నేను ఒంటరినయ్యా.. కన్నీరు ఆగనంటోంది.. : వైఎస్ షర్మిల

ABN , First Publish Date - 2021-09-02T16:45:33+05:30 IST

వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో, మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ..

నేను ఒంటరినయ్యా.. కన్నీరు ఆగనంటోంది.. : వైఎస్ షర్మిల

హైదరాబాద్ సిటీ : దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిలతో పాటు పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, తెలంగాణకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. కాగా.. ఈ వర్ధంతి సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు.. గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో షర్మిలకు ఉన్న విబేధాలు అక్షరాలా నిజమయ్యేలా ఆ ట్వీట్ ఉండటం గమనార్హం. ఇంతకీ ఆమె చేసిన ట్వీట్ ఏంటి..? ఆ ట్వీట్‌పై నెటిజన్లు, వైఎస్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారనే విషయం ఇప్పుడు చూద్దాం.


ఒంటరినయ్యా..!

ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీఅని షర్మిల ట్వీట్ చేశారు. అంటే.. తాను ఒంటరిని అయ్యానని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే.. సోదరుడు జగన్‌తో మనస్పర్థలున్నాయన్న విషయం ఎవరికైనా స్పష్టంగానే అర్థమైపోతుంది. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది.


పక్కపక్కనే ఉన్నప్పటికీ..!

వైఎస్సార్ జయంతి రోజున, రాఖీ పండుగ రోజున కూడా అన్నా, చెల్లి ఇద్దరూ కలవలేదు. దీంతో అప్పట్లో మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే తాజాగా ఇద్దరూ ఇడుపులపాయలో కలుసుకున్నప్పటికీ.. అంతేకాదు ఇద్దరూ పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకర్ని ఒకరు పలకరించకోకపోవడం గమనార్హం. ఇవాళ్టితో ఇద్దరి మధ్య ఉన్న విబేధాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని.. కచ్చితంగా ఇద్దరూ మాట్లాడుకుంటారని.. ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందని అభిమానులు, వైఎస్ అనుచరులు అనుకున్నప్పటికీ.. అవేమీ అస్సలు జరగలేదు.


వైఎస్ జగన్ ట్వీట్ ఇదీ..

నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-09-02T16:45:33+05:30 IST