మీ సొమ్ము భద్రం!

ABN , First Publish Date - 2020-03-07T08:16:40+05:30 IST

యెస్‌ బ్యాంక్‌ డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ హామీ ఇచ్చారు. ఈ అంశంలో సత్వర పరిష్కారం కోసం భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కృషి చేస్తోందని శుక్రవారంనాడు ఆమె తెలిపారు.

మీ సొమ్ము భద్రం!

  • యెస్‌ బ్యాంక్‌ డిపాజిటర్లకు ఆర్థిక మంత్రి నిర్మల హామీ 
  • సత్వర పరిష్కారం కోసం ఆర్‌బీఐ కృషి 
  • 49 శాతం వాటా తీసుకునేందుకు ఎస్‌బీఐ రెడీ 

ప్రైవేట్‌ రంగంలోని యెస్‌ బ్యాంక్‌ కార్యకలాపాలపై ఆర్‌బీఐ మారటోరియం విధించటంతో డిపాజిటర్లు, ఖాతాదారుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో బ్యాంక్‌ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. మీ సొమ్ముకు మాదీ పూచీ అంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ హామీనిచ్చారు. మరోవైపు ఆర్‌బీఐ కూడా నడుం బిగించింది. బ్యాంకును సత్వరమే గాడిలో పెట్టేందుకు ఒక పునరుద్ధరణ ప్రణాళికకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. ఆర్‌బీఐ ప్రకటనకు అనుగుణంగా యెస్‌ బ్యాంకులో 49 శాతం వాటాలను తీసుకునేందుకు దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ముందుకొచ్చింది. డిపాజిటర్లు 30 రోజుల్లో కేవలం రూ.50 వేలు మాత్రమే తీసుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం.. తాజాగా అత్యవసర వైద్య ఖర్చులు, ఉన్నత చదువులు, వివాహాలు సహా ఇతర అవసరాల కోసం రూ.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే విధంగా మినహాయింపును ఇస్తున్నట్లు  ప్రకటించింది. ప్రభుత్వం హామీనిచ్చినా బ్యాంకు శాఖల ముందు ఖాతాదారులకు ఇంకా నమ్మకం మాత్రం కలగటం లేదు. 


న్యూఢిల్లీ: యెస్‌ బ్యాంక్‌ డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ హామీ ఇచ్చారు. ఈ అంశంలో సత్వర పరిష్కారం కోసం భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కృషి చేస్తోందని శుక్రవారంనాడు ఆమె తెలిపారు. ఆర్‌బీఐతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతున్నాయని, ఈ అంశంలో త్వరగా పరిష్కారం కనుగొననున్నట్టు ఆర్‌బీఐ హామీ ఇచ్చినట్టు నిర్మల చెప్పారు. డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్క ఖాతాదారు సొమ్ము భద్రంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఏ ఒక్క డిపాజిటర్‌కు నష్టం కలగదని ఆర్‌బీఐ హామీ ఇచ్చిందన్నారు. డిపాజిటర్లు, బ్యాం కులు, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె చెప్పారు. రిజర్వు బ్యాంకు సమస్య ను పూర్తిగా అర్థం చేసుకున్నదని, త్వరలోనే సరైన పరిష్కారం కల్పిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ హామీ ఇచ్చారని అన్నారు. గత కొంత కాలంగా యెస్‌ బ్యాంక్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తున్నామన్నారు. ఆర్‌బీఐ వద్ద ఉన్న సమాచారాన్ని తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని నిర్మల  తెలిపారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకునే అందరి ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 


ఒక్క  బ్యాంక్‌కు సంబంధించిన సమస్యే

ప్రస్తుతం నెలకొన్న సమస్య కేవ లం యెస్‌ బ్యాంక్‌కు సంబంధించినదే తప్ప మొత్తం బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించినది కాదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ అన్నారు. ‘‘యెస్‌ బ్యాంక్‌ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రణాళికను వెలువరించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది’’ అని ఆయన చెప్పారు. 


ఎక్కడ తప్పు జరిగిందో ఆర్‌బీఐ చూసుకుంటుంది

యెస్‌ బ్యాంకులో ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించాలని భారత రిజర్వు బ్యాంక్‌ను కోరినట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2017 నుంచే బ్యాంక్‌ కార్యకలాపాలను ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్‌లో పరిపాలనాపరమైన అంశాలతో పాటు నియంత్రణాపరమైన నిబంధనల అమల్లో బలహీనతను గుర్తించినట్టు తెలిపారు. 2018 సెప్టెంబరులో కొత్త సీఈఓ నియామకం జరిగిన తర్వాతి నుంచి బ్యాంక్‌ను చక్కబెట్టడం మొదలైందని వివరించారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థలు కూడా గుర్తించాయన్నారు. సమస్యలకు గల కారణాలను మదింపుచేయాలని ఆర్‌బీఐని కోరామని, వ్యక్తులు పోషించిన పాత్రను కూడా నిగ్గుతేల్చాలని కోరినట్టు ఆమె చెప్పారు. 30 రోజుల్లో పునర్‌వ్యవస్థీకరణ పథకం పూర్తిగా అమల్లోకి వస్తుందన్నారు. యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌బీఐ ఆసక్తి చూపిందని చెప్పారు. ఏడాదిపాటు యెస్‌ బ్యాంక్‌ ఉద్యోగుల ఉద్యోగం, వేతనానికి హామీ ఇస్తున్నామన్నారు. కాగా అనిల్‌ అంబానీ గ్రూప్‌, ఎస్సెల్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, వొడాఫోన్‌ వంటి సంస్థలకు యెస్‌ బ్యాంక్‌ అప్పులు ఇచ్చింది. 


యూపీఐ లావాదేవీలపై ప్రభావం

యెస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. యూపీఐ విభాగంలో యెస్‌ బ్యాంక్‌ వాటా చాలా కీలకంగా ఉంది. గత జనవరిలో మొత్తం 130 కోట్ల యూపిఐ లావాదేవీలు జరగ్గా ఇందులో 51.4 కోట్ల లావాదేవీలను యెస్‌ బ్యాంక్‌ ప్రాసెస్‌ చేసింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లకన్నా యెస్‌ బ్యాంక్‌ యూపీఐలో ముందుంది. ఫోన్‌పే తన యూపీఐ పార్ట్‌నర్‌గా డిజిటల్‌ చెల్లింపుల కోసం యెస్‌బ్యాంక్‌ను వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారంనాడు ఫోన్‌పే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్‌, రెడ్‌బస్‌, వంటి సంస్థలు కూడా తమ లావాదేవీల్లో ఇబ్బందులను ఎదుర్కోవచ్చంటున్నారు. 


పోటెత్తిన కస్టమర్లు.. భారీ  క్యూలు

యెస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారటోరియం విధించడం, నెల రోజుల పాటు రూ.50,000 మాత్రమే ఖాతా నుంచి తీసుకునేలా ఆంక్షలు విధించడంతో బ్యాంక్‌ కస్టమర్లలో ఆందోళన మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచే బ్యాంక్‌ శాఖలు, ఏటీఎంలకు కస్టమర్లు భారీగా పోటెత్తారు. ఏ శాఖ వద్ద చూసినా కస్టమర్లు భారీ సంఖ్యలో కనిపించారు. 


చిక్కుల్లో పూరీ జగన్నాథుడి సొమ్ము 

యెస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై సాధారణ డిపాజిటర్లే కాదు. ఆ బ్యాంకులో తమ నిధులు డిపాజిట్‌ చేసిన ఆలయాలూ లబోదిబో మంటున్నాయి. పూరి జగన్నాధ ఆలయ అధికారులైతే ఈ బ్యాంకులో రెండు ఖాతాల్లో ఏకంగా రూ.545 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఇందులో ఒక డిపాజిట్‌ ఈ నెల 16న, మరో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఈ నెల 29న ముగుస్తాయి. గడువు తీరిన తర్వాత ఈ డిపాజిట్లను ఏదైనా జాతీయ బ్యాంక్‌కు బదిలీ చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ లోపే బ్యాంకు నుంచి నిధుల ఉపసంహరణపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. 


కుప్పకూలిన షేరు 

ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో శుక్రవారంనాడు యెస్‌ బ్యాంక్‌ షేరు స్టాక్‌ మార్కెట్లో కుప్పకూలింది. భారీగా అమ్మకాల ఒత్తిడి జరగడంతో ఇంట్రాడేలో బీఎ్‌సఈలో షేరు 84.93 శాతం క్షీణించి రూ.5.55కు చేరుకుంది. ఇది 52 వారాల కనిష్ఠ స్థాయి. అయితే చివరకు కాస్త కోలుకుని 56.04 శాతం నష్టంతో రూ.16.20 వద్ద ముగిసింది. ఎన్‌ఎ స్‌ఈలో 54.89 శాతం తగ్గి రూ.16.60 వద్ద క్లోజైంది. బీఎ్‌సఈలో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.5,266.23 కోట్ల నుంచి రూ.4,131.77 కోట్లకు దిగజారిపోయింది. 


వేగంగా చర్యలు : ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌

యెస్‌ బ్యాంక్‌పై మారటోరియం విధించడాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సమర్థించుకున్నారు. యెస్‌ బ్యాంక్‌కు సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించనున్నామని హామీ ఇచ్చారు. ‘‘యెస్‌ బ్యాంక్‌కు సంబంధించిన అంశాల పరిష్కారం వేగవంతంగా జరుగుతుంది. 30 రోజుల గరిష్ఠ పరిమితి ఉంది. డిపాజిటర్ల ప్రయోజనాలను పూర్తి గా కాపాడతాం’’ అని శక్తికాంత దాస్‌ విలేకరులతో అన్నారు. అంతర్గత పరిష్కారం కోసం తగిన సమయం ఇచ్చినప్పటికీ యెస్‌ బ్యాంక్‌ సరైన పరిష్కారంతో రాలేకపోయిందని చెప్పారు. 


రూ.1,300 కోట్ల టీటీడీ నిధులు సేఫ్‌ 

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుచూపు నిర్ణయంతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన రూ.1300 కోట్లు సేఫ్‌ జోన్‌లోకి వచ్చాయి. సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ నుంచి గత ఏడాది అక్టోబరులోనే టీటీడీ రూ.1300 కోట్ల డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. టీటీడీ గతంలో భద్రతా కారణాల దృష్ట్యా జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేసేది. ఒకవైపు ఖర్చులు పెరుగటంతో పాటు డిపాజిట్‌ చేసే మొత్తం తగ్గుతూ వచ్చాయి. టీటీడీ వడ్డీ ఆదాయాన్ని పెంచుకోవాలనే నిర్ణయంతో ప్రైవేట్‌ బ్యాంకుల పైపు మొగ్గుచూపింది. ఈ క్రమంలోనాలుగేళ్లుగా ప్రైవేట్‌ బ్యాంకుల్లోనూ డిపాజిట్లు చేయడం ప్రారంభించారు. అందులోభాగంగానే రూ.4,650 కోట్లను ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసింది. ఇండ స్‌ఇండ్‌ బ్యాంకులో రూ.1,300 కోట్లు, యెస్‌ బ్యాంక్‌లో రూ.1,300 కోట్లు, సౌత్‌ ఇండియా బ్యాంక్‌లో రూ.1300 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకులో రూ.600 కోట్లు, ఫెడరల్‌ బ్యాంక్‌లో రూ.150 కోట్లు డిపాజిట్‌ చేసింది. మరోవైపు ప్రైవేట్‌ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లను వ్యతిరేకిస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించినా టీటీడీ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్ధించింది. కాగా, తాజా పాలకమండలి ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్లపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే యెస్‌ బ్యాంక్‌లోని రూ.1300 కోట్ల డిపాజిట్ల కాలపరిమితి ముగియటంతో టీటీడీ వెనక్కు తీసుకుంది. బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసి తిరిగి డిపాజిట్లను వెనక్కు తీసుకుని జాతీయ బ్యాంక్‌కు మళ్లించాలని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి టీటీడీఆర్థిక శాఖాధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇతర ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను కూడా వెనక్కు తీసుకుని జాతీయ బ్యాంకుల్లోకి మళ్లించాలని టీటీడీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-03-07T08:16:40+05:30 IST