Shocking : 5 మీటర్ల ఎత్తులో యువకుడు.. కాచుకుని చూస్తున్న సింహం.. ఎన్‌క్లోజర్‌లోకి దూకే యత్నం.. ఎందుకా అని ఆరా తీస్తే..!

ABN , First Publish Date - 2021-11-24T15:01:31+05:30 IST

ఐదు మీటర్ల ఎత్తులో యువకుడు, దాని కిందనే కాచుకుని చూస్తున్న సింహం. సందర్శకుల భయాందోళనలు...

Shocking : 5 మీటర్ల ఎత్తులో యువకుడు.. కాచుకుని చూస్తున్న సింహం.. ఎన్‌క్లోజర్‌లోకి దూకే యత్నం.. ఎందుకా అని ఆరా తీస్తే..!

  • బంగారం, రత్నాల కోసమట..!
  • సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు
  • మానసిక స్థితి సరిగాలేదని ప్రాథమిక విచారణలో వెల్లడి

హైదరాబాద్ సిటీ/మదీన : ఐదు మీటర్ల ఎత్తులో యువకుడు, దాని కిందనే కాచుకుని చూస్తున్న సింహం. సందర్శకుల భయాందోళనలు, కేకలు, హాహాకారాలతో జూపార్కులో ఒక్కసారిగా కలకలం రేగింది. సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ఓ యువకుడు దూకే ప్రయత్నం చేయగా, సిబ్బంది అడ్డుకున్నారు. కీసరకు చెందిన సాయి కుమార్‌ మంగళవారం జూను తిలకించడానికి వచ్చాడు. ఆఫ్రికన్‌ సింహాలు ఉండే ఎన్‌క్లోజర్‌ వద్దకెళ్లాడు. అందులో ఏడేళ్ల వయసు గల మనోహర్‌ (ఆఫ్రికన్‌ సింహం) పచార్లు చేస్తోంది. ఇంతలో వెనుక నుంచి సాయికుమార్‌ ఎన్‌క్లోజర్‌ ఎక్కి, సందర్శకులు వారిస్తున్నా వినకుండా దూకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమాత్రం కాలుజారినా, పట్టుతప్పినా నేరుగా సింహం ముందే పడిపోయేవాడు.


అప్రమత్తమైన జూ సిబ్బంది

సాయికుమార్‌ ఎన్‌క్లోజర్‌లోకి దూకేందుకు ప్రయత్నించడం గమనించిన యానిమల్‌ కీపర్లు సింహాల దృష్టి మర ల్చే పనిలో పడ్డారు. యువకుడిని పట్టుకోవడానికి కొందరు, సింహాన్ని వెనక్కి రం పించడానికి మరికొందరు ప్రయత్నాలు చేశారు. చివరకు యువకుడిని యానిమల్‌ కీపర్లు వెనుక నుంచి పట్టుకుని బయటికి తీసుకువచ్చారు. బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. అతడు చెప్పిన చిరునామాకు వెళ్లి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ‘సింహాలు తిరిగే ప్రాంతంలో బంగారం, రత్నాలు ఉంటాయని, వాటిని తీసుకోవడానికి ఎన్‌క్లోజర్‌లోకి దిగాలనుకున్నాను’ అని చెప్పడం విశేషం.


భద్రత డొల్లతనం..

జూపార్కులో కట్టుదిట్టమైన భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తరచూ ఏదో ఒక సంఘటన వెలుగుచూస్తోంది. యానిమల్‌ కీపర్లు, సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అందరి కళ్లుగప్పి ఓ యువకుడు సింహాల ఎన్‌క్లోజర్‌పైకి ఎక్కడం కలకలం రేపుతోంది. జూపార్కులో భద్రత విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-11-24T15:01:31+05:30 IST