మీసేవలు మాకొద్దు

ABN , First Publish Date - 2021-06-25T06:23:32+05:30 IST

సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించిన రెండు గ్రామాల ప్రజలు గ్రామ సచివాలయానికి తాళం వేశారు.

మీసేవలు మాకొద్దు
సచివాలయానికి తాళం వేసిన గ్రామస్థులు

  1. సచివాలయానికి తాళం వేసిన ప్రజలు
  2. సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితుల ఆగ్రహం


మద్దికెర, జూన్‌ 24: సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించిన రెండు గ్రామాల ప్రజలు గ్రామ సచివాలయానికి తాళం వేశారు. ‘మీ సేవలు మాకు అవసరం లేదు’ అని సిబ్బందిని బయటకు పంపి నిరసన తెలిపారు. ఈ ఘటన మద్దికెర మండలం బసినేపల్లి, మదనంతపురం గ్రామ సచివాయలంలో చోటు చేసుకుంది. ఈ రెండు గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా బసినేపల్లి సమీపంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అర్జీలను ఆన్‌లైన్‌ చేయడానికి సిబ్బంది తమను రోజుల తరబడి తిప్పుకుంటున్నారని, కొందరు డబ్బులు అడుగుతున్నారని బాధితులు ఆరోపించారు. మదనంతపురంలో కొత్తగా ఆన్‌లైన్‌ చేసిన రేషన్‌ కార్డులలో పేర్లు, బంధుత్వాలను గందగోళంగా నమోదు చేశారని, దీంతో 20 మంది పింఛన్లు ఎగిరిపోయాయని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని 15 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ గ్రామం నుంచి సచివాలయానికి రావాలంటే 4 కి.మీ. ఉందని, ఇబ్బంది పడుతున్నామని అన్నారు. వన్‌ బీ, అడంగల్‌, ఈసీ, రేషన్‌కార్డులు, జగనన్న చేయూత, జగనన్న తోడు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. ఇలా ఏ పనులూ సకాలంలో చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తీరుకు నిరసనగా కార్యాలయానికి తాళం వేశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో నరసింహమూర్తి గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు సచివాలయాన్ని తెరిచేందుకు ఒప్పుకున్నారు. ఆందోళనలో పత్తికొండ మార్కెట్‌యార్డు డైరెక్టర్‌ భద్రయ్య, మాజీ సర్పంచ్‌ ప్రతాప్‌, బసినేపల్లి నాయకులు చౌడప్ప, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-25T06:23:32+05:30 IST