YS Jagan 25 ఏళ్ళు CM.. ఆ తర్వాత PM : వైసీపీ ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-11-26T21:03:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పట్నుంచి ఇవాళ్టి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు...

YS Jagan 25 ఏళ్ళు CM.. ఆ తర్వాత PM : వైసీపీ ఎమ్మెల్సీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పట్నుంచి ఇవాళ్టి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భజనకు హద్దు లేకుండా పోయింది.! ఒకరేమో సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై పొగొడ్తల వర్షం కురిపిస్తే.. ఇంకొందరు కవితలు.. మరికొందరైతే ఏకంగా ‘సీఎం’ను కాస్త ‘కాబోయే ప్రధాని’ అని వ్యాఖ్యానించేశారు. ఇలా పొగడ్తలకే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎక్కువ సమయం గడిచిపోవడం గమనార్హం. అసెంబ్లీలో ప్రజలకు పనికొచ్చే విషయాలు చర్చించడం కంటే.. పొగడ్తలే ఎక్కువయ్యాయని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.


‘జగన్‌ 25 ఏళ్ళు సీఎం.. ఆ తర్వాత ప్రధాని’..

అయితే ఇన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఇంకాస్త డోస్ పెంచి మరీ వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారే తప్ప ఏ ఒక్కరూ తగ్గట్లేదు. పైన చెప్పిన విషయాలన్నీ ఒక ఎత్తయితే.. ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అసెంబ్లీలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇవాళ సమావేశాల్లో భాగంగా.. మండలిలో ఇక్బాల్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కచ్చితంగా ప్రధాన మంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన.. దీన్ని ఇంకాస్త వివరంగా చెబుతూ ‘జగన్‌ 25 ఏళ్ళు సీఎం.. ఆ తర్వాత ప్రధాని’ అంటూ ఎమ్మెల్సీ మాట్లాడారు. ఈయన వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎమ్మెల్సీలే నవ్వుకోవడం గమనార్హం.


ఏకగ్రీవంగా ఎన్నిక..

ఇవాళ మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన జకియా ఖానంకు ఇక్బాల్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ మహిళకు సీఎం జగన్ పెద్ద పదవితో గౌరవించారని ఇక్బాల్‌ చెప్పుకొచ్చారు. కాగా.. మండలి సభ్యులంతా జకీయా ఖానంను డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన జకీయా ఖానంను సీఎం, ఇతర ఎమ్మెల్సీలు కలిసి సభా స్థానాల్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ఇక్బాల్ ధన్యవాదాలు తెలుపుతూ పై వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు.

Updated Date - 2021-11-26T21:03:36+05:30 IST