బ్యాంకుల క్రెడిట్‌ కార్డుల వివరాలు కూడా చెప్పాలని అడిగింది. దీంతో అనీల్‌సింగ్‌ రెండు కార్డుల నెంబర్లు, గడువు వివరాలు, సీవీవీ నెంబర్లు చెప్పాడు. అంతేకాకుండా ఆ యువతి ఓటీపీ నెంబర్లు కూడా చెప్పాలని అడగడంతో అతను వాటిని చెప్పాడు. మరుక్షణమే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు నుంచి రూ.1.21లక్షలు డెబిట్‌ అయ్యాయి. ఆ వెంటనే కాల్‌ కట్‌ అయ్యింది. తర్వాత కాల్‌ చేసినప్పటికీ స్విచ్చాఫ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించిన అనీల్‌ సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.


మార్ఫింగ్‌ ఫొటోలతో వేధించే ప్రయత్నం..

తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫొటోలను కొందరు కాపీ చేసి, వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారని సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి సిటీ సైబర్‌క్రైమ్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వ్యక్తుల్లో కొందరు కావాలనే ఆమెను వేధించడానికి అలా చేస్తున్నట్లు భావిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-02T14:48:20+05:30 IST