- గదిలో బంధించి చితకబాదిన బాధితురాలి కుటుంబసభ్యులు
- పరస్పరం పోలీసులకు ఫిర్యాదు
- ఇరువర్గాలపై కేసు నమోదు
హైదరాబాద్/ఏఎస్‌రావునగర్ : మద్యం మత్తులో ఓ యువకుడు రాత్రి వేళ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాకుండా దుర్భాషలాడిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాంపల్లి సత్యనారాయణనగర్ కాలనీకి చెందిన శ్యామల లింగస్వామి ఈ నెల 26న రాత్రి 9.30గంటల సమయంలో అతిగా మద్యం తాగి ఓ గృహిణి ఇంట్లో చొరబడి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆందోళనకు గురైన గృహిణి బయటకు పరుగెత్తికొచ్చి ఎదురు తిరగడంతో దుర్భాషలాడుతూ నానా రభస సృష్టించాడు. దీంతో ఇరుగుపొరుగు వారు పోగవడం ఇంతలో విషయం తెలిసి బయట ఉన్న భర్త, సోదరులు వచ్చి లింగస్వామిని చితకబాదారు.
అనంతరం జరిగిన సంఘటనపై బాధితురాలు 27న తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో కుటుంబసభ్యులతో కలిసి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో 27న మధ్యాహ్నం చిన్న చర్లపల్లిలో కనిపించిన లింగస్వామిని బాధితురాలి భర్త, సోదరులు మరోసారి ఈసీనగర్‌లోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ గదిలో బంధించి కాళ్లు, చేతులు కట్టేసి కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటనను నిందితులు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో లింగస్వామి తల్లి శ్యామల సైదమ్మ అదే రోజు తన కుమారుడిని సదరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.