జలకళ..తప్పింది!

ABN , First Publish Date - 2021-01-20T07:05:42+05:30 IST

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) పేద రైతులను సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వాలు పంపుసెట్ల పథకాలను వివిధ పేర్లతో అమలుచేస్తూ వస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్ర

జలకళ..తప్పింది!

‘జలకళ’కు 6,543 దరఖాస్తులు 

తిరస్కరించినవి 1,914.. పెండింగులో మరో 2,924

ఆమోదం పొందినవి 1,705.. వేసిన బోర్లు కేవలం 4

రెండున్నర ఎకరాలుంటేనే అర్హత.. లేదా సమష్టిగా వస్తే మంజూరు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

పేద రైతులను సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వాలు పంపుసెట్ల పథకాలను వివిధ పేర్లతో అమలుచేస్తూ వస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళ (బోరు) పేరుతో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 6,543 మంది రైతులు తమ పొలాల్లో ఉచిత బోరు కోసం దరఖాస్తు చేసు కున్నారు. కానీ ప్రభుత్వం నిబంధనలు మార్చడంతో 1,914 దరఖాస్తు లు తిరస్కరణకు గురవ్వగా 1,705 మాత్రమే ఆమోదం పొందాయి. మరో 2,924 పెండింగులో ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో నాలుగు బోర్లు తవ్వారు. కొత్త నిబంధనల ప్రకారం రెండున్నర ఎకరాలుంటేనే బోరుకు అర్హత కల్పించారు. అంత భూమి లేనిపక్షంలో ఇద్దరు, ముగ్గురు రైతులు సమష్టిగా ముందుకొస్తే వారికి సదరు 2.5 ఎకరాల విస్తీర్ణానికి ఒక బోరు మంజూరు చేస్తారు. జలకళ పథకంతో సాగునీటి ఇబ్బందులు తొలగుతాయని పలువురు రైతులు ఇంతకాలం ఆశగా ఎదురుచూశారు. తమ పొలంలో బోరు పడుతుందని, నీటి ఇబ్బం దులు ఉండవని భావించారు. కానీ కొత్త నిబంధనలతో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఏ రైతూ సాగునీటికి ఇబ్బందిపడకూడదంటూ గత ఏడాది సెప్టెంబరు 28న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని నిర్వహణను జిల్లా నీటి యాజమాన్య ఏజన్సీ (డ్వామా)కు అప్ప గించింది. ప్రారంభంలో ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంటే ఉచిత బోరు ఇస్తామనే విధివిధానాలను ప్రభుత్వం పేర్కొనలేదు. దీంతో అరెకరం పొలం ఉన్న రైతులు కూడా బోర్ల కోసం ఆయా సచివాలయాల్లో దరఖాస్తు చేశారు. జాబితాలను డ్వామా పీడీ కార్యాలయానికి పంపారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా బోర్ల కోసం 6,543 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున దరఖాస్తులు రావడంతో ప్రభు త్వం నిబంధనలు మార్చి ఒక్కో రైతుకు గరిష్ఠంగా 2.5 ఎకరాలుంటేనే బోరు మంజూరు చేస్తామని మెలిక పెట్టింది. ఈ వడపోతలో వేలాదిమంది రైతులు అవకాశం కోల్పోయారు. అయితే ఇద్దరు, ముగ్గురు రైతులు పొలం పక్కపక్కనే ఉండి 2.50 ఎకరాలకు మించకపోతే వారందరికీ ఒక బోరు మంజూరు చేస్తామని చాన్స్‌ ఇచ్చింది. కానీ కలిసి బోరు వేయించుకుంటే పంటకు నీరందించే విషయంలో వివాదాలు వస్తాయని భావిస్తున్న రైతులు ఉమ్మడిగా బోరు వేయించుకోడానికి ఇష్టపడడం లేదు. దీంతో ఇప్పుడు అర్హత జాబితాలో ఉన్న రైతులు కూడా వెనక్కు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశముంది.


జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో బోరు తవ్వకం యంత్రాన్ని ఏర్పాటుచేశారు. బోర్ల తవ్వకాల పనిని కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆమోదం పొందిన 1,705 మంది పొలాల్లో నీటిమట్టం ఎంత ఉంది, అక్కడ బోరు వేస్తే నీరు వస్తుందా లేదా, సదరు ప్రదేశంలో బోరు వేయడానికి ఏ మేరకు అవకాశం ఉందనే విషయాలపై కాంట్రాక్టర్లు హైడ్రో జియోలాజికల్‌, జియోఫిజికల్‌ అధికారులతో  సర్వే చేయిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక కలెక్టరేట్‌ నుంచి పరిపాలనా ఆమోదం తీసుకుని ఎక్కడైతే బోరు వేయడానికి అనుకూలమో అక్కడ  వేయడానికి చర్యలు చేపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో భూగర్భ జల శాఖ (గ్రౌండ్‌ వాటర్‌) అధికారులతో సర్వే నిర్వహిస్తున్నారు. దీనిపై డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి మాట్లాడుతూ అనర్హుల జాబితాను సచివాలయాలకు పంపాం. అక్కడ ఈ జాబితాను కార్యదర్శులు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు. రెండున్నర ఎకరాలలోపు రైతులు ఒక బృందంగా ఏర్పడితే వారికి కూడా బోరు మంజూరు చేస్తామన్నారు. 

Updated Date - 2021-01-20T07:05:42+05:30 IST