HYD : వరుడి కోసం వెతుకుతున్న యువతికి ఓ వ్యక్తి నుంచి ఫోన్.. రెండ్రోజుల తర్వాత..!

ABN , First Publish Date - 2021-07-18T15:02:38+05:30 IST

వరుడి కోసం వెతుకుతున్న యువతికి ఓ వ్యక్తి నుంచి ఫోన్.. రెండ్రోజుల తర్వాత..

HYD : వరుడి కోసం వెతుకుతున్న యువతికి ఓ వ్యక్తి నుంచి ఫోన్.. రెండ్రోజుల తర్వాత..!

హైదరాబాద్ సిటీ : ఓ మ్యాట్రిమోనీ సైట్‌ నుంచి వివరాలు తీసుకున్న కేటుగాడు నగరానికి చెందిన యువతిని ప్రేమ పెళ్లి పేరుతో ట్రాప్‌ చేసి ఆరు లక్షలు కాజేశాడు. మెహిదీపట్నంకు చెందిన యువతి కొన్ని నెలల క్రితం ఓ మ్యాట్రిమోనీ సంస్థలో వరుడి కోసం తన పేరు వివరాలు రిజిస్టర్‌ చేయించింది. నెల రోజుల క్రితం అభిరాజ్‌ మనీష్‌ పేరుతో ఓ ఆగంతకుడు యువతి ఫోన్‌ నెంబర్‌ తీసుకుని పరిచయం పెంచుకున్నాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో  ప్రొఫైల్‌, ఫొటోలు చూశానని, మీరు నచ్చారంటూ ముగ్గులోకి దింపాడు. తాను యూకేలో మంచి సంస్థలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. ప్రేమిస్తున్నానని, మీకు అంగీకరమైతే పెళ్లి చేసుకుందామని, తాను త్వరలోనే ఇండియాకు వస్తానని చెప్పాడు.


యువతి కూడా అందుకు అంగీకరించడంతో ప్రేమకు గుర్తుగా ఒక ఖరీదైన గిఫ్ట్‌ను పంపిస్తున్నానని, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాక వెళ్లి తీసుకోవాలని యువతిని మభ్యపెట్డాడు. రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసి తాను ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారినని, మీకు వచ్చిన పార్శిల్‌ ఖరీదైనదని, ఇలాంటివి పార్శిల్‌ చేయడం నేరమని గొంతు మార్చి మాట్లాడాడు. పెద్ద మొత్తంలో జరిమానాతో పాటు ట్యాక్స్‌ కూడా చెల్లించాలని, రూ.10లక్షలు పంపిస్తేనే కేసు పెట్టకుండా వదిలేస్తామని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి తన వద్ద అంత డబ్బులేదని చెప్పి రూ.5.91లక్షలు ఆగంతకుడు సూచించిన బ్యాంక్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆ తర్వాత తనకు వచ్చిన అన్ని కాల్స్‌ నెంబర్లు స్విచ్చాఫ్‌ రావడం, తన వాట్సాప్‌, ఫోన్‌ నెంబర్లు బ్లాక్‌ చేసినట్లు కనిపించడంతో మోసపోయానని గ్రహించిన యువతి సిటీ సైబర్‌క్రైమ్స్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2021-07-18T15:02:38+05:30 IST