రైతన్నకు ధీమా... రైతు భరోసా

ABN , First Publish Date - 2020-05-16T10:58:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసాతో పంట సాగుబడి రైతాంగానికి మరింత ధీమా పెరిగిందని

రైతన్నకు ధీమా... రైతు భరోసా

రూ.218.25 కోట్లు విడుదల 

కలెక్టర్‌ సి.హరికిరణ్‌


కడప(కలెక్టరేట్‌), మే 15: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసాతో పంట సాగుబడి రైతాంగానికి మరింత ధీమా పెరిగిందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లాలోని మొత్తం 2.91 లక్షల మంది రైతులకు రూ.218.25 కోట్ల నిధులను విజయవాడ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు.


వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరికిరణ్‌తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాధ్‌రెడ్డి, డా.సుధీర్‌రెడ్డి, డా.వెంకటసుబ్బయ్య, రఘురామిరెడ్డిలు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2020-21 సంవత్సరానికి గాను గత ఏప్రిల్‌ నెలలో రూ.2 వేలు రైతు ఖాతాల్లో జమ అయిందని, రెండవ విడతగా ఇప్పుడు రూ.5500 జమ అయినట్లు కలెక్టర్‌ సీఎంకు వివరించారు. ప్రస్తుతం కోవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న జిల్లా రైతాంగానికి ప్రభుత్వం సహకారం అందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా కేంద్రాలు జిల్లాలో ఈ నెల 30 నాటికి 620 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.


అంతకు ముందు కమలాపురానికి చెందిన రైతు శ్రీనివాసులరెడ్డి, సీకే దిన్నె, గొర్లపల్లికి చెందిన రైతు బాలిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డిలు సీఎంతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. కార్యక్రమంలో జేసీ గౌతమి, జేసీ-2 శివారెడ్డి, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఉద్యానశాఖ డీడీ మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-05-16T10:58:21+05:30 IST