మీ అమ్మ గ్రేట్‌ అన్నారు

ABN , First Publish Date - 2022-05-11T05:13:58+05:30 IST

విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నా... తన వ్యవసాయ మూలాల మీద ప్రేమతో రైతుగా మారారు తెలుగు మహిళ కొణతం విశాలి.

మీ అమ్మ గ్రేట్‌ అన్నారు

విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నా... తన వ్యవసాయ మూలాల మీద ప్రేమతో రైతుగా మారారు తెలుగు మహిళ కొణతం విశాలి. ఆమెరికాలోని వర్జీనియాలో 43 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఆమె అక్కడి స్థానిక ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏకైక భారతీయ మహిళ రైతు కూడా. విశాలి ‘నవ్య’తో పంచుకున్న సాగు సంగతులు...


‘‘నాది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. ఎస్‌ఎస్‌సి వరకు మోత్కూరులో, ఇంటర్మీడియట్‌ నల్లగొండలో, డిగ్రీ, పీజీ హైదరాబాదులో చదివాను. 2005లో ఎన్‌ఆర్‌ఐ మొగుళ్ల శ్రీధర్‌రెడ్డితో నా వివాహం జరిగింది. ఆయనతో కలిసి అమెరికా వెళ్లాను. అక్కడ  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాను. మాకు ఇద్దరు కుమార్తెలు. 


నాన్నే ప్రేరణ

మా నాన్న పేరు కొణతం బక్కారెడి ్డ. మాది రైతు కుటుంబం. వ్యవసాయం మీద పెద్దగా లాభం రాకపోయినా నాన్న పలు రకాల పంటలు సాగు చేసేవారు. జీవించినంతకాలం వ్యవసాయాన్ని వదలలేదు. మోత్కూరులో మా ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలం ఉంది. అందులో నా అమ్మా, నాన్నా రకరకాల కూరగాయలు పండించేవారు. పూల మొక్కలు పెంచేవారు. నేను కూడా సెలవుల్లో తోట పనులు చేసేదాన్ని. మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని బుజిలాపురానికి చెందిన మా అత్తగారిది కూడా రైతు కుటుంబమే. అందుకే... వర్జీనియాలోని లౌడెన్‌ కౌంటీలో...  ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో మేము ఉంటున్న ఇంటి పెరట్లో కూరగాయల సాగు ప్రారంభించాను. అలా ఏడేళ్ళు చేశాక... ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేయాలనిపించింది. ఆ ఆలోచనను నా భర్తకు చెబితే... ఇక్కడ వ్యవసాయం చేయడం అంత సులువు కాదన్నారు.

చివరకు ఒప్పుకున్నారు. ఆ తరువాత ఆయన, మా అక్క కూతురు అర్చన గట్టి మద్దతుగా నిలిచారు. అక్కడ ఎకరం భూమిని లీజుకు తీసుకున్నాను. అందులో మన ప్రాంతంలో లభించే టమాట, కాకర, దోసకాయ, బీన్స్‌, పొట్ల, సొర, బెండ లాంటి కూరగాయలు, పలు రకాల ఆకుకూరలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి లాంటి 43 రకాల భారతీయ పంటలను సేంద్రియంగా సాగుచేస్తున్నాను. మా పంటలను రెస్టారెంట్లకు, స్టోర్స్‌లకూ అమ్మకుండా వినియోగదారులకే నేరుగా విక్రయించాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ తాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా దొరకవు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని, రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసినవే ఎక్కువ. తమ కళ్లముందే పండించిన తాజా కూరగాయలు ఇస్తుండడంతో మా ఉత్పత్తులకు జనం నుంచి డిమాండ్‌ బాగానే ఉంది. వినియోగదారులే వచ్చి స్వయంగా కోసుకొని... తీసుకెళ్లారు. సుమారు ఎనభై కుటుంబాలు మా దగ్గర రెగ్యులర్‌గా కొంటాయి. ఆర్డర్‌ చేస్తే... సమీపంలో ఉన్నవారికి హోం డెలివరీ కూడా చేస్తున్నాం. వచ్చే ఏడాది వ్యవసాయాన్ని అయిదు ఎకరాలకు పెంచాలని, అక్కడ ఒక స్టోర్‌ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం.


ఉత్తమ రైతుగా...

ఒకరోజు... మా అమ్మాయి సాహితి చదువుతున్న స్కూల్‌ ఆడిటోరియంలో కార్యక్రమం ఒకటి నిర్వహించారు. అందులో అందరికీ బుక్‌లెట్స్‌ పంచారు. అలాగే 20 నిమిషాల నిడివి ఉన్న వీడియో ప్రదర్శించారు. వీడియో చూసిన వెంటనే విద్యార్థులు ఐదో తరగతి చదువుతున్న మా అమ్మాయిని ‘‘విశాలి మీ అమ్మే కదా!’’ అని అడగడం మొదలెట్టారు. సాహితి ‘‘అవును... మా అమ్మే, తను రైతు’’ అని గర్వంగా చెప్పింది. లౌడెన్‌ కౌంటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ (స్థానిక ప్రభుత్వం) ప్రతి సంవత్సరం 10 మంది ఉత్తమ రైతులను నామినేట్‌ చేస్తుంది. ఈ ఏడాది ఆ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ మహిళా రైతును నేనే. ‘వ్యవసాయం కూడా ఒక వృత్తే’ అనే అవగాహన కలిగించడం ఆ సంస్థ ప్రధానోద్దేశం. అందులో భాగంగానే బుక్‌లెట్స్‌ ముద్రించి పంచుతారు. వీడియోలు ప్రదర్శిస్తారు. స్థానిక ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన రైతులు... విద్యార్థులను వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్ళి... స్థానిక పంటల ప్రాధాన్యాన్ని వివరిస్తారు. పాఠశాలలో వీడియో చూసిన విద్యార్థులు ‘‘సాహితీ! మీ అమ్మ గ్రేట్‌’’ అన్నారని మా అమ్మాయి చెప్పినప్పుడు... నాకెంతో ఆనందం కలిగింది. 


తీరిక దొరికితే పొలానికే...

ఉదయం అయిదు గంటలకు వ్యవసాయ క్షేత్రానికి వెళతాను. ఎనిమిదిన్నరకు తిరిగి ఇంటికి వస్తాను. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ఆఫీస్‌ వర్క్‌ చేస్తాను. ఆ తర్వాత వీలైతే మరోసారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తాను. శని, ఆదివారాలు, సెలవు రోజులు ఎక్కువగా అక్కడే ఉంటాం. ప్రతీదీ ప్రణాళికాబద్ధంగా చేస్తాను... కాబట్టే వ్యవసాయం విజయవంతంగా సాగుతోంది. భవిష్యత్తులో డెయిరీ ఏర్పాటు చేయాలనీ, సీజనల్‌ పండ్లు పండించాలనీ ఉంది. ఎవరినైనా నేను కోరేది ఒక్కటే... మీ మూలాలకు దూరం కావద్దు.’’

- కాగితాల నర్సిరెడ్డి, మోత్కూరు.


సాహితి చదువుతున్న స్కూల్‌లో 20 నిమిషాల నిడివి ఉన్న వీడియో ప్రదర్శించారు. వీడియో చూసిన వెంటనే విద్యార్థులు ఐదో తరగతి చదువుతున్న మా అమ్మాయిని ‘‘విశాలి మీ అమ్మే కదా!’’ అని అడగడం మొదలెట్టారు. సాహితి ‘‘అవును... మా అమ్మే, తను రైతు’’ అని గర్వంగా 

చెప్పింది. 

Read more