జగన్ క్లాస్ ఎఫెక్ట్.. విజయసాయి అత్యవసర సమావేశం!

ABN , First Publish Date - 2020-11-13T17:47:31+05:30 IST

విశాఖ ‘రచ్చ’పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

జగన్ క్లాస్ ఎఫెక్ట్.. విజయసాయి అత్యవసర సమావేశం!

విశాఖపట్నం : విశాఖ ‘రచ్చ’పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం విదితమే. ఈ తరుణంలో ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో అత్యవసర సమావేశం అయ్యారు. శుక్రవారం నాడు ఉదయం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మ శ్రీ, ఎంపీ సత్యనారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో చేరికలతో పాటు పలు కీలక విషయాలపై చర్చించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీ జరిగింది. ఇవాళ సాయంత్రం.. గత రెండు మూడ్రోజులుగా వస్తున్న సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలపై విజయసాయిరెడ్డి మీడియా మీట్ నిర్వహించి మరీ మాట్లాడుతారని తెలియవచ్చింది.


ఎలాంటి విబేధాల్లేవ్..

కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. అత్యవసర సమావేశం అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన నేతలు మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఏమీ లేకున్నా కొంత మంది పనిగట్టుకుని మరీ రచ్చ చేస్తున్నారంటూ వాసుపల్లి మండిపడ్డారు. కేవలం సంక్షేమ పథకాలపై మాత్రమే ఈ భేటీలో చర్చించామన్నారు. ప్రజల సమస్యల్ని ఎమ్మెల్యేలు చెబుతారని.. వాటినే డీఆర్సీ సమావేశంలో చర్చించామని చెప్పుకొచ్చారు. జిల్లాలో నేతలందరం కలిసి సమన్వయంతో పని చేస్తామని గణేష్ మీడియా వెల్లడించారు.


వక్రీకరించారు..!

భేటీ అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. అధిష్టానానికి ఎమ్మెల్యేలకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. డీఆర్సీ మీటింగ్‌లో లేనివి ఉన్నట్లు మీడియా చూపించే ప్రయత్నం చేసింది. అనకాపల్లిలో నాడు నేడు కార్యక్రమం సవ్యంగా జరగాలని మీటింగ్‌లో ప్రస్తావించాను. అయితే కొందరు దాన్ని వక్రీకరించి చూపించారు. డీఅర్సీ అంశంపై అమరావతి వెళ్లామని ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు వార్తలు రాసుకున్నారు. సీఎం జగన్ గారి నుంచి మాకు పిలుపే రాలేదు.. మేం అమరావతికే వెళ్లలేదు. కొందరేమో మేం అమరావతికి వెళ్లామని వార్తలు రాసేసుకున్నారు.. అసలు మేం ఎందుకు వెళ్లాం..? ఎప్పుడు వెళ్లాం? అని మీడియా ప్రతినిధులనే అమర్నాథ్ ప్రశ్నించారు.


అసలేం జరిగింది..!?

కాగా.. విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్షామండలి(డీడీఆర్‌సీ) సమావేశంలో, భూముల వ్యవహారంపై ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్‌ మధ్య ఇటీవల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరును ఉద్దేశించి విజయసాయి చేసిన వ్యాఖ్యలతో ధర్మశ్రీ, అమర్నాథ్‌ విభేదించారు. ఈ సందర్భంగా విజయసాయిపై ఎమ్మెల్యేలు ఎదురుతిరగడం పత్రికలకెక్కింది. వెంటనే స్పందించకుంటే, ఈ వ్యవహారం రాష్ట్రమంతటికీ పాకవచ్చని భావించిన పార్టీ అధినేత, సీఎం జగన్‌ ఇరువర్గాలను గురువారం పిలిపించారు. తక్షణమే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తనను కలవాలని వారిని ఆదేశించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు, విశాఖ వ్యవహారాలపై వారిని జగన్‌ ఆరా తీశారు. భూముల వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతల జోక్యానికి సంబంధించి తన వద్ద ఉన్న చిట్టా విప్పారు. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలని.. బహిరంగ సమావేశాల్లో వాటి ప్రస్తావన మంచిది కాదని ఇరుపక్షాలకూ సీఎం హితవు పలికారని సమాచారం. ఈ వ్యవహారాలన్నింటిపైనే ఇవాళ జరిగిన భేటీలో చర్చించినట్లు తెలియవచ్చింది.

Updated Date - 2020-11-13T17:47:31+05:30 IST