ఆరోగ్య బీమాపై యువత మొగ్గు

ABN , First Publish Date - 2021-01-03T06:05:18+05:30 IST

కొవిడ్‌-19 అనంతరం యువత ఆరోగ్య బీమాకు పెద్ద పీట వేస్తోంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కొనుగోలు సమయంలో స్నేహితులు, కుటుంబం,

ఆరోగ్య బీమాపై యువత మొగ్గు

ఐసీఐసీఐ లొంబార్డ్‌ అఽధ్యయనంలో వెల్లడి


కొవిడ్‌-19 అనంతరం యువత ఆరోగ్య బీమాకు పెద్ద పీట వేస్తోంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కొనుగోలు సమయంలో స్నేహితులు, కుటుంబం, సహోద్యోగుల సలహాలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా దక్షిణాదిలో ఐసీఐసీఐ లొంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.


దక్షిణాదిలో 786 మందిపై అధ్యయనాన్ని నిర్వహించగా గత ఆరు నెలల్లోనే కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేసిన వారు 38 శాతం మంది ఉన్నారు. 56 శాతం మంది ఏడాది క్రితం కొనుగోలు చేసిన పాలసీనే కొనసాగిస్తున్నారు. పని చేస్తున్న సంస్థలు బీమా సౌకర్యం కల్పించడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రజలు ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని, తాజా పరిణామాలతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని అధ్యయనం వెల్లడించింది. అనుకోని అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎదురయ్యే ఖర్చులను అధిగమించడానికి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేస్తున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న 85 శాతం మంది పేర్కొన్నారు.


గత ఆరు నెలల్లో కొవిడ్‌-19ను కవర్‌ చేసే పాలసీల కొనుగోలు 42 శాతం పెరిగింది. 31-35 వయసు మధ్య ఉన్న వారిలో 51 శాతం, 36-40 వయసు మధ్య ఉన్న వారిలో 55 శాతం మంది  ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం కూడా ఆరోగ్య బీమాను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. పాలసీలు తీసుకోని వారి కంటే ఎక్కువగా పాలసీలు తీసుకున్న వారు కొవిడ్‌ రాకుండా ఎక్కువ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. 

-హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)


Updated Date - 2021-01-03T06:05:18+05:30 IST