Abn logo
Sep 27 2021 @ 01:58AM

నా ఆస్తి నాకు ఉంటుంది. ఎక్కడికి పోతుంది.. ఇప్పుడు వాళ్లకు అవసరం లేదు కదన్నా..

ఆర్కే:మీరు పార్టీ ప్రకటించిన తరువాత మీ అన్న జగన్‌మోహన్‌రెడ్డితో విభేదాలు తారస్థాయికి చేరి, మీరు ఇక్కడికి వచ్చేశారని ప్రచారం జరుగుతోంది..! వాస్తవమేనా? 

షర్మిల: నాకు... అన్నకు మధ్య వంద ఉండవచ్చు. వెయ్యి ఉండవచ్చు. అవి కూర్చొని పరిష్కరించుకోలేనివైతే కావు. కానీ నేనిక్కడ పార్టీ పెట్టడానికి కారణం... జగన్‌మోహన్‌రెడ్డి గారు, నేను సేవ చేయాలనుకొంటున్న ప్రాంతాలు వేరు. రాష్ట్రాలు వేరు. అలాంటప్పుడు పార్టీలు కూడా వేరవ్వడమే కరెక్ట్‌. తెలంగాణలో పార్టీ పెట్టాలన్నది నా నిర్ణయం. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్నది నా నిర్ణయం. ఎందుకంటే నా జీవితం ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది. నేనిక్కడ పెరిగాను. ఇక్కడి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. సో... నేను ఈ ప్రాంతానికి సేవ చేయాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ వాళ్లు వద్దన్నారు. 


ఆర్కే: ఎందుకు వద్దన్నారు? 

షర్మిల: ఎందుకు వద్దన్నారో వాళ్లనే అడగాలి. 


ఆర్కే: సజ్జల రామకృష్ణారెడ్డి ‘మేము ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాం. కానీ ఆవిడ వినలేదు. కనుక మాకు... ఆవిడకు రాజకీయంగా ఎలాంటి సంబంధంలేదు’ అని అన్నారు! 

షర్మిల: ఒకరు చెబితే తీసుకున్న నిర్ణయం కాదు నాది. ఎంతో పరిశోధన చేసి, ఎంతో మందితో మాట్లాడిన తరువాత, ఎంతో లోతుగా ఆలోచించి, ఎన్నిటినో పరిగణనలోకి తీసుకొని తీసుకున్న నిర్ణయం. వాళ్లకు నచ్చలేదు. చర్చలు జరిగాయి. వాళ్ల అభిప్రాయం వాళ్లు చెప్పారు. నా నిర్ణయం నేను చెప్పాను. కానీ బాధ ఎక్కడ కలిగిందంటే... మీరన్నట్టు రామకృష్ణారెడ్డి అన్న ‘సంబంధంలేదు’ అని మాట్లాడినందుకు. నేను రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజున ‘సంబంధం లేదు’ అన్న పదం వాడారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లకు అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా నా శక్తికి మించి చేశాను. పాదయాత్రతో సహా. ఏ సంబంధం ఉందని చేశాను? రక్తసంబంధం ఉందని, నా బాధ్యత అనుకుని చేశాను. అలాంటిది ఒక్క మాటలో ‘సంబంధం లేదు’ అనేశారు. విభేదాలు ఎవరికి ఉండవన్నా! మీరు పది మందిని పిలిచి ‘మీ తోబుట్టువులతో విభేదాలున్నాయా’ అని అడగండి. పదికి పదిమంది విభేదాలు ఉన్నాయనే చెబుతారు. కానీ విభేదాలున్నాయి కదా అని ‘సంబంధాలు లేవు’ అనుకోవడం నాకు నచ్చలేదు. బాధేసింది. 


ఆర్కే: వైఎస్సార్‌ లేనంత మాత్రాన సంబంధాలు తెగిపోవు కదా! 

షర్మిల: అవునన్నా. అదే బాధ కలిగించింది. 


ఆర్కే: మరి నువ్వు గానీ, అమ్మ గానీ ఎప్పుడూ వాళ్లని అడగలేదా? 

షర్మిల: లేదు. 


ఆర్కే:సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడంటే జగన్‌ అన్నట్టే. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా మాట్లాడే స్వేచ్ఛ, అధికారం ఎవరికీ లేవనేది చాలామంది అభిప్రాయం? 

షర్మిల:అన్న అలా అనకపోతే మంచిదే. కానీ ఆయన అనుకోనంత మాత్రాన రక్తసంబంధాలు తెగిపోవు కదా. కొట్టుకున్నా అన్నా చెల్లెళ్లమే. 


ఆర్కే: ఇక్కడ మీరు పార్టీ పెడితే కేసీఆర్‌కు ఇబ్బందనే జగన్‌ మద్దతు ఇవ్వలేదన్నది ఒక వాదన. అసలు కేసీఆర్‌ వదిలిన బాణం అనేది రెండోది? 

షర్మిల: నేను తెలంగాణ ప్రజల సమస్యల కోసం పోరాడడానికి ప్రజలు వదిలిన బాణాన్ని. ఒక అమ్మాయి జీవితంలో ముందు పుట్టింట్లో ఉంటుంది. పెళ్లితో ఒకరికి భార్య అవుతుంది. తల్లి... అత్త... అమ్మమ్మ... నాన్నమ్మా అవుతుంది. మార్పు సహజం. అప్పుడు అది కరెక్ట్‌. ఇప్పుడు ఇదీ కరెక్ట్‌. 


ఆర్కే: అంటే కేసీఆర్‌-జగన్‌ మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనేగా?

షర్మిల: వాళ్లకే తెలియాలి (నవ్వు). 


ఆర్కే: ఏ విషయంలో వ్యతిరేకత ఉంది? 

షర్మిల: అన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా నియంత పాలన అనేది చాలామందికి నచ్చలేదు. ఆయన ఎవర్నీ పట్టించుకోరు. ఎవరి సంక్షేమం గురించి పెద్దగా ఆలోచించరు. ఆయనకు ఏది వర్కవుట్‌ అవుతుందనే దానిపై మాత్రమే ఫోకస్‌ చేస్తారు. ఆయన ఎంచుకొనే ప్రాథమ్యాలే తప్పు. అప్పుడు కాళేశ్వరం అన్నారు. లక్షల కోట్లు తెచ్చి పెట్టారు. దాని కరెంట్‌ ఖర్చులకే అప్పుల చేయాల్సిన పరిస్థితి. పోనీ నీళ్లు ఇస్తారనే అనుకుందాం. ఆ నీళ్లు రాకముందే ఇప్పుడు వరి వేయద్దంటున్నారు. 


ఆర్కే:  తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. నిజమే. మరి ఏపీలో కూడా ఇదే సమస్య ఉంది. జగన్‌ విడుదల చేసిన జాబ్‌ కేలండర్‌ నవ్వుల పాలైయింది. ఆయనతో ఇక్కడ మిమ్మల్ని పోలుస్తారేమో కదా! 

షర్మిల:నేను పదే పదే చెబుతుందేమిటంటే... ఒకప్పటి నేను వేరు. ఇప్పటి నేను వేరు. ప్రస్తుతం నా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడి ప్రజల సమస్యలపై నేను మాట్లాడకపోతే వారికి నేను న్యాయం చేసినదాన్ని అవ్వను. ఒకప్పుడు మీరు అది చేశారు కదా! అక్కడ చేశారు కదా! అంటే దానికి నేను బాధ్యురాలిని ఎలా అవుతాను? ఉదాహరణకు మన పిల్లలు ఉన్నారు. వాళ్లకి మంచి బుద్ధులు నేర్పుతూ పెంచుతాం. పెద్దయ్యాక ఎలా తయారవుతారన్నది వాళ్ల నిర్ణయం. నేను ఆ రోజు జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఎందుకు ప్రచారం చేశాను? ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, నీళ్లు వంటివి ప్రజలకు ఇవ్వడం ముఖ్యమనుకొని, ఆ పార్టీ పేరులో వైఎస్సార్‌ అన్న పేరు ఉంది కాబట్టి, నిలబడినవాడు తోడబుట్టినవాడు కాబట్టి నేను ప్రచారం చేశాను. అంతమాత్రాన తను చేసిన ప్రతి పనికీ, అక్కడ జరిగే ప్రతి విషయానికీ నేను బాధ్యురాలిని ఎలా అవుతాను? ఇది మన బాధ్యత అనుకొని ఒకటి చేస్తాం. ఆ తరువాత వాళ్ల మంచి చెడులకు వాళ్లే బాధ్యులు. అక్కడ జగన్‌ను ఆశీర్వదించారు. ఆయనకు ఐదేళ్లు టైమ్‌ ఇవ్వండి. మీకు సంతోషమైతే మళ్లీ వేయండి. లేకపోతే తిరగబడండి. 


ఆర్కే:  కేటీఆర్‌ అంటే ఎవరని అన్నావు కదా! వెటకారంగానా? 

షర్మిల:వెటకారంగానే! లేకపోతే ఆడపిల్లలను వ్రతాలు చేసుకోమంటాడా! గత ఏడేళ్లలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగింది. కారణం ఎవరు? వాళ్లు! గ్రూప్‌1 నోటిఫికేషన్‌ అసలు వెయ్యనే లేదు. పాపం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అవి చూసి తట్టుకోలేక మేము మూడు రోజులు నిరాహార దీక్షలు మొదలుపెడితే... నా చెయ్యి విరగ్గొట్టారు. నా వస్త్రాలు చింపారు. అయినా అక్కడ ఇష్యూ డైవర్ట్‌ అవ్వకూడదని మహిళలకు జరిగిన అవమానంగా ఆ ఘటనను చిత్రీకరించలేదు. తరువాత మూడు రోజులు అక్కడే దీక్ష చేశాను. ప్రతి మంగళవారం దీక్ష చేస్తామని చెబితే వ్రతాలు చేసుకోండంటారా? అంటే మా ఆడవాళ్లం ఇంట్లో ఉండి వంటలు, వ్రతాలు చేసుకోవాలా? మీరేమో ఫామ్‌హౌసుల్లో పడుకొంటారా? ఇది అన్యాయం కాదా అన్నా! 


ఆర్కే: రాజకీయ నాయకురాలివి అవుతున్నావు! లౌక్యంగా సమాధానాలిస్తున్నావ్‌! 

షర్మిల: ఎక్కువ మాట్లాడకూడదు(నవ్వు). నేను పాలిటిక్స్‌ కటౌట్‌ మాత్రం కాను. మా నాన్నయితే కచ్చితంగా ఆశ్చర్యపోయేవారు. 


ఆర్కే: అసలు రాజకీయాలంటేనే ఇష్టం లేకుండా జగన్‌ అడిగారని, సజ్జల లాంటి వాళ్లు రూట్‌మ్యాప్‌ ఇచ్చారని పాదయాత్రకు బయలుదేరారు... ఉపన్యాసాలు ఇచ్చారు. వీటన్నిట్లో ట్రైనింగ్‌ ఎవరు ఇచ్చారు? 

షర్మిల: ఎవరూ ఇవ్వలేదు. అలా ఒక్కొక్కటీ నేర్చుకొంటూ వెళ్లానంతే. నేను చెయ్యి ఊపితే నాన్నలా ఉంటుందనేది అప్పటి వరకు నాకే తెలియదు. జనంలోకి వెళ్లాక... పక్కనవాళ్లు చెప్పాకే ఆ విషయం తెలిసింది (నవ్వు). ఒకటి రెండు మీటింగుల్లో తడబడ్డా. తెలుగులో మాట్లాడడం కూడా నాకు పెద్దగా అలవాటు లేదు. ఇంట్లో ఎక్కువ ఇంగ్లీష్‌లోనే మాట్లాడేదాన్ని. తెలుగు అంత బాగా మాట్లాడుతుంటే అమ్మ, అనిల్‌ కూడా ఆశ్చర్యపోయేవారు. దేవుడి దయ.. అంతే. 


ఆర్కే:జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు మీరు, మీ అమ్మ పార్టీ కోసం తిరిగారు. ఇద్దరూ రెండు స్తంభాల్లా నిలబడ్డారు. పదేళ్ల తరువాత అక్కడ ప్రభుత్వం వచ్చింది. ఆశ్చర్యంగా ఆ రెండు స్తంభాలనూ పక్కకు నెట్టేశారు. మీకు ఏమనిపించింది? 

షర్మిల:ఇన్ని కష్టాలు ఉంటాయనేది మాకు మొట్టమొదట అర్థమైంది నాన్న వెళ్లిపోయిన తరువాతే. ఆ సమయంలో అంతా కలిసి గట్టిగా నిలబడాలనుకున్నాం. నిలబడ్డాం. జగన్‌కు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను, అమ్మా చేయగలిగింది చేశాం. వాళ్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లకు అవసరం లేదు కదన్నా.


ఆర్కే: కానీ ఏదీ శాశ్వతం కాదు. రేపు ఒకవేళ ఆయనకు అవినీతి కేసుల్లో శిక్ష పడితే అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి? మళ్లీ ఇదే షర్మిల... ఇదే విజయలక్ష్మి గారి అవసరం రావచ్చుగా? 

షర్మిల:రావచ్చు. కానీ ఇది రాచరికం కాదు కదన్నా. రాజు పోతే కొడుకు లేకపోతే చెల్లి రాజు కావడానికి. ఇది ప్రజాస్వామ్యం. ఒకవేళ ఏ కారణంతోనైనా జగన్‌ గారు సీఎంగా ఉండలేకపోతే అప్పుడు ఆ పార్టీ విధివిధానాలను  బట్టి తరువాత ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. నేను ఆ పార్టీలో కనీసం సభ్యురాలిని కూడా కాదు.


ఆర్కే: ఆస్తులు, వ్యాపారాల గొడవలు కూడా ఉన్నాయా? 

షర్మిల: గొడవలు ఎవరింట్లో ఉండవు? మీ కుటుంబంలో లేవా? 


ఆర్కే: ప్రస్తుతానికైతే లేవు. ముందు ముందు తెలియదు. 

షర్మిల: మంచిదే(నవ్వు). ఆస్తులు అన్నాక అటూ ఇటూ అవ్వడం సహజం. కూర్చొని మాట్లాడుకొంటే పరిష్కారం చేసుకోలేనిదేదీ ఉండదు. 


ఆర్కే: మీ నాన్న బతికి ఉన్నప్పుడు అన్నీ ఉమ్మడి వ్యాపారాల కిందే పరిగణించారు కదా! ఆయన హయాంలో ప్రారంభించిన, అంటే జగన్‌ నడుపుతున్న, అప్పుడు నడిపిన ప్రతి వ్యాపారంలో మీ ఇద్దరికీ భాగస్వామ్యం ఉంది. ఆయన దృష్టిలో కూతురు, కొడుకు ఒక్కటే. కదా! 

షర్మిల:అవునన్నా. ఏ రోజూ ఆ తేడా చూపించలేదు


ఆర్కే: అంటే అన్నింట్లోనూ మీకు వాటా ఉంది. అవునా? 

షర్మిల: ఉంటుందన్నా. నా ఆస్తి నాకు ఉంటుంది. ఎక్కడికి పోతుంది! 


ఆర్కే:  మీ నాన్నను చూశావు. పాతికేళ్లు ఢక్కామొక్కీలు తింటే కానీ ఆయన ముఖ్యమంత్రి కాలేదు. హేమాహేమీలతో తలపడి... ఆర్థికంగా చితికిపోయి... సహనంతో కాంగ్రెస్‌లోనే ఉండి అనుకున్నది సాధించుకున్నారు. మీరు కూడా అలా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నారా? 

షర్మిల: ఒక్కసారి దిగాక అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. 


ఆర్కే:  బాల్యంలో అందరిలానే మీ అన్నా చెల్లెళ్లు కూడా గొడవపడేవారా? 

షర్మిల: చిన్న చిన్నవాటికి కొట్టుకొనేవాళ్లం. అందరు అన్నా చెల్లెళ్లలానే. 


ఆర్కే:  మీ తాత రాజారెడ్డి ఎవరి వైపు ఉండేవాళ్లు? 

షర్మిల: అలా ఏంలేదు. మా ఇంట్లో ఆడపిల్లలైనా... మగపిల్లలైనా అందర్నీ ఒకేలా చూసేవారు. మా జార్జి పెదనాన్న కొడుకులున్నారు... సునిల్‌ అన్న, అనిల్‌రెడ్డి, జగన్‌రెడ్డి, నేను, సునీత... అందరం కలిసే ఉండేవాళ్లం. ఆడపిల్లలమని ఎప్పుడూ తక్కువ చేయలేదు.  


ఆర్కే:  ప్రస్తావన వచ్చింది కనుక అడుగుతున్నా... డాక్టర్‌ సునీత పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు. వాళ్ల నాన్న మీకు సొంత బాబాయ్‌ కదా! అంటే చంపడం కన్నా... చంపిన తీరు బాధాకరం. మీకెలా అనిపించింది? 

షర్మిల:చాలా బాధపడ్డాం. చాలా భయంకరం. అలా ఎవరికీ జరగకూడదు. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. వైఎస్సార్‌ కుటుంబం మొత్తం సునీతకు, చిన్నమ్మకు తోడున్నాం. సునీత నాకంటే 17 రోజులు పెద్ద. 


ఆర్కే:  సునీతకు నైతిక మద్దతు షర్మిల నుంచేనని విన్నా..!  

షర్మిల: నా విధానం ఒక్కటే. ముఖ్యంగా బాధితులకు విశ్వాసం, భరోసా కల్పించడం వ్యవస్థ బాధ్యత. నా బాధ్యత. అందులో ఇలాంటి కేసుల్లో సానుభూతి, చిత్తశుద్ధి చాలా అవసరం. నాకు చేతనైనంత నేను చేస్తాను. నిజానికి నా చేతుల్లో ఏమీ లేదు. 


ఆర్కే:  రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకున్నప్పుడు భర్తగా అనిల్‌ స్పందన ఏమిటి? 

షర్మిల: నాకు అడ్డు చెప్పలేదు. నిజానికి అనిల్‌ చాలా మంచి భర్త. కానీ ఏ రోజూ రాజకీయాల్లో తను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. 

షర్మిల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పార్ట్-3: హైదరాబాద్‌ శివార్లలో ఒక ధాబాకు వెళ్లినప్పుడు ఆయన కలిశారు..  లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అయితే కాదు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండిImage Caption

రాజకీయ నేతలుమరిన్ని...