‘చేయూత’ మొదలు!

ABN , First Publish Date - 2020-08-13T07:47:11+05:30 IST

‘చేయూత’ మొదలు!

‘చేయూత’ మొదలు!

ఖాతాల్లో నేరుగా రూ.18,750 జమ

23 లక్షల కుటుంబాలకు మేలు

మహిళలకు వ్యాపార అవకాశాలు : ముఖ్యమంత్రి 


అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు లబ్ధి చేకూర్చే ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాలకు చెందిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ‘‘మొదట పెన్షన్‌ రూపంలో డబ్బులు ఇద్దామనుకున్నాం. అయితే 45 ఏళ్లకు పెన్షనేంటని వెటకారం చేశారు. అందుకే ఏటా రూ.18,750 వంతున ఇచ్చేలా ఈ పథకాన్ని తీసుకొచ్చాం. నాలుగేళ్లలో ప్రతి అక్కా చెల్లెలు రూ.75 వేలతో జీవితాలను మార్చుకునే అవకాశం కలిగింది. మేనిఫెస్టోలో పెట్టిన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన రెండో ఏటనే అమలు చేస్తున్నాం. పాత అప్పులకు జమ చేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాల్లోకి పంపుతున్నాం’ అని వివరించారు. మహిళలకోసం పలు వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నామని జగన్‌ తెలిపారు. అమూల్‌, రిలయన్స్‌, హిందూస్థాన్‌ లీవర్‌, ప్రాక్టర్‌ అండ్‌ గాంబల్‌, ఐటీసీ తదితర దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ప్రభుత్వం చూపుతున్న వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలని, దాని ద్వారా మేలు పొందాలనుకుంటే ఆప్షన్‌ ఇవ్వొచ్చని చెప్పారు. దీనికోసం బ్యాంకులతో కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు. ‘గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు రెండు పేజీల లేఖతో మీ ముందుకొస్తారు. ఏటా ఇచ్చే రూ.18,750లు మీ ఇష్టం వచ్చినదానికి వాడుకోవచ్చు. సుమారు 23 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది’ అని పేర్కొన్నారు. 


రివైజ్డ్‌ స్టయిపెండ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ఫలించిన జూనియర్‌ డాక్టర్ల పోరు...ఉత్తర్వులు జారీ 

జూనియర్‌ డాక్టర్ల రివైజ్డ్‌ స్టయిపెండ్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూనియర్‌ డాక్టర్లు రెండేళ్ల నుంచి దీనికోసం పోరాటం చేస్తున్నారు. రివైజ్డ్‌ స్టయిపెండ్‌కు ఆమోదం తెలుపుతూ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది.

Updated Date - 2020-08-13T07:47:11+05:30 IST