Advertisement
Advertisement
Abn logo
Advertisement

గట్టిగా పోరాడిన Telugudesam.. ఫలించిన వ్యూహం.. YSRCP లో ఆందోళన.. నివేదిక కోరిన CM Jagan..!

కోస్తాలో గాలి మారుతుంది... మార్పు కోరుకుంటుంది... రెండున్నర సంవత్సరాలు కాకముందే కోస్తా కోరుకుంటున్న మార్పు వెనుక ఏదో దాగి ఉంది. స్థానిక సంస్థల మలిపోరులో టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించడంతో వైసీపీలో అంతర్గతంగా మదనం జరుగుతోంది.ప్రకాశం, గుంటూరు, కృష్ణా, జిల్లాల్లో మలి విడత పోరులో తెలుగుదేశం కొన్ని స్థానాలలో విజయం సాధించగా, మరికొన్నింటిలో పోరాడి ఓడింది. ఐకమత్యంగా పోరాడితే సాధించలేనిది ఏదీ లేదని ఈ ఫలితాలు తెలుగుదేశానికి బోధ పడేలా చేశాయి. కోస్తాలో గాలి ఎందుకు మారుతుందో  వైసీపీ గుర్తించిందా..? అనే విషయాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్ స్టోరీలో చూద్దాం..

టీడీపీ వైపు గాలి..!

స్థానిక సంస్థల మలి విడత పోరులో టీడీపీ మెరుగైన ఫలితాలను సాధించింది. ప్రకాశం జిల్లా దర్శి, కృష్ణాజిల్లా కొండపల్లి, జగ్గయ్యపేటతో పాటు పెడన, గుంటూరు నగరంలోని మరో వార్డులో టీడీపీ విజయ కేతనం ఎగురవేసింది. జగ్గయ్యపేటలో తెలుగుదేశం పార్టీకి నాలుగు వార్డులలో సింగిల్ డిజిట్‌లో మెజార్టీతో అభ్యర్ధులు గెలుపొందగా, రీకౌంటింగ్ అనంతరం వైసీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అందువల్ల జగ్గయ్యపేటలో కూడా నైతిక విజయం టీడీపీదేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు, ఈ మధ్య జరిగిన నగర పాలక సంస్థల్లో హవా చాటిన వైసీపీ..స్థానిక మలి విడత పోరులో ఎందుకు వెనకబడిందనేది ఆ పార్టీ నేతలకు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో సమాజంలోని వివిధ వర్గాలకు నిజాలు తెలిసొస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గట్టిగా పోరాడిన టీడీపీ..!

పట్టణ, నగర ప్రాంతాల్లో గాలి మార్పు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఐకమత్యంగా అక్కడ చేసిన కృషితో టీడీపీ భారీ విజయం సాధించింది. అక్కడ ఇన్‌ఛార్జితో పాటు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, స్వామి, పార్టీ నేతలు దామచర్ల  జనార్ధన్, దామచర్ల సత్య, ఉగ్రనరసింహారెడ్డిలు కలిసి కట్టుగా పోరాడారు.

కాపులు, రెడ్డి సామాజికవర్గీయులు అత్యధికంగా ఉన్న  ఈనగర పంచాయతీలో టీడీపీ విజయం సాధించడం ఆపార్టీకి ఊరట కల్గించింది. గుంటూరు జిల్లా పల్నాడు వైసీపీకి కంచుకోటగా ఉంది. అటువంటి కోటలో గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో అక్కడ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పోరాడారు. టీడీపీకి తృటిలో విజయం చేజారింది. గుంటూరు నగరంలో ఆరో వార్డులో జరిగిన ఎన్నికలలో గతంలో గెలుపొందిన పాదర్తి రమేష్ గాంధీకి 1200ఓట్ల ఆధిక్యత రాగా, ఆయన కరోనాతో మరణించడంతో, ఇప్పుడు అక్కడ జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి 550 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

కృష్ణా జిల్లాలో ఫలించిన టీడీపీ వ్యూహం!

కృష్ణాజిల్లా కొండపల్లిలో ఆపార్టీ ఇన్ ఛార్జి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని నాని, వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. జగ్గయ్యపేటలో కూడా ఎంపీ నాని, అక్కడి నేతలు శ్రీరాం తాతయ్య, నెట్టెం రఘురాంలు  చేసిన పోరాటం నైతికంగా విజయం సాధించింది. కృష్ణాజిల్లా పెడనలో ఎగిరెగిరి పడుతున్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు జడ్పీటీసీ స్థానంలో ప్రజలు షాకిచ్చారు. అక్కడ జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికలలో  టీడీపీ అభ్యర్ధి గెలుపొందారు. 

ఫలితాల సరళితో వైసీపీలో ఆందోళన..!

ఫలితాల సరళి చూశాక ఎక్కడో తేడా కొడుతుందనే ఆందోళన వైసీపీలో అంతర్గతంగా కనిపిస్తోంది. రాజధాని అమరావతి మహాపాదయాత్ర ప్రభావం ప్రజల్లో అంతర్లీనంగా ఉందని అందరికీ బోధ పడింది. ఛిద్రమైన రోడ్లు, నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల, ఎయిడెడ్ కళాశాలల స్వాధీనం వంటి చర్యలు ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు సామన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో  వైసీపికి మద్దతు ఇచ్చిన తటస్థ ఓటర్లలో మార్పు వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగాలు లేకపోవడం, వైసీపీ చేస్తున్న అరాచకాలు, పెడుతున్న అక్రమ కేసులు,  ప్రతిపక్షాలపై దాడులు, వంటి అంశాలు కూడా ఆ పార్టీకి కోస్తాలో మైనస్‌గా మారాయనే టాక్‌ వస్తోంది.  రాజధాని మార్పు అంశం గుంటూరు, కృష్ణాజిల్లాల్లో గణనీయంగా ప్రభావం చూపిస్తోంది.

వైసీపీలో అంతర్గత కొట్లాటలు..!

సహజంగా సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలనే భావనలో ఉండే కృష్ణా, గుంటూరు  జిల్లాల ప్రజలు మలి విడత పోరులో తమ తీర్పును చెప్పారని మరికొందరు చెబుతున్నారు. అక్రమ కేసులకు భయపడి నిన్న, మొన్నటి వరకు బయటకు రాని టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే రోడ్డెక్కుతున్నారు. ఎదురు తిరగడం ప్రారంభించారు. కేసులకు వెనక్కి తగ్గడం లేదు. గుంటూరు, కృష్ణాజిల్లా జిల్లాల్లో మలి విడత పోరు ఫలితాలు వచ్చిన అనంతరం తాడేపల్లి ప్యాలెస్‌లో పార్టీ నేతలతో సాక్షాత్తు సీఎం ఈ రెండు జిల్లాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

ఏ తీరాలకు చేరుతుందో..!?

గుంటూరు, దర్శి, దాచేపల్లి, కొండపల్లి, జగ్గయ్యపేట, పెడన, శావల్యాపురం వంటి స్థానాలలో ఫలితాలు తారుమారు అవడం వెనుక ఏం జరిగందనేది నివేదిక కావాలని ఆయన సూచించినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గత లోపమా, లేక ప్రజల్లో వస్తున్న మార్పా అనే అంశంపై వైసీపీలో అంతర్గత మధనం ప్రారంభమైంది.  ఐదు నెలల క్రితం జరిగిన కార్పొరేషన్, పురపాలక సంఘాల ఎన్నికల్లో  ఏక పక్షంగా ఫలితాలు వస్తే... ఇంతలోనే అంత మార్పు ఎందుకు వచ్చిందని, ముఖ్యంగా కోస్తాలో వచ్చిన ఈ మార్పు ఏ రాజకీయ పార్టీకి కూడా అంత మంచి పరిణామం కాదని మరి కొందరు చెబుతున్నారు.  సహజంగా కోస్తా.. జనం నాడిని పట్టిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ మార్పు రాజకీయ పక్షాలను భవిష్యత్‌లో ఏ తీరాలకు చేరుస్తుందనే ఆందోళన అధికార పార్టీలో ప్రధానంగా నెలకొంది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement