పెళ్లికి ఒత్తిడి తెచ్చిందని.. ప్రేయసి గొంతు కోసి హత్య!

ABN , First Publish Date - 2021-10-27T08:43:16+05:30 IST

రెండ్రోజులు లాడ్జి గదిలో బస చేశారా ప్రేమికులు. అక్కడికే బిర్యానీ, వోడ్కా తెప్పించుకున్నారు. మూడోరోజు ఉదయం గదికి తాళం వేసి ఉంది. అనుమానంతో హోటల్‌ సిబ్బంది తెరిచి చూస్తే అక్కడ రక్తపు మడుగులో యువతి మృతదేహం..

పెళ్లికి ఒత్తిడి తెచ్చిందని.. ప్రేయసి గొంతు కోసి హత్య!

  • శేరిలింగంపల్లి లాడ్జిలో యువకుడి ఘాతుకం


హైదరాబాద్‌ సిటీ /చందానగర్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రెండ్రోజులు లాడ్జి గదిలో బస చేశారా ప్రేమికులు. అక్కడికే బిర్యానీ, వోడ్కా తెప్పించుకున్నారు. మూడోరోజు ఉదయం గదికి తాళం వేసి ఉంది. అనుమానంతో హోటల్‌ సిబ్బంది తెరిచి చూస్తే అక్కడ రక్తపు మడుగులో యువతి మృతదేహం కనిపించింది. ఆమె మెడపై లోతైన కత్తి గాయాలున్నాయి. ఆమె ప్రియుడేమో ఆ గదికి తాళం వేసి స్వస్థలమైన ఏపీలోని ఒంగోలుకు వెళ్లిపోయాడు. అక్కడ కత్తితో గొంతు, పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతడిపై ఆమె ఒత్తిడి తెచ్చిందని.. కులాలు వేరుకావడంతో చేసుకోవడం ఇష్టంలేక ఆమెను అతడే హత్యచేశాడనేది కుటుంబసభ్యులు, బంధువుల ఆరోపణ.


అతడేమో, తామిద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆమే క్షణికావేశంలో గొంతు కోసుకుందని పోలీసులకు చెప్పాడు. సోమవారం రాత్రి నల్లగండ్లలోని ఓ లాడ్జిలో ఈ ఘటన వెలుగుచూసింది. మృతురాలి పేరు నాగచైతన్య. స్థానికులు, చందానగర్‌ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నాగచైతన్య స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా కరవాది. శేరిలింగంపల్లి పరిధి నల్లగండ్లలోని సిటిజన్‌ ఆస్పత్రి ఆంకాలజీ విభాగంలో గత మార్చిలో స్టాఫ్‌ నర్సుగా చేరింది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన కోటిరెడ్డి ఒంగోలులో మెడికల్‌  రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. తొలుత అదే ప్రాంతంలో స్టాఫ్‌ నర్సుగా నాగచైతన్య పనిచేసిన రోజుల్లో ఆమెతో కోటిరెడ్డికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. నాగచైతన్యది ఎస్సీ సామాజికవర్గం కావడంతో వీరి పెళ్లికి కోటిరెడ్డి కుటుంబీలు అంగీకరించలేదు. నాగచైతన్య హైదరాబాద్‌కు వచ్చేయడంతో కోటిరెడ్డి కూడా నగరంలోనే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నెల 23న సిటిజన్‌ ఆస్పత్రికి కోటిరెడ్డి వచ్చాడు. నల్లగండ్లలోని ఓ లాడ్జి గదిని అద్దెకు తీసుకుని నాగచైతన్యను వెంటబెట్టుకొచ్చాడు. ఆ గదిలోనే ఆమెతో కలిసి రెండ్రోజుల ఉన్నాడు. కాగా, తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య అతడిపై ఒత్తిడి చేసినట్లు, ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసినట్లు చెబుతున్నారు. కాగా 24న అర్ధరాత్రి కోటిరెడ్డి.. లాడ్జి గదికి తాళం వేసి ఒంగోలు పారిపోయాడు. అక్కడ  గొంతులో, కడుపులో కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడి రిమ్స్‌లో చికిత్సచేసి అతడిని డిశ్చార్జి చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు సోమవారం లాడ్జి గదికి చేరుకున్న పోలీసులు, నాగచైతన్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


పథకం ప్రకారం హత్య! 

నాగచైతన్య మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమే క్షణికావేశంలో గొంతు కోసుకుందని చెబుతున్న కోటిరెడ్డి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోటిరెడ్డి ఏ తప్పూ చేయనప్పుడు ఆమెను కాపాడే ప్రయత్నం  అతడెందుకు చేయలేదు? లాడ్జి సిబ్బందిని  పిలిచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన అతడికెందుకు రాలేదు?  డయల్‌-100కు  ఎందుకు ఫోన్‌ చేయలేదు? ఏడాదిగా ఇష్టపడుతున్న ప్రేయసి రక్తపుమడుగులో కొట్టుకుంటుంటే గదికి తాళం వేసి వెళ్లిపోవడం ఏమిటి? అని మృతురాలి కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని కోటిరెడ్డి తమ కూతురిని దారుణంగా హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా కోటిరెడ్డినే అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో నాగచైతన్యను హత్య చేసి కేసు నుంచి బయటపడేందుకు ఆత్మహత్యాయత్నం నాటకం ఆడుతున్నట్లుగా భావిస్తున్నారు.

Updated Date - 2021-10-27T08:43:16+05:30 IST