Abn logo
Sep 20 2021 @ 16:05PM

స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టుపట్టించారు: షర్మిల

హైదరాబాద్: స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.  గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్, పోడు భూములు కూడా తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత దళితులపై, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. చిన్నపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మద్యం, డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, బంగారు తెలంగాణ అన్నారని.. రాష్ట్రం బారుల తెలంగాణగా మారిందని షర్మిల విమర్శించారు. 


కొత్త ఉద్యోగాల నియామకాలు చేపట్టడంలేదని, రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎంకు చీమ కుట్టినట్టయినా లేదని షర్మిల విమర్శించారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పాదయాత్రలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ వైఎస్‌ఆర్ అని, వైఎస్ పాదయాత్ర నుంచి పుట్టిందే ఫీజు రియంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, 108,  ఉచిత విద్యుత్, జలయజ్ఞమని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తాను కూడా త్వరలో పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో అక్టోబర్‌ 20న పాద యాత్ర చేయనున్నట్లు షర్మిల ప్రకటించారు. చేవెళ్ల నుంచే తన పాదయాత్ర ప్రారంభమవుతుందని, దాదాపు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని షర్మిల తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption