అరకులోయలో వైఎస్‌ఆర్‌ గిరిజన విశ్వవిద్యాలయం

ABN , First Publish Date - 2020-05-31T12:39:44+05:30 IST

అరకులోయలో వైఎస్‌ఆర్‌ గిరిజన విశ్వవిద్యాలయం

అరకులోయలో వైఎస్‌ఆర్‌ గిరిజన విశ్వవిద్యాలయం

  •  రూ.12.5 కోట్లు విడుదల 
  • ఏడాదిలో రూ.473.62 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి 

అరకులోయ: అరకులోయలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. శనివారం మండలపరిషత్‌ కార్యాలయంలో తన ఏడాది పాలనపై విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.12.5 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఏడాదిలో నియోజకవర్గంలో రూ.473.62 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. వీటిలో తారురోడ్లు, వంతెనలకు రూ.317.29 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అదేవిధంగా 54 చెక్‌డామ్‌లకు రూ.5.41 కోట్లు మంజూరు చేశామన్నారు. తాగునీటి సౌకర్యానికి రూ.96 లక్షలు వ్యయం చేశామన్నారు. నియోజకవర్గంలో 135 సచివాలయాల భవనాలకు నిధులు మంజూరు చేశామన్నారు.    వీటిలో 80 శాతం భవనాల నిర్మాణాలు ప్రారంభ దశలో ఉన్నట్టు తెలిపారు. శాసనసభ్యుడిగా వచ్చిన మొదటి నెల జీతం తన స్వగ్రామం అభివృద్ధికి కేటాయించానన్నారు. పాడేరులో సొంత నిధులతో ప్రత్యేకంగా విశ్రాంతి భవనాన్ని నిర్మించినట్టు చెప్పారు. సీఏం సహాయనిధి నుంచి 8 మందికి రూ.35 లక్షలు మంజూరు చేయించినట్టు చెప్పారు. గర్భిణులకు అరకులోయలో వసతిగృహాన్ని ఏర్పాటు చేశామన్నారు. కుజబంగి-రూఢకోట, బంగారుమెట్ట-గడుగుబిల్లి, టోకూరు రింగ్‌ రోడ్లను ఏర్పాటు చేశామన్నారు. నూతనంగా గుమ్మకోట-లోతేరు-పాచిపెంటకు రూ.9 కోట్లతో రహదారి పనులను ఇటీవలే ప్రారంభించామన్నారు. భవిష్యత్‌లో పద్మాపురం పంచాయతీ రణజిల్లెడలో మినీరిజర్వాయర్‌ మంజూరుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో బీఈడీ, డీఎడ్‌, నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటుతోపాటు స్కిల్‌డవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

Updated Date - 2020-05-31T12:39:44+05:30 IST