మద్యం మత్తులో యువకుడి హత్య

ABN , First Publish Date - 2020-12-01T06:26:58+05:30 IST

మద్యం మత్తులో ఓ యువకుడు హతమయ్యాడు.

మద్యం మత్తులో యువకుడి హత్య
మృతుడు భరత్‌యాదవ్‌.

  తిరుపతి (నేరవిభాగం), నవంబరు 30:మద్యం మత్తులో ఓ యువకుడు హతమయ్యాడు.మృతుడి కుటుంబీకులు, సీఐ శివప్రసాదరెడ్డి కథనం మేరకు...తిరుపతి నగరంలోని లక్ష్మీపురంలో టీడీపీ నేత నరిసింహయాదవ్‌కు సమీప బంధువైన భరత్‌ యాదవ్‌ (19) కుటుంబం నివాసముంటోంది.అదేవీధిలో శంకర్‌(22) అనే కుర్రాడు కుటుంబంతో నివాసముంటున్నాడు.శంకర్‌ తన స్నేహితుడు గణేష్‌తో కలసి లక్ష్మీపురం కాలనీలోని సాయిబాబా ఆలయ సమీపంలో ఆదివారం రాత్రి మద్యం తాగారు. ఇదే సమయంలో తిరుచానూరుకు చెందిన పవన్‌ అనే యువకుడిని అక్కడికి పిలిచిన శంకర్‌ అతడితో గొడవపడి చేయిచేసుకున్నాడు. దీంతో పవన్‌ ఆగ్రహంతో భరత్‌యాదవ్‌కు చెప్పి నీ సంగతి తేలుస్తానంటూ హెచ్చరించాడు.దీంతో ‘భరత్‌ నా సంగతి చూడ్డమేంటి... నేనే వాడి సంగతి చూస్తాను’ అంటూ శంకర్‌ అప్పటికప్పుడే భరత్‌ ఇంటికి వెళ్లి అతడిని బయటకు పిలిచాడు. జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ భరత్‌తో గొడవపడడమే కాకుండా అతనిపై దాడిచేసి కొట్టాడు. తనపై జరిగిన దాడి గురించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ భరత్‌ బెడ్‌రూమ్‌లో ఉండిపోయాడు. భోజనం చేసేందుకు కూడా హాల్లోకి రాకపోవడంతో ఆరా తీసిన భరత్‌ తండ్రి రాజా విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో తమ కుమారుడిని తీసుకుని శంకర్‌ ఇంటికివెళ్లి అతన్ని నిలదీశారు. ఈ క్రమంలో  శంకర్‌పై భరత్‌ తండ్రి రాజా చేయిచేసుకున్నాడు. దీంతో ఆవేశానికి గురైన శంకర్‌ కత్తితో భరత్‌ను పొట్టలో పొడిచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన భరత్‌ను రుయాస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రినుంచి  రుయాలో చికిత్స పొందుతున్న భరత్‌ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో హత్యకేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం సాయంత్రానికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.కాగా తిరుపతిలో ఇటీవల బాలాజీ టింబర్‌డిపోను దౌర్జన్యంగా ఆక్రమించాలని ప్రయత్నించిన కేసులో శంకర్‌  కూడా నిందితుడు కావడం,ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి ఉన్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది.భరత్‌యాదవ్‌ టీడీపీ నేత నరిసింహయాదవ్‌కు సమీప బంధువు కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, ఏపీ విభాగ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఆయన్ను ఫోన్లో పరామర్శించారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భరత్‌యాదవ్‌కు నివాళులర్పించారు. 


Updated Date - 2020-12-01T06:26:58+05:30 IST