పదేపదే రోడ్లపైకి యువత

ABN , First Publish Date - 2020-03-27T09:19:17+05:30 IST

లాక్‌డౌన్‌లో సడలింపు పెంపుతో కొందరు అదేపనిగా వాహనాలతో రోడ్లపైకి వచ్చి రయ్‌రయ్‌ మంటూ వెళ్తున్నారు. దీంతో కరోనా ముప్పు తీవ్రమవుతుందని ఆందోళన...

పదేపదే రోడ్లపైకి యువత

  • మధ్యాహ్నం వరకు వాహనాలు రయ్‌రయ్‌
  • సడలింపుతో ముప్పే అంటున్న మేధావులు
  • ‘తూర్పు’న 969 మందిపై కేసులు నమోదు
  • 4.84 లక్షల జరిమానా విధింపు
  • వినూత్న శిక్షలతోనూ అవగాహన

(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌) : లాక్‌డౌన్‌లో సడలింపు పెంపుతో కొందరు అదేపనిగా వాహనాలతో రోడ్లపైకి వచ్చి రయ్‌రయ్‌ మంటూ వెళ్తున్నారు. దీంతో కరోనా ముప్పు తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యావసర సరుకుల కోసం తొలుత ఉదయం 6-9గంటల మధ్య ఇళ్ల నుంచి బయటికి రావడానికి వెసులుబాటు కల్పించారు. ఆ సమయంలో జనం రైతుబజార్లకు పోటెత్తడంతో సామాజిక దూరాన్ని పాటించాలన్న నియమం పట్టు తప్పింది. ఈ నేపథ్యంలో సడలింపును మధ్యాహ్నం ఒంటిగంట వరకు పొడిగించడంతో గురువారం విజయవాడలో లాక్‌డౌన్‌ పట్టుతప్పినట్టు కనిపించింది. కొందరు వాహనదారులు అదేపనిగా మధ్యాహ్నం వరకూ రహదారులపై తిరుగుతూనే కనిపించారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురేసి రావడం మామూలైపోయింది. ఇలాచేస్తే లాక్‌డౌన్‌ వల్ల ప్రయోజనం ఏముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. నగర వాసుల్లో సామాజిక స్పృహ కొరవడిందని మేధావులు అంటున్నారు.  స్వీయ నియంత్రణ పాటించకపోతే పరిణామాలు ప్రమాదకంగా మారిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలించినా కాకినాడ, రాజమహేంద్రవరం, ఇతర పట్టణాల్లో రైతుబజార్లకు జనం పోటెత్తారు. సామాజిక దూరం పాటించకుండా ఒకరినొకరు నెట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వాహనదారులపై జిల్లావ్యాప్తంగా పోలీసులు 969 కేసులు నమోదు చేశారు. రూ.4.84లక్షల జరిమానా విధించారు. కాకినాడ సర్పవరంజంక్షన్‌లో కొంతమంది యువకులు, పిల్లలు రోడ్లపైకి రావడంతో పోలీసులు వారికి కరోనా జాగ్రత్తల ప్లకార్డులు ఇచ్చి రోడ్డుపై నిలబెట్టారు. ఏలూరులో పదేపదే బైక్‌లపై తిరిగిన యువకులను మిట్టమధ్యాహ్నం చెప్పులు లేకుండా ఎండలో నిలబెట్టారు. 


ఎక్కడికక్కడే కట్టడి

కరోనా కట్టడిలో భాగంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు గురువారం స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి వస్తున్న కూలీలు, విద్యార్థులను ఒంగోలు, మేదరమెట్ల, బల్లికురవ ప్రాంతాల్లో పోలీసులు ఆపేసి వైద్యపరీక్షలు నిర్వహించారు.  విశాఖపట్నంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో అదనంగా 18 రైతుబజార్లు ఏర్పాటుచేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో చేపలుపట్టే పనులకు వచ్చిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 50మంది మత్స్యకారులను పలమనేరు బీసీ హాస్టల్‌కు తర లించారు. కురబలకోట మండలంలో తరగతులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు విద్యాసంస్థను జిల్లా యంత్రాంగం సీజ్‌ చేసింది. వి.కోట వ్యవసాయ మార్కెట్‌కు తరలించిన టమాటాను ఎగుమతిచేసే అవకాశం లేకపోవడంతో రైతులు చెత్తదిబ్బల్లో పారబోశారు. 


లాక్‌డౌన్‌లో రోడ్డుపైకొచ్చి దుర్మరణం

8 పోలీసులు తరమడంతో రాయిపై పడిన యువకుడు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చిన ఓ యువకుడు పోలీసులు తరమడంతో రాయిపై పడి దుర్మరణం చెందాడు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన సిద్ధయ్యస్వామి, గౌరమ్మ దంపతుల కుమారుడు వీరభద్రయ్య స్వామి (20) బెంగళూరులో గౌండా పనిచేసేవాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పనులు ఆగిపోవడంతో రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చేశాడు. గురువారం రాత్రి మరికొందరితో కలిసి వీరభద్రయ్యస్వామి గ్రామ శివారులో రోడ్డుపైకి వచ్చాడు. పోలీసులు వారిని తరమడంతో  వీరభద్రయ్యస్వామి కాలుజారి రోడ్డుపై ఉన్న రాయిపై పడ్డాడు. తలకు దెబ్బతగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దీంతో గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.  


Updated Date - 2020-03-27T09:19:17+05:30 IST