చూశాలే కళ్లారా..!

ABN , First Publish Date - 2021-02-10T07:34:04+05:30 IST

ఇద్దరు ప్రేమికులు... వాళ్లను తరుముతూ నలుగురు రౌడీ పోరగాళ్లు. ఇళ్లు దాటుకుంటూ... సందుల్లో నుంచి జారుకుంటూ... చేల గట్లపై పరిగెత్తుతూ రౌడీ గ్యాంగ్‌ను పరిగెత్తిస్తుంటారు ప్రేమికులు. చివరకు అలసట వచ్చి ఇక అడుగు కూడా వేయలేక చతికిలబడిన రౌడీ గ్యాంగ్‌...

చూశాలే కళ్లారా..!

ఇద్దరు ప్రేమికులు... వాళ్లను తరుముతూ నలుగురు రౌడీ పోరగాళ్లు. ఇళ్లు దాటుకుంటూ... సందుల్లో నుంచి జారుకుంటూ...  చేల గట్లపై పరిగెత్తుతూ రౌడీ గ్యాంగ్‌ను పరిగెత్తిస్తుంటారు ప్రేమికులు. చివరకు అలసట వచ్చి ఇక అడుగు కూడా వేయలేక చతికిలబడిన రౌడీ గ్యాంగ్‌... ‘చికెను, మటను తినేటోళ్లం మేమే అలసిపోయాం. ఇంకా మీరెట్లా పరిగెడగలుగుతున్నార్రా’ అని అడుగుతుంది. ‘బూస్ట్‌ ఈజ్‌ అవర్‌ సీక్రెట్‌ ఆఫ్‌ ఎనర్జీ’ అంటుంది ఆ ప్రేమ జంట. కట్‌ చేస్తే... ఇది కథ. దీన్ని ఓ సినిమాగా తీయాలని నిర్మాత దగ్గరకు వెళతాడు ఓ ఔత్సాహిక దర్శకుడు. నిర్మాతకు కథ నచ్చి, త్వరలోనే పని ప్రారంభిద్దాం అంటాడు. వెంటనే తన మిత్రుడు రాజుకు ఫోన్‌ చేసి ‘మన గ్రామంలో ఒక జానపద గీతం తీయాలి. అన్నీ సిద్ధం చేసి ఉంచు’ అని చెబుతాడా యువ దర్శకుడు.సరేనంటాడు రాజు. ఆ పనులన్నీ పర్యవేక్షించడానికి బైక్‌పై ఊరు బయలుదేరుతాడు దర్శకుడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఎన్నో ఆశలు ఉన్నాయిగా...’ అంటూ ఓ పాట. ఊరు చేరుకొంటాడు దర్శకుడు.


‘ఇంతకీ అమ్మాయిని వెతికి పెట్టమన్నా. వెతికావా’ అడుగుతాడు రాజుని. ‘ఆల్‌రెడీ డ్యాన్స్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తోంది. చూద్దాం రా’ అని స్నేహితుడిని గుడికి తీసుకుపోతాడు రాజు. అక్కడ డ్యాన్స్‌ చేస్తున్న అనూషను స్నేహితుడికి పరిచయం చేస్తాడు రాజు. ఆమె అతడికి షేక్‌హ్యాండ్‌ ఇస్తే... ‘అవన్నీ తరువాత గానీ, ముందు నీ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ ఎంతవరకు వచ్చింది’ అని అడుగుతాడు దర్శకుడు. ‘అయినా నేను జానపద గీతం తీయాలని చెబితే... ఈమేమో క్లాసికల్‌ డ్యాన్స్‌ చేస్తుంది. ఎలారా’ అంటాడు. ‘అరే మామా... ఏదైతేనేం... ఎగురుడేగా కావాల్సింది’ అంటాడు రాజు. దర్శకుడి ప్రవర్తనకు నొచ్చుకున్న అనూష ‘ఇతనికి చానా పొగరున్నట్టుంది’ అని తనలో తాను అనుకుంటుంది ఆ అమ్మాయి. షూటింగ్‌ మొదలువుతుంది. ఆమె డ్యాన్స్‌ మూమెంట్స్‌లో ఫీల్‌ ఉండదు. దాని కోసం టేకులపై టేకులు తీసుకుంటుంది. దర్శకుడికి కోపం వస్తుంది. ‘అంత మంచిగా ప్రాక్టీస్‌ చేసినావు కదా... ఏమైంది’ ఆమెను అడుగుతాడు రాజు. ‘ఆయన అంత కోపంగా చెబుతుంటే నాకు భయమైంది’... నెమ్మదిగా చెబుతుంది ఆమె. షూటింగ్‌ రేపటికి వాయిదా పడుతుంది. జనాల మధ్యనుంటే తనకు ఇబ్బందిగా ఉందనుకుని జనసంచారం లేని లొకేషన్‌కు మారుస్తాడు. మళ్లీ అదే పరిస్థితి. ‘రెండు రోజులు టైమడుగు. ఈసారి పక్కాగా చేస్తా’ అని రాజుతో అంటుంది అనూష. చేసేది లేక ప్యాకప్‌ చెబుతాడతడు. రాత్రి డాబాపైన పార్టీ పెట్టుకున్న యువ దర్శకుడికి పక్కింట్లో సాధన చేస్తున్న అనూష కనిపిస్తుంది. ఆమె అంకితభావానికి ముచ్చటపడతాడు. తెల్లారుతుంది. షూటింగ్‌ షురూ... ‘చిటారు కొమ్మన చిట్టెమ్మా... చెప్పమ్మా నా వాడెవరే...’ పాట వస్తుంటే... అనూష అభినయంతో అదరగొట్టేస్తుంది. పాట బాగా వచ్చినందుకు మనోడు హ్యాపీ. పాటను నిర్మాతకు పంపిస్తాడు. ఆయనకు అనూష బాగా నచ్చి, తననే సినిమాలో హీరోయిన్‌గా పెడదామంటాడు. ఆనందంగా ఆ విషయం అనూషకు చెబుతాడు. కానీ ఆమె లైట్‌గా తీసుకుంటుంది. ‘నాకు ఇవన్నీ నచ్చవు. ఆ పాట కూడా నీ కోసమే చేసినా’ అంటుంది. ‘నా కోసం చేయడమేంటి? రాజు గాడు చెబితే చేశావు కదా’ అంటాడు. ‘నీకు ఇంకా అర్థం అవడంలేదా? నేను నిన్ను లవ్‌ చేస్తున్నా’ అని చెప్పగానే అతడు కోపంగా ‘నాకు గోల్‌ ఉంది. ఇలాంటివి పడవు’ అని ఛీ కొట్టి వెళ్లిపోతాడు అనిల్‌. చివరకు ఏమైందన్నది ‘చూశాలే కళ్లారా’ షార్ట్‌ఫిలిమ్‌లో చూడాల్సిందే! సత్య కొమ్మినేని కథ, మాటలు, దర్శకత్వం ఆకట్టుకుంటాయి. రాజు, అనిల్‌, స్నేహా శర్మల నటన లఘుచిత్రం చూస్తున్నామన్న ఆలోచనే రానివ్వదు. మట్ల తిరుపతి సంగీతం అలరిస్తుంది. ఈ నెల 3న యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పటికి 8 లక్షల మందికి పైగా వీక్షించారు.

Updated Date - 2021-02-10T07:34:04+05:30 IST