వైఎస్సార్‌కు మరొకరి ఖ్యాతి అక్కర్లేదు

ABN , First Publish Date - 2022-09-24T08:56:49+05:30 IST

న్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు...

వైఎస్సార్‌కు మరొకరి ఖ్యాతి అక్కర్లేదు

  • ఒక ప్రభుత్వం పెట్టిన పేరును తొలగించడం అవమానకరమే
  • ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమందిని అవమానించినట్లే
  • రేపు వచ్చే ప్రభుత్వం పేరు మారిస్తే వైఎస్‌కు అది అవమానమే
  • ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరుపై షర్మిల వ్యాఖ్య

వికారాబాద్‌/మోమిన్‌పేట/పంజాగుట్ట, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే ఆ పేరు (ఎన్టీఆర్‌)ను అవమానించినట్లేనని అన్నారు. ఆ పెద్ద మనిషి (ఎన్టీఆర్‌)ని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమానపరిచినట్లేనని పేర్కొన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర  శుక్రవారం వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలంలో సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్‌కు ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలో ఎవరికీ లే దని, ఆయన మరణాన్ని తట్టుకోలేక 700 మంది చనిపోయారని పేర్కొన్నారు. అలాంటి వైఎస్సార్‌కు వేరొకరి ఖ్యాతిని ఆపాదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘‘నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాధించినంతగా మరెవరూ ఆరాధించి ఉండరు. ఇప్పుడు వైఎస్సార్‌ పేరు పెడతారు. రేపు వచ్చే ప్రభుత్వం ఆ పేరు మారిస్తే.. అప్పుడు వైఎ్‌సను అవమానించినట్లే అవుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.


చర్చకు పిలిచి వీఆర్‌ఏలను బెదిరిస్తారా?

వీఆర్‌ఏల ఆందోళనకు షర్మిల మద్దతు తెలిపారు. 60 రోజులుగా వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నారని.. వారిని చర్చలకు పిలిచిన మంత్రి కేటీఆర్‌.. తెగేదాకా లాగొద్దు అని బెదిరించడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే 30 మంది ఆత్మహత్మ చేసుకున్నారని, ఇంకా ఎందరిని పొట్టన పెట్టుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పాదయాత్రలో భాగంగా మోమిన్‌పేటలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. కొందరు వీఆర్‌ఏను షర్మిలను కలిశారు. వీఆర్‌ఏల బంధువుల జాబితా తీసుకుని వారిని బెదిరిస్తున్నారని.. ఇదెక్కడి దారుణమని ప్రశ్నించారు. వీఆర్‌ఏల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు. నవాబ్‌పేట మండలం మమ్మదాన్‌పల్లిలో రైతులతో షర్మిల సంభాషించారు. ధరణితో ప్రతి గ్రామంలో  వేల ఎకరాల వివరాల్లో తప్పులు దొర్లాయని, తమ భూములు రిజిస్ట్రేషన్లు కాకుండా పోయాయని వాపోయారు. 


హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజనింగ్‌పై చర్య తీసుకోండి

ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజనింగ్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌ యూసు్‌ఫగూడ ప్రధాన రహదారిలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయ  ఆవరణలో ఉన్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కార్యాలయం ఎదుట పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు.  

Updated Date - 2022-09-24T08:56:49+05:30 IST