Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎవరీ గంగాధర్‌రెడ్డి?

వివేకా కేసులో సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేయగానే ఎందుకింత కదలిక?


(కడప, ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్‌ చిన్నాన్న. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వరుస అరెస్టులతో సీబీఐ దూకుడు పెంచింది. నిందితులను అప్రూవర్లుగా మార్చుకుంటూ చార్జిషీట్లలో వేగం పెంచింది. ఈ తరుణంలోనే ఈ జాతీయ దర్యాప్తు సంస్థపై ఒక పాత నేరస్థుడు ఫిర్యాదు చేయడం.. దానిపై పోలీసులు వేగంగా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివేకా హత్యలో నేరుగా పాల్గొన్నారని భావిస్తున్న నలుగురు నిందితులపై ఇప్పటికే సీబీఐ ప్రాథమిక చార్జిషీట్లు దాఖలు చేసింది. తాజాగా ఈ హత్యకు ప్రేరేపించినట్టు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఇంతలోనే శంకర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా తనను తాను పరిచయం చేసుకుంటూ కల్లూరి గంగాధర్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. 


గత సోమవారం ప్రజాదర్బార్‌లో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట ప్రత్యక్షమై.. వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై ఫిర్యాదులు గుప్పించారు. ఈ ఫిర్యాదులను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎస్పీ స్వీకరించేశారు. అప్పటికప్పుడు సీఐ ఆధ్వర్యంలో గంగాధర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ ఏర్పాటుచేశారు. దీంతో.. ఎవరీ గంగాధర్‌రెడ్డి అనే చర్చ సర్వత్రా మొదలైంది. ప్రభుత్వ పెద్దలే తెర వెనుక ఈ భాగోతాన్ని నడిపిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. కల్లూరు గంగాధర్‌రెడ్డిది కడప జిల్లా పులివెందుల. అనంతపురం జిల్లా యాడికికి చెందిన యువతిని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. ఈయనపై పులివెందుల పోలీసు స్టేషన్‌లో డబుల్‌ మర్డర్‌ కేసు నమోదు అయిందని సమాచారం. 

Advertisement
Advertisement