కేసీఆర్‌ను గద్దె దించుతాం

ABN , First Publish Date - 2021-10-21T08:24:57+05:30 IST

రాష్ట్రంలో పాలనను సీఎం కేసీఆర్‌ గాలికొదిలేశారని, తన కుటుంబ సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

కేసీఆర్‌ను గద్దె దించుతాం

కుటుంబ పాలనను అంతమొందిస్తాం.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేసీఆర్‌

బుల్లెట్‌ ఫ్రూఫ్‌ భవనంలో రాజభోగాలు.. ప్రగతి భవన్‌ దాటని స్వరాష్ట్ర ఫలాలు

కమీషన్ల కోసం కాళేశ్వరంలో మార్పులు.. ఏడేళ్లలో 8 వేల మంది రైతుల ఆత్మహత్య

నోటిఫికేషన్లు రాక కూలీలైన నిరుద్యోగులు.. వందలాది మంది బలవన్మరణాలు

సమస్యల్లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. ప్రశ్నించేవారు లేకే కేసీఆర్‌ మోసాలు

ఇప్పుడు మేమొచ్చాం.. ప్రశ్నిస్తాం.. పాలనను ప్రజల చేతుల్లో పెట్టేందుకే పాదయాత్ర

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థాన యాత్ర ప్రారంభం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రాష్ట్రంలో పాలనను సీఎం కేసీఆర్‌ గాలికొదిలేశారని, తన కుటుంబ సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేసేందుకు, ఆయనను గద్దె దించేందుకే ప్రజా ప్రస్థాన యాత్ర చేపట్టానని అన్నారు. బుధవారం చేవెళ్లలో ఆమె ప్రజా ప్రస్థాన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలోఅధికార టీఆర్‌ఎ్‌సతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలపై షర్మిల ఘాటు విమర్శలు చేశారు. తన తండ్రి వైఎ్‌సఆర్‌ చూపిన బాటలోనే నడుస్తానన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవంటున్న టీఆర్‌ఎస్‌ నేతలు దమ్ముంటే తనతో పాదయాత్రకు రావాలని సవాల్‌ చేశారు. సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాసి ఇంటికెళ్లిపోతానని, సమస్యలు ఉంటే సీఎం క్షమాపణలు చెప్పి.. రాజీనామా చేసి దళితుణ్ని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. రాష్ట్రంలో వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నోటిఫికేషన్లు రాక ఎంతో మంది కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందు 1.90 లక్షల మంది ఉద్యోగ ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఇవ్వకపోగా, ఉన్న 30 వేల ఉద్యోగాలు పీకేశారని మండిపడ్డారు. ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. స్వరాష్ట్ర ఫలాలు ప్రగతి భవన్‌ గేటు దాటి అందుతున్నాయా? అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేసీఆర్‌ కుటుంబానికే దక్కాయన్నారు. 


దొర కాళ్ల కింద నలుగుతున్న తెలంగాణ

కేసీఆర్‌ ఏనాడైనా ప్రజల కోసం పనిచేశారా? సచివాలయానికి వచ్చారా? ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రా? లేక ఉప ఎన్నిక జరుగుతున్న ప్రాంతానికా? అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. అత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణ.. దొరగారి కాళ్ల కింద నలిగిపోతోందన్నారు. పోలీసులను పనోళ్లుగా చూస్తున్నారని, ప్రశ్నించే గొంతులను అణచివేసి మీడియాను జేబు సంస్థలుగా మార్చివేశారని ఆరోపించారు. కేసీఆర్‌ అహంకారాన్ని, అధికార మదాన్ని దించి.. పాలనను ప్రజల చేతుల్లో పెట్టేందుకే ప్రజా ప్రస్థాన యాత్ర మొదలు పెడుతున్నానని ప్రకటించారు. కిరాతకుడిని ముఖ్యమంత్రిని చేసుకున్నామని, పీనుగుల మీదు పైసలేరుకునే విధంగా కేసీఆర్‌ పాలన సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసం చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ మార్చి అంచనాలు పెంచారని ఆరోపించారు. ఉద్యమకారుని పాలనలో ఉద్యమకారులకు హక్కులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. బుల్లెట్‌ బ్రూఫ్‌ భవన్‌లో ఆయన భోగాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అఽధికారంలోకి వచ్చాక 300 శాతం అత్యాచారాలు పెరిగాయని, డ్రగ్స్‌ను, మద్యాన్ని అరికట్టడం లేదని ఆరోపించారు. అయ్యా కొడుకులు మాటలు చెప్పే మొనగాళ్లే తప్ప.. పూట భత్యం ఇచ్యే పుణ్యాత్ములు మాత్రం కాదని అన్నారు.


కేసీఆర్‌ మోసం చేయని వర్గమంటూ లేదు..

కేసీఆర్‌ పాలనలో బీసీలు ఎదగరని, ఆయన మోసం చేయని వర్గమంటూ లేదని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. తాము రాకముందు కేసీఆర్‌ ఎప్పుడైనా ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి కనిపించారా? అని ప్రశ్నించారు. ఏడేళ్లుగా ప్రశ్నించేవారు లేకపోవడంతో కేసీఆర్‌ ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిందని అన్నారు. ఇప్పుడు తామున్నామని, తాము ప్రశ్నిస్తామని తెలిపారు. ఒక్క రోజు దీక్ష చేస్తామంటేనే చిన్నదొర కేటీఆర్‌కు జీర్ణం కాలేదని, వ్రతాలు అన్నారని మండిపడ్డారు. ఇకపై పాదయాత్రలో ప్రతి రోజూ జనం వద్దే ఉంటామని, ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. దేశంలో అధ్వాన్నమైన  ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నట్లు ఓ సర్వే చెబుతోందని ఇంతకంటే ఆయన పాలనకు నిదర్శనమేంటని ఎద్దేవా చేశారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలన తీసుకురావడమే తన పాదయాత్ర లక్ష్యమని ప్రకటించారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేసీఆర్‌కు వైఎ్‌సఆర్‌తో పోలికా? అని ప్రశ్నించారు. ఒక్కమాట మీద కూడా నిలబడలేని కేసీఆర్‌.. మాట కోసం నిలబడే వైఎ్‌సఆర్‌ గురించి మాట్లాడటమేంటని, వైఎ్‌సఆర్‌ను ఏమైనా అంటే ఆయన అభిమానులు ఊరుకోరని, భరతం పడతారని హెచ్చరించారు. 


రేవంత్‌రెడ్డిని అరువు తెచ్చుకున్న కాంగ్రెస్‌..

కాంగ్రెస్‌ పార్టీ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అని షర్మిల విమర్శించారు. ఆయనలా బ్లాక్‌మెయిల్‌ చేయడం తమకు రాదన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ పిలక సీఎం కేసీఆర్‌ చేతుల్లో ఉందని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్‌ నమ్ముకుందని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి.. రాహుల్‌గాంధీ మాట వినకపోయినా కేసీఆర్‌ మాట వింటాడని, అడ్డంగా దొరికిన దొంగకు విశ్వసనీయత ఉంటుందా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ కలిసిపోయే ఉన్నాయని షర్మిల ఆరోపించారు. ‘‘కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి మోదీతో దోస్తానా చేస్తారు. వంగి వంగి సలాం చేస్తారు. ఇక్కడకు వచ్చి అది అడిగాను, ఇది అడిగాను, నిలదీశానంటూ కహానీలు చెబుతారు. బీజేపీ నాయకులు కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలు ఉన్నాయంటారు. ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదు? మీకు ఏ డీల్‌ లేకుంటే కేసీఆర్‌పై కేసెందుకు పెట్టడం లేదు?’’ అని ప్రశ్నించారు. షర్మిల తల్లి వైఎస్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ, ‘‘మీ రాజన్న బిడ్డ షర్మిల మీ ముందుకు వచ్చింది. ఆమెను నిండుమనసుతో ఆశీర్వదించాలి’’ అని కోరారు. చేవెళ్లతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం జెండా ఊపి షర్మిల  పాదయాత్రను ప్రారంభించారు. కాగా, షర్మిల, విజయలక్ష్మి తమ ప్రసంగంలో ఎక్కడా ఏపీ సీఎం జగన్‌ ప్రస్తావన లేకుండా మాట్లాడటం గమనార్హం. 


తొలిరోజు 9 కిలోమీటర్లు 

వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర తొలి రోజు 9 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో వైఎస్‌ విజయమ్మ, షర్మిల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. పాదయాత్రలో షర్మిలతో పాటు విజయమ్మ కూడా చేవెళ్లలో నడిచారు. మార్గ మధ్యలో షర్మిల గ్రామస్తులను పలకరిస్తూ ముందుకు కదిలారు. షర్మిల భర్త అనిల్‌ కూడా సభ ప్రాంగణానికి వచ్చినప్పటికీ వేదిక పంచుకోలేదు. చేవెళ్ల నుంచి మధ్యాహ్నం2.20 గంటలకు షర్మిల శంఖం ఊది పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రెండు కిలోమీటర్లు దూరం నడిచిన తరువాత చేవెళ్ల పట్టణంలోని షాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రను కొనసాగించారు. కందాడ గ్రామ రెవెన్యూ పరిధిలో మధ్యాహ్న భోజనం కోసం బ్రేక్‌ ఇచ్చారు. అనంతరం 5.00 గంటల ప్రాంతంలో పాదయాత్ర కొనసాగించి కందాడ గ్రామంలో గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.. అక్కడ నుంచి మొయినాబాద్‌ మండలం నక్కలపల్లి శివారు వరకు యాత్ర కొనసాగింది. అక్కడే రాత్రి బస చేశారు. గురువారం నక్కలపల్లి నుంచి మొయినాబాద్‌ మండలం వెంకటాపూర్‌ వరకు షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. కాగా, పాదయాత్రలో జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పాదయాత్ర మొదలుకుని చివరి వరకు పలువురి పర్సులు, మొబైల్‌ ఫోన్లు, మెడలోని బంగారు ఆభరణాలను కొట్టేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-10-21T08:24:57+05:30 IST