యూట్యూబ్‌ మొనాలిసా!

ABN , First Publish Date - 2021-06-10T05:30:00+05:30 IST

లియొనార్డొ డావిన్సీ చిత్రించిన మొనాలిసా పెయింటింగ్‌ ఎంత ప్రపంచ ప్రసిద్ధి పొందిందో మనందరికీ తెలుసు. అదే పేరున్న ఓ ఒడిషా మహిళ సాహసోపేతమైన, వినూత్నమైన వీడియోలతో

యూట్యూబ్‌ మొనాలిసా!

లియొనార్డొ డావిన్సీ చిత్రించిన మొనాలిసా పెయింటింగ్‌ ఎంత ప్రపంచ ప్రసిద్ధి పొందిందో మనందరికీ తెలుసు. అదే పేరున్న ఓ ఒడిషా మహిళ సాహసోపేతమైన, వినూత్నమైన వీడియోలతో యూట్యూబ్‌ మొనాలిసాగా పేరు తెచ్చుకుంది. 2.26 మిలియన్ల మంది సబ్‌స్ర్కైబర్లను సంపాదించుకున్న మొనాలిసా యూట్యూబ్‌ వీడియోలు వేటికవి ప్రత్యేకం!


మొనాలిసా భద్ర, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ సంప్రదాయ గృహిణి. ఆమెది ఒడిషాలోని జాజ్‌పూర్‌ జిల్లా, జహాల్‌ గ్రామం. చీర కట్టుతో, తల కొంగుతో సిగ్గరిగా కనిపించే మొనాలిసా, అదే చీర కట్టుతో గుర్రపు స్వారీ చేస్తుంది. అవలీలగా బుల్లెట్‌ నడిపేస్తుంది. నాగలి పట్టుకుని పొలం దున్నుతుంది. కొండల మీద ట్రక్కునూ పరిగెత్తిస్తుంది. ఈ పనులతో ఓ సాదా సీదా గృహిణి అయిన మొనాలిసా కొద్ది కాలంలోనే యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగిపోయింది. మహిళలు తలచుకుంటే ఒంటపట్టించుకోలేని విద్య లేదంటూ, భిన్నమైన పనుల మీద పట్టు సాధించి సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. మొనాలిసా యూట్యూబ్‌ స్టార్‌గా ఎదగడానికి ఆమె భర్త బద్రీనారాయణ్‌ భద్ర కారణం. సినీ రంగంలో అతనికున్న పూర్వానుభవం యూట్యూబ్‌ ఛానల్‌ ఆలోచనకు ఊతమిచ్చింది. 


భర్త ప్రోత్సాహంతో...

16 ఏళ్ల పాటు ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ సినీ థియేటర్లలో, సినీ డైరెక్షన్‌ బృందాలతో కలిసి పనిచేసిన బద్రీనారాయణ్‌, 2016లో తిరిగి ఒడిషాలోని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ ఊర్లో కోతులు ఎక్కువ. తరచుగా ఇంటి మీద దాడి చేస్తూ, అల్లరి చేస్తున్న కోతులకు వేరుసెనగ పప్పులు తినిపిస్తూ, బద్రి భార్య మొనాలిసా వాటిని మచ్చిక చేసుకుంది. అదంతా బద్రి తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీసి, తనకున్న పరిజ్ఞానంతో ఎడిట్‌ చేసి భార్య మొనాలిసాకు చూపించాడు. వీడియో బాగుంది, దాన్ని యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ఇద్దరికీ వచ్చింది. అలా ఆ జంట ‘బద్రి నారాయణ్‌ భద్ర’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను మొదలుపెట్టింది. మొనాలిసా భిన్నమైన పనులు చేస్తుంటే, వాటిని తన ఫోన్‌ ద్వారా చిత్రించి, ఎడిట్‌ చేసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం ఆమె భర్త బద్రి పని. అలా ఇప్పటివరకూ వేలకొద్దీ వీడియోలను ఆ జంట అప్‌లోడ్‌ చేసింది.


ప్రారంభంలో కొంత తడబడినా, బద్రి యూట్యూబ్‌ ద్వారానే షూటింగ్‌, ఎడిటింగ్‌ల మీద పట్టు సాధించి, ఆసక్తి కలిగించే తన భార్య వీడియోలను అప్‌లోడ్‌  చేయడం మొదలుపెట్టాడు. వీడియోల కోసం అతను ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకోలేదు. అందుకోసం భార్య మొనాలిసా కూడా ప్రత్యేకంగా నటించనూ లేదు. దైనందిన జీవితంలో చేసే పనులనే వాళ్లు వీడియోలుగా రికార్డు చేసుకునేవాళ్లు. అలా బుల్లెట్‌ నడుపుతూ, గుర్రపుస్వారీ చేస్తూ, ట్రక్కు నడుపుతూ కనిపించే మొనాలిసా వీడియోలు ఐదేళ్ల కాలంలో మిలియన్లకొద్దీ సబ్‌స్ర్కైబర్లను సంపాదించిపెట్టాయి. 


ఆదాయం.... ఒకటిన్నర లక్ష!

యూట్యూబ్‌ వ్యూలను పెంచుకునే మెలకువలు, వాటిని పెంచుకుంటే వచ్చే సంపాదన గురించి బద్రికి పెద్దగా అవగాహన లేదు. కాబట్టే వ్యూలను పెంచుకునే ప్రయత్నాలూ చేయలేదు. అయితేనేం.... మొనాలిసా వీడియోలకు వ్యూలు, సబ్‌స్కైృబర్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోయాయి. 2017 మే నెలలో మొట్టమొదటిసారి బద్రి, యూట్యూబ్‌ నుంచి 110 డాలర్ల పేమెంట్‌ (సుమారు 8 వేలు) అందుకున్నాడు. తాజాగా 2.28 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లతో బద్రి నారాయణ్‌ భద్ర యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఈ దంపతులు ఏకంగా ఒకటిన్నర లక్షల రూపాయల నెలసరి ఆదాయాన్ని గడిస్తూ ఉండడం విశేషం!

Updated Date - 2021-06-10T05:30:00+05:30 IST