వైఎస్ విజయలక్ష్మి ఆహ్వానం.. వైసీపీ శ్రేణుల్లో టెన్షన్

ABN , First Publish Date - 2021-09-01T21:29:31+05:30 IST

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని వైఎ‌స్‌ఆర్ సతీమణీ విజయలక్ష్మి

వైఎస్ విజయలక్ష్మి ఆహ్వానం.. వైసీపీ శ్రేణుల్లో టెన్షన్

హైదరాబాద్: దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన సతీమణీ విజయలక్ష్మి అనుకుంటున్నారు. వైఎస్‌ఆర్ వర్థంతి ప్రతి ఏటా ఇడుపుల పాయలో నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌తో అనుబంధమున్న ప్రముఖులను ఆహ్వానించారు. 2004, 2008 వైఎస్‌ఆర్ కేబినేట్‌లో ప‌నిచేసిన ఉభ‌య రాష్ట్రాల మంత్రుల‌కు విజ‌య‌లక్ష్మి ఫోన్ చేసి ఆహ్వానించారు. వీరిలో వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. బొత్సతో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశానికి వెళ్లాలా వద్దా అని మంత్రులు, వైసీపీ శాసనసభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రధానంగా మంత్రుల్లో ఈ భయం బాగా కనిపిస్తోంది. వర్ధంతి సభకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ తనకూ అందిందని.. అయితే విజయలక్ష్మి నేరుగా ఆహ్వానించలేదని ఓ మంత్రి తెలిపారు. నేరుగా పిలిస్తే వెళ్లాలో వద్దో అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. మిగతా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 


ఇది రాజకీయ కార్యక్రమం కాదని, అందరూ రావాలని విజయలక్ష్మి కోరారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయలక్ష్మి పార్టీలో కీలక బాధ్యతను నిర్వహిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల తెలంగాణలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించారు. విజయలక్ష్మి ఈ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇదే మంత్రులకు, వైసీపీ నేతలకు అడ్డంకిగా మారింది. ఆమె ఆహ్వానించారని వెళ్తే.. వైసీపీ, షర్మిల పార్టీ రెండూ ఒకటేనన్న సంకేతాలు వెళ్తాయేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వైఎస్‌ సన్నిహితులను ఆహ్వానించడంలో తెలంగాణ ప్రాంతంపైనే ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నట్లు విజయలక్ష్మి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పార్టీ పెట్టడంలోను, ఆమె సభల నిర్వహణలోనూ విజయలక్ష్మి వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్‌ను మరోసారి స్ఫురణలోకి తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వేదికగా నిర్వహిస్తుండడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న షర్మిల.. కార్యక్రమం నిర్వహణలో తన వంతు కీలక పాత్రనూ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

Updated Date - 2021-09-01T21:29:31+05:30 IST