పింఛన్‌కూ ‘ఠంచన్‌’ తప్పింది!

ABN , First Publish Date - 2021-08-02T08:08:23+05:30 IST

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద రాష్ట్రంలో 13 లక్షల మంది అవ్వాతాతలకు ఆదివారం పింఛన్‌ అందలేదు. ఒకటో తేదీ తెల్లవారుజామునే ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. ప్రతి నెలా ఉద్యోగుల

పింఛన్‌కూ ‘ఠంచన్‌’ తప్పింది!

13 లక్షల మందికి అందని సామాజిక పెన్షన్‌

బ్యాంకుల్లో నిధుల్లేకే ఇవ్వలేదంటున్న సిబ్బంది

కొందరు లబ్ధిదారులకు ముందురోజే చెప్పిన వలంటీర్లు


అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద రాష్ట్రంలో 13 లక్షల మంది అవ్వాతాతలకు ఆదివారం పింఛన్‌ అందలేదు. ఒకటో తేదీ తెల్లవారుజామునే ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలైనా ఆలస్యమవుతాయి గానీ, సామాజిక పెన్షన్లు మాత్రం ఆలస్యం కాకూడదన్నది సీఎం జగన్‌ ఆదేశమని ప్రచారం చేసుకున్నారు. అంత గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈనెలలో 1వ తేదీన అందరికీ పెన్షన్లు పంపిణీ చేయడంలో విఫలమైందని చెప్పుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ‘నగదు కటకట’ అనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెన్షన్లు కూడా ఒకటో తేదీన ఇవ్వలేకపోతున్నారనే ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూర్చేలా శనివారం సాయంత్రం కొంత మంది వలంటీర్లు లబ్ధిదారులకు ఫోన్‌ చేసి ‘ఆదివారం మీకు పెన్షన్‌ ఇవ్వలేం.. డబ్బు అందలేదు’ అని చెప్పారు.  ఆదివారం సాయంత్రం 6.30 గంటల వరకు 47,33,579 మందికి మాత్రమే పెన్షన్లు అందించినట్లు ఆన్‌లైన్‌లో నివేదికలొచ్చాయి. అంటే 13,16,808 మంది(22 శాతం)కి  అందలేదు. 

 

అవ్వాతాతల్ని ఇంకెంతకాలం మోసం చే స్తారు: లోకేశ్‌

అవ్వాతాతల్ని ఇంకెంత కాలం మోసం చేస్తారు జగన్‌రెడ్డీ? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ‘ఒకటో తారీఖునే పింఛను  ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి? ఒక్క నెల జే ట్యాక్స్‌లో 10శాతం వెచ్చిస్తే అందరికీ పింఛన్లు ఇచ్చేయొచ్చు’ అని ట్వీట్‌ చేశారు. 


జీతాలు, పింఛన్లు ఇవ్వలేక పోవడం సిగ్గుచేటు: సాకే

అనంతపురం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం రోజురోజుకు దివాలా తీస్తోంది. జీతాలు, పింఛన్లు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు’’ అని పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ అన్నారు. ఆదివారం అనంతపురం  డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

Updated Date - 2021-08-02T08:08:23+05:30 IST