యూత్‌ కాంగ్రెస్‌ బాహాబాహీ

ABN , First Publish Date - 2020-09-18T05:39:06+05:30 IST

యువజన కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ రణరంగానికి దారితీసింది. పదవి కోసం పోటీపడుతున్న

యూత్‌ కాంగ్రెస్‌ బాహాబాహీ

ఖమ్మం జిల్లా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాల ఘర్షణ 


ఖమ్మం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : యువజన కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ రణరంగానికి దారితీసింది. పదవి కోసం పోటీపడుతున్న ఇద్దరు నేతల అనుచరులు బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు... రాళ్లు రువ్వుకున్నారు. ఖమ్మంలో గురువారం జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 20నుంచి ఈనెల 20వరకు యువజన కాంగ్రెస్‌ జిల్లాల అధ్యక్ష ఎన్నికలను ఆన్‌లైన్‌లో జరపాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్నికకు మరో మూడురోజులు మాత్రమే గడువు ఉండగా.. ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవికి బత్తుల రుద్రప్రతాప్‌, యడ్లపల్లి సంతోష్‌ పోటీపడుతున్నారు. ఈ క్రమంలో రూ.50 చెల్లించి 18ఏళ్లనుంచి 35ఏళ్లలోపు వారు ఈ యువజన కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరి ఓటేసే అవకాశం ఉంది.


దీంతో ఖమ్మంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు గురువారం సభ్యత్వం తీసుకుని ఓటువేసే ప్రయత్నంలో ఉండగా యువజన కాంగ్రెస్‌లోని రుద్రప్రతాప్‌, సంతోష్‌ వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. ఘర్షణకు దారితీసింది. అదికాస్తా పిడిగుద్దులు గుద్దుకుని, రాళ్లువిసురుకునే స్థాయికి వెళ్లింది. దీంతో సదరు కళాశాల సమీపంలో ఈ ఘటన జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన నేపథ్యంలో ఇరువర్గాల కార్యకర్తలు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఖమ్మం నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కార్పొరేటర్‌ దీపక్‌చౌదరిపై కూడా ఓ వర్గానికి చెందిన కార్యకర్తలు ఫిర్యాదు చేయగా.. తాను ఘర్షణ జరుగుతున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లానని, పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకూడన్న ఆలోచనతో వారికి సర్దిచెప్పానని దీపక్‌చౌదరి పేర్కొన్నారు. మొత్తంమీద జిల్లా యువజన కాంగ్రెస్‌ ఎన్నిక నేపథ్యంలో రెండువర్గాలు బహిరంగంగా బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-09-18T05:39:06+05:30 IST