రూ.కోట్లలో ‘ముంచారు’

ABN , First Publish Date - 2021-03-03T07:09:34+05:30 IST

ఏజెన్సీలోని గిరిజన, గిరిజనేతర మహిళల జీవితాల్లో వెలుగునింపడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం పక్కదారి ప

రూ.కోట్లలో ‘ముంచారు’

వైఎస్‌ఆర్‌ క్రాంతిపథంలో భారీ కుంభకోణం

నాడు వెలుగు పథకంలోనూ స్వాహానే

ఏజెన్సీలో మహిళలను ముంచేసిన వైనం

డీవీ కోట క్లస్టర్‌లోనే రూ.కోటి

రాజకీయ అండతో సీసీ బరితెగింపు

ఏడు మండలాల్లో విచారణ మొదలు

2014-2020 వరకూ రూ.70 కోట్ల రుణాలు

మింగేసిదెంతో తేల్చే పనిలో యంత్రాంగం


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

 ఏజెన్సీలోని గిరిజన, గిరిజనేతర మహిళల జీవితాల్లో వెలుగునింపడం కోసం  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన  వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం  పక్కదారి పట్టింది. ఇది కొందరు అవినీతిపరుల జీవితాల్లో వెలుగు నింపగా, గిరిజన మహిళల జీతాలను మరింత చీకటిమయం చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజన, గిరిజనేతర మహిళలు స్వయంకృషితో అభి వృద్ధి చెందడానికి, వారి జీవితాల్లో వెలుగు నింపడానికి కేంద్ర ప్రభుత్వం సుమారు ఆరు రకాల పథకాలకు నిధులు ఇస్తోంది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కొంత ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో వెలుగు పథకం పేరిట వీటిని అమలు చేయగా, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వైఎస్‌ఆర్‌ క్రాంతిపథంగా కింద మార్చింది. కానీ ఆనాడూ, ఈనాడూ కూడా ఈ పథకం లబ్ధిదార్లకు చేరింది లేదు. అమాయక గిరిజన మహిళలను మోసం చేసి, ఇతరులు రూ.కోట్లు నొక్కేశారు. మారేడుమిల్లి మండలంలోని డీవీ కోట క్లస్టర్‌ పరిధిలోని ఐదు గ్రామాల్లోనే రూ.కోటి వరకూ కుంభకోణం జరిగినట్టు తేలింది. దీంతో ఐటీడీఏ పీవో మొత్తం ఏడు మండలాల్లో విచారణకు ఆదేశించారు. ఇప్పటికే పోలీసు స్టేషన్‌లో మూడు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. 2014 నుంచి 2020 వరకూ  రంపచోడవరం డివిజన్‌లోని ఏడు మండలాల్లో రూ.70 కోట్ల విలువైన పథకాలు అమలు చేశారు. ఇందులో ఎన్ని కోట్లు మింగేశారో విచారణ పూర్తయితేనేగానీ స్పష్టం కాదు. ఇప్పటికే రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్టు సమాచారం. గిరిజన మహిళల ఆరోగ్యం, పౌష్టికారం అందివ్వడానికి  హెచ్‌డీఐఫ్‌, మేకలు, గొర్రెలు, బర్రెలు, కోళ్లు ఇతర జంతువులను మేపుతూ బతకడానికి టీఎస్‌ పీ, సీసీడీపీ వంటి పథకాలు అమలు చేస్తోంది. అంతేకాక స్ర్తీనిధి, విలేజి ఆర్గనైజేషన్‌ రివాల్వింగ్‌ ఫండ్‌ వంటి పథకాల్లోనూ అంతా మోసమే జరిగింది. ఈ ఏడు మండలాల్లో మొత్తం  5,366 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో 60 వేల మంది మహిళలు ఉన్నారు. ఇందులో గిరిజన మహిళలే ఎక్కువ. దేవీపట్నంతో మరో మండలంలో మాత్రం కొంతమంది గిరిజనేతరులున్నారు. వీరందరికీ కేంద్రం, రాష్ట్రం నేరుగా వారి సంఘాల పేరిట ఉన్న బ్యాంక్‌ ఖాతాలల్లోకే నిధులు విడుదల చేస్తాయి. ఇది పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. మొత్తం డబ్బు చెల్లించవలసిందే. ఇలా 2014 నుంచి గతేడాది వరకూ రూ.70 కోట్లు రిలీజయ్యాయి. కానీ గిరిజన మహిళల బతుకులు మారలేదు. ఎందుకంటే అవి పూర్తిగా వారికి చేరలేదు. 


ఎలా జరిగిందంటే..

డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడం కోసం ప్రతీ మండలాన్ని ఆయా గ్రామాల సంఖ్యను బట్టి ఐదారు క్లస్టర్లుగా విభించారు. డివిజన్‌లో ఏపీడీ ఉంటారు. మండలానికి ఒక ఏపీఎం ఉంటారు. కింద మరో మూడంచెల వ్యవస్థ ఉంది. అందులో కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ (సీసీ) వ్యవస్థ ఒకటి. మారేడుమిల్లి మండలంలోని డీవీ కోట క్లస్టర్‌లో డీవీ కోట, తాడేపల్లి, సిరిపురం, దొరమామిడి, నర్సాపురం గ్రామాలున్నాయి. ఈ క్లస్టర్‌కు సీసీగా సింహాద్రి అనే మహిళ పనిచేస్తోంది. ఆమెకు ఏజెన్సీలో పెత్తనం చేస్తున్న రాజకీయ నేతల అండగా బలంగా ఉంది. ఇక్కడ మహిళా గ్రూపులకు మేకలు, ఇతర పశువుల కోసం రుణం మంజూరైంది. బ్యాంక్‌ ఖాతాల్లో సొమ్ము పడింది. ఇక మహిళల పేర చెక్కులు రాసి బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేయాలి. కానీ ఇక్కడ సీసీ, ఇతరులు కలసి ముందుగానే మహిళల చేత వేరేగా సంతకాలు పెట్టించుకున్నారు. అంతేకాక రూ.1 లక్ష రుణం వస్తే, అందులో సగం సబ్సిడీ ఉందని చెప్పి రూ.50 వేలు సబ్సిడీ ముందుగా కట్టేసి, ఇక మీరసలు బాకీ చెల్లించనవసరం లేదని నమ్మించారు. దీంతో నిజమేనని మహిళలు నమ్మారు. ఈ సొమ్మును నొక్కేశారు. ఈమె తన కొడుకు పేరిట, రంపచోడవరంలో మటన్‌ దుకాణదారుడి పేర, తనకు బాగా తెలిసిన వారి పేరిట చెక్‌లు రాసి డబ్బులు డ్రా చేసింది. ఇందులో లబ్ధిదార్లకు ఏమీ ఇవ్వలేదు.  ఇలా చెక్‌లు డ్రా చేసిన వారిలో 20 నుంచి 25మంది వరకూ ఉన్నట్టు ప్రాఽథమికంగా రూఢీ అయింది. ఏజెన్సీ పోలీసుస్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేయగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


ఎలా పొక్కిందంటే...

రుణం తీసుకున్న మహిళలు తిరిగి డబ్బు చెల్లించాలి. కానీ ఎవరూ చెల్లించడంలేదు. దీంతో ఇటీవల పాత అఽధికారులు మారడంతో కొత్తగా వచ్చిన అధికారులు రికవరీ మీద దృష్టి పెట్టగా, విషయం వెలుగులోకి వచ్చింది. అసలు డ్వాకా మహిళలకు రుణాలు అందలేదని, అందినవారికి కొంతమేర మాత్రమే ఇచ్చారని తేలింది. తాము మోసపోయినట్టు గుర్తించిన డీవి కోట క్లస్టర్‌కు చెందిన 200 మంది మహిళలు కొద్దిరోజుల కిందట ఐటీడీఏ పీవోను కలసి తమ పరిస్థితిని విన్నవించారు. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు, ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం కింద శాఖాపరమైన దర్యాపు జరుగుతోంది.  తర్వాత ఏపీడీ, తహశీల్దార్‌, ఎస్‌ఐతో మరో విచారణ చేస్తారు.


రాజకీయ ఒత్తిళ్లు

2014 నుంచి 2020 వరకూ ఆరేళ్లలో సుమారు రూ.70 కోట్ల రుణాలు మంజూరు కావడంతో ఇందులో ఎంత కుంభకోణం జరిగిందనేది ఏజెన్సీలో అలజడి రేపుతోంది.  అసలు మంజూరైన రుణాలను ఇవ్వకపోగా, ఇచ్చినచోట నాసిరకం పశువులకు ఎక్కువ ధరలు నిర్ణయించడం, కమీషన్లు కొట్టేయడం, రాజకీయ బేరాలు, ఇవన్నీ చూస్తే ఇక్కడ పెద్ద కుంభకోణమే జరిగిందనే అంచనా ఉంది. ఇప్పటికే రూ.కోటి వరకూ అవకతకలకు సంబంధించిన ఆధారాలు లభ్యంకావడంతో దోపిడీదారులు, వారికి అండగా నిలిచిన రాజకీయ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ విచారణను తప్పుదారి పట్టించడానికి ఈ ప్రాంతంలో ముఖ్యులు ఇప్పటికే ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. నిజంగా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కుంభకోణం బయటపెట్టకపోతే, రుణాలు ఎవరి నుంచి రికవరీ చేస్తారోననే ఆందోళన కూడా బయలుదేరింది. 

Updated Date - 2021-03-03T07:09:34+05:30 IST