డ్రైనేజీ తీసేదానివి.. ఉద్యమాలు ఎందుకు? కస్టడీలో నొదీప్‌ అనుభవాలు

ABN , First Publish Date - 2021-03-02T23:09:50+05:30 IST

జైల్లో మహిళా ఖైదీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నాపై జరిగిన కిరాతక హింస గురించి జైలులో ఉన్న మహిళలకు చెప్పినప్పుడు వాళ్లు ఎలాంటి ఆశ్చర్య వ్యక్తం చేయలేదు. నిజానికి నాపై ఏమేం జరిగిందనే ఒక అంచనాలో వారు ఉండి ఉంటారు

డ్రైనేజీ తీసేదానివి.. ఉద్యమాలు ఎందుకు? కస్టడీలో నొదీప్‌ అనుభవాలు

న్యూఢిల్లీ: కార్మిక వేతన బకాయిల కోసం పోరాడుతూ అరెస్టై జైలు శిక్ష అనుభవించిన కార్మిక హక్కుల కార్యకర్త నొదీప్ కౌర్.. కస్టడీ సమయంలో తనపై జరిగిన వేధింపుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కులం పేరుతో దూషిండమే కాకుండా డ్రైనేజీ పనులు చేసుకునే వారికి ఉద్యమాలు ఎందుకంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, భౌతికంగా తనపై దాడులకు కూడా పాల్పడ్డారని నొదీప్ కౌర్ మంగళవారం పేర్కొన్నారు. 46 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన నొదీప్.. జైలులో మహిళా ఖైదీల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.


‘‘నన్ను చాలా హింసించారు. నేను దళిత అమ్మాయిని కాబట్టే నాపై హింసకు పాల్పడ్డారు. ‘దళితులు డ్రైనేజీ తీసేవారు. నువ్వు కూడా అదే పని చేయాలి. ప్రజల్ని ఏకం చేయడం, ఉద్యమాలు చేయడం నువ్వెందుకు చేస్తున్నావు?’ అంటూ నన్ను ప్రశ్నించారు. బయటికి చెప్పలేని భాషలో నన్ను తిట్టారు. నా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. గంటల తరబడి నన్ను కొట్టారు. ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా దళిత యువతిగా నేను ఈ హింసను ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను దళిత యువతిని కాకపోయుంటే ఈ స్థాయిలో హింసను ఎదుర్కునేదాన్ని కాదు’’ అని నొదీప్ చెప్పుకొచ్చారు.


ఇక జైలులో ఉన్న మహిళా ఖైదీల గురించి మాట్లాడుతూ ‘‘జైల్లో మహిళా ఖైదీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నాపై జరిగిన కిరాతక హింస గురించి జైలులో ఉన్న మహిళలకు చెప్పినప్పుడు వాళ్లు ఎలాంటి ఆశ్చర్య వ్యక్తం చేయలేదు. నిజానికి నాపై ఏమేం జరిగిందనే ఒక అంచనాలో వారు ఉండి ఉంటారు. వాళ్లు ఇలాంటి పరిస్థితులు తరుచూ ఎదుర్కొంటున్నారు. నేను కష్టడీలో ఉన్న జైలులో సుమారు 200 మంది మహిళా ఖైదీలు ఉంటారు. చాలా చిన్న చిన్న కేసుల కారణంగా వారంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. జైలులో ఉన్న మహిళా ఖైదీల్లో ఎక్కువ మంది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినవారే’’ అని నొదీప్ అన్నారు.


పంజాబ్-హర్యానా హైకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడంతో 46 రోజుల అనంతర కస్టడీ నుంచి ఫిబ్రవరి 26న నొదీప్ కౌర్ జైలు నుంచి విడుదల అయ్యారు. హర్యాణాలోని కుండలీ ఇండస్ట్రియల్ ఏరియాలో వేతన బకాయిల కోసం పోరాడుతున్న కార్మికులతో కలిసి నొదీప్ కౌర్ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నౌదీప్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నొదీప్ కౌర్ ఇన్ని రోజులు హర్యానాలోని కర్నాల్ జైల్లో ఉన్నారు.  జనవరి 12న అరెస్టైన ఆమెకు శుక్రవారం బెయిల్ లభించింది. నొదీప్ విడుదల గురించి అమెరికా ఉపాధ్యక్షులు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ ఒక ట్వీట్ చేశారు. నెల రోజులకు పైగా జైలులో ఉన్న 25 ఏళ్ల భారత కార్మిక హక్కుల కార్యకర్త నొదీప్ కౌర్‌ను విడుదల చేయాలని తన ట్వీట్‌లో ఆమె కోరారు. అంతే కాకుండా నోదీప్ కౌర్ అరెస్ట్ మీద అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమమైంది.

Updated Date - 2021-03-02T23:09:50+05:30 IST