మాతృభూమి రక్షణలో..

ABN , First Publish Date - 2022-02-28T08:40:52+05:30 IST

యుద్ధోన్మాదంతో తమ దేశంపై విరుచుకుపడుతూ.. తమ మాతృభూమిని కబళించేందుకు దూసుకొస్తున్న శత్రువును అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ పౌరులు

మాతృభూమి రక్షణలో..

కదనరంగంలోకి దిగుతున్న పౌరులు

తుపాకీ చేతబట్టిన యువకులు, వృద్ధులు, మహిళలు, రాజకీయ నేతలు, బ్యూటీ క్వీన్‌లు


కీవ్‌, ఫిబ్రవరి 27: యుద్ధోన్మాదంతో తమ దేశంపై విరుచుకుపడుతూ.. తమ మాతృభూమిని కబళించేందుకు దూసుకొస్తున్న శత్రువును అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ పౌరులు ఉప్పొంగిన దేశభక్తితో కదనరంగంలోకి దిగుతున్నారు. యువకుల నుంచి వృద్ధుల దాకా, రాజకీయ నేతల నుంచి బ్యూటీ క్వీన్‌ల దాకా, ఐటీ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దాకా దేశం కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధపడుతున్నారు. బలవంతుడైన శత్రువును ఎదుర్కొంటున్నందున మాతృభూమిని కాపాడుకునేందుకు దేశ పౌరులు ముందుకు రావాలని, యుద్ధంలో పాలుపంచుకునేందుకు వచ్చిన వారికి ఆయుధాలు ఇస్తామంటూ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇచ్చిన పిలుపునందుకొని పెద్దసంఖ్యలో ప్రజలు రణరంగంలోకి దూకుతున్నారు. సైన్యం అందించే ఆయుధాలు తీసుకునేందుకు బారులు తీరుతున్నారు.


రాజధాని నగరం కీవ్‌లో అడుగుపెట్టిన రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. యూనిఫామ్‌ లేని సైనికుల్లా.. కార్లు, వ్యాన్లలో వీధుల్లో గస్తీ కాస్తున్నారు. చెక్‌పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ‘మాతృభూమి రక్షించుకోవడం నా బాధ్యత’ అంటూ బిజినెస్‌ మేనేజర్‌గా పనిచేసే ఒలెనా సొకోలన్‌, ‘రష్యా సైనికులు కీవ్‌లోకి వచ్చారో.. చచ్చారే’ అంటూ తుపాకీ చేతబట్టిన ఐటీ ఉద్యోగి రొమనోవ్‌,  ‘రష్యన్లు మా నగరాన్ని ఆక్రమించుకోలేరు. ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే వారికి పీడకల చూపిస్తాం’ ప్రజా సంబంధాల శాఖలో పనిచేసే అలెక్స్‌ అనే సాయుధుడైన యువకుడు హెచ్చరిస్తున్నారు. 


తుపాకీ పట్టడం తెలియకపోయినా..

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కంపెనీకి ఎననామిస్టుగా పనిచేససే ఐగర్‌(37) తుపాకీ కోసం క్యూలో నిలబడ్డారు. తాను ఏనాడూ సైన్యంలోగానీ, పోలీసు శాఖలో గానీ పని చేయలేదని, అయినా లక్ష్యాన్ని గురి చూసి కొట్టగలనన్న నమ్మకం ఉందని, తమపైకి వచ్చే ఆక్రమణదారులను వదిలిపెట్టేదిలేదని అన్నారు. కాగా, రష్యన్లకు వారు ఎక్కడ అడుగుపెట్టామన్న విషయం తెలిసినట్లు లేదని, తాము తెలియజేస్తామని కీవ్‌లోని ఓ నైట్‌క్లబ్‌ మేనేజర్‌ అయిన డెనిస్‌ మతాష్‌(33) అన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా సిద్ధమేనని అదే నైట్‌క్లబ్‌లో డ్యాన్సర్‌ అయిన గ్రిగరీ మాంచుర్‌(40) అన్నారు. ఇక కీవ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే 58 ఏళ్ల ఐహార్‌ ఝలోబా కూడా తుపాకీ పట్టారు. తన భార్య, కూతుళ్లకు కొంత ఆందోళన ఉన్నా.. ఎవరూ అభ్యంతరం మాత్రం చెప్పలేదన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో నివాసముండే విదేశీయుల్లో ఎవరైనా పోరాటంలో పాలుపంచుకునేందుకు ముందుకువస్తే రావచ్చునని పార్లమెంటు సభ్యుడు వేసిలెంకో పిలుపునిచ్చారు. వీరితో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్‌ మహిళలు పోరాటంలో పాలుపంచుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. మహిళా ఎంపీ కైరా రుడిక్‌ కూడా తుపాకీ చేతబట్టారు. 


కదనరంగంలో బ్యూటీ క్వీన్‌..

ఉక్రెయిన్‌ బ్యూటీ క్వీన్‌గా అంతర్జాతీయ స్థాయి అందాల పోటీల్లో పాల్గొన్న మహిళ.. ఇప్పుడు తుపాకీ చేతబట్టి రష్యా సైనికులకు వ్యతిరేకంగా పోరాటంలోకి దిగారు. గతంలో మిస్‌ గ్రాండ్‌ ఉక్రెయిన్‌గా ఎంపికైన అనస్తాసియా లెన్నా.. 2015 మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ కాంటె్‌స్టలో ఆ దేశం తరఫున పాల్గొన్నారు. తాజాగా దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునందుకొని సైన్యంలో చేరారు. ఆయుధ చేత పట్టిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో లెన్నా షేర్‌ చేశారు. సరిహద్దు దాటి ఉక్రెయిన్‌లోకి ఎవరు అడుగు పెట్టినా అంతం చేస్తానంటూ హెచ్చరిక చేశారు. 




తుపాకుల కోసం పౌరుల బారులు..

శనివారం ఎడారిని తలపించిన కీవ్‌ నగర వీధుల్లో ఆదివారం ఉదయం కొంత జనసంచారం కనిపించింది. ప్రజలు ఏటీఎంల వద్ద, నిత్యావసరాల కోసం, యుద్ధరంగంలోకి దూకేందుకు తుపాకుల కోసం బారులు తీరారు. కీవ్‌లోని ఓ ఆర్మీ నియామక కేంద్రం వద్ద ఏకే 47 రైఫిళ్లు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో పౌరులు క్యూ కట్టారు. కాగా, వారికి తుపాకీ అప్పగించేముందు వారందరినీ ఓ బృందంగా ఏర్పాటుచేస్తూ వారిలోనే ఒకరిని కమాండర్‌గా నియమిస్తున్నారు. వీరిని గుర్తించేందుకు పసుపు రంగు బ్యాండ్లు ధరింపజేస్తున్నారు. కాగా, జన్మభూమిని కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకొస్తున్నారని, ఈ పరిణమాన్ని రష్యా ఊహించి ఉండకపోవచ్చన ఉక్రెయిన్‌ అధ్యక్ష సిబ్బంది చీఫ్‌ మిఖైలో పొడోల్యాక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-28T08:40:52+05:30 IST