దీక్ష విరమించిన షర్మిల.. పోరాడతానని హామీ

ABN , First Publish Date - 2021-04-18T17:59:55+05:30 IST

ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల విరమించారు. రవీంద్ర నాయక్ భార్య, కొడుకు చేతుల మీదుగా షర్మిల దీక్ష

దీక్ష విరమించిన షర్మిల.. పోరాడతానని హామీ

హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల విరమించారు. రవీంద్ర నాయక్ భార్య, కొడుకు చేతుల మీదుగా షర్మిల దీక్ష విరమించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. రవీంద్ర నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళీ ముదిరాజు తల్లికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.


దీక్షా శిబిరంలో షర్మిల మాట్లాడుతూ... కేసీఆర్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ‘‘ప్రైవేట్ జాబులు కూడా రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పైసా సహాయం చేయలేదు. గజ్వేల్ కాబట్టి సహాయం రాలేదు. రవీంద్ర నాయక్ పిల్లలను చూస్తే ఏ ఒకరికైనా కన్నీరు రాకుండా ఉంటుందా అంటూ షర్మిల తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. పాలకులకున్నది గుండెనా.. బండరాయా..? మురళీ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేసిన తర్వాత పట్టించుకోలేదు. నేను ఎందుకు దీక్ష చేస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలి. 3 రోజుల పాటు నేను నిరాహార దీక్ష చేసా. నాకు మద్దతు తెలిపిన నిరుద్యోగ అమరుల కుటుంబానికి ధన్యవాదాలు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో నలభై లక్షమంది నిరుద్యోగులున్నారు. మానసికంగా రోజు చనిపోతున్నారు. ఉద్యోగాలు రావడం లేదని ఆత్మహత్యలు చేసుకున్నారు.


ఫొటోల కోసం క్లిక్ చేయండి



‘‘ఉద్యోగాలు భర్తీ చేసే పబ్లిష్ సర్వీస్ కమిషన్‌లోనే ఖాళీలుంటే ఇక వాళ్ళు ఎలా భర్తీ చేస్తారు. నిరుద్యోగ అమరుల కుటుంబాల క్షోభ నాకు అర్థమౌతోంది. మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డగా చెప్తున్నా.. రాజన్న బిడ్డగా చెబుతున్నా... నేనూ పోరాడుతా... నోటిఫికేషన్లు వచ్చే వరకు ప్రతి జిల్లాలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయి. ఏడేళ్ల వరకు ఏజ్ లిమిట్‌ని పెంచాలి. నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. దున్నపోతు మీద వాన పడ్డట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తా. 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఏ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవద్దు. లక్షల్లో ప్రయివేటు ఉద్యోగాలను సృష్టిస్తా. ఏమి చేసైనా నిరుద్యోగ సమస్యను లేకుండా చేస్తా’’ అని షర్మిల అన్నారు.  


కేసీఆర్ హంతకుడు కాదా నిరుద్యోగులవి ప్రభుత్వ హత్యలు కావా? కేసీఆర్ చిటికేస్తే ఉద్యోగాలు వస్తాయి. నోటిఫికేషన్లు ఇవ్వడం కేసీఆర్ చేతిలో ఉన్న పని. లక్షల్లో ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే సత్తా కేసీఆర్‌కు లేదు. గడీల నుంచి దొరలు పాలిస్తుంటే, ప్రతిపక్షాలు గాజులేసుకొని వత్తాసు పడుతున్నాయి. ఒక మహిళ లేచి నిలబడింది. కులాలకు, మతాలకు, ప్రాంతలకు అతీతంగా అందరికి సంక్షేమం అందించిన మహానేత వైఎస్ఆర్. వైఎస్ఆర్ ముద్దు బిడ్దనైన నన్ను చూసి పాలకులు భయపడ్డారు. పోలీసుల భుజాల మీద గన్ను పెట్టిన మమ్మల్ని టార్గెట్ చేశారు. పాలకులకు ఎందుకంత భయం? మా పిర్యాదు కూడా తీసుకోలేని స్థితిలో పోలీసున్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ఉన్నారా? కేసీఆర్ ఆజ్ఞలను అమలు చేసేందుకు జీతాలు తీసుకుంటున్నారా? ఆడోళ్ళ మీదా మీ ప్రతాపం. పాలకులకు, పోలీసులకు సిగ్గుందాలి. పాలకుల అహంకారంపై మహిళ లోకం ఉమ్మేస్తోంది. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌పై పోలీసులు మా చీరలు లాగారు, నా చేయి విరిచారు, ఒక తమ్ముడి కాలు విరగగొట్టారు. యూనివర్సిటీలలో వీసీలు కూడా లేరు. విద్యార్థులు, ప్రొఫెసర్లకు గొర్రెలు ఇవ్వండి. అవి కాసుకుంటు జీవిస్తారు. 20 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని చెప్తే అందరిని పర్మనెంట్ చేస్తారని అందరూ అనుకుంటే, కేసీఆర్ మాత్రం ఉద్యోగాల నుంచి తొలగించారు. తన రాజకీయ స్వలాభం  కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. 3లక్షల85 వేల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు’’ అని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - 2021-04-18T17:59:55+05:30 IST