దుమారం రేపుతున్న వైఎస్ సంస్మరణ సభ!

ABN , First Publish Date - 2021-09-02T22:54:16+05:30 IST

వైఎస్ విజయలక్ష్మి నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్ సంస్మరణ సభ రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన

దుమారం రేపుతున్న వైఎస్ సంస్మరణ సభ!

హైదరాబాద్: వైఎస్ విజయలక్ష్మి నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్ సంస్మరణ సభ రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత నిర్వహిస్తున్న ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రముఖులను విజయలక్ష్మి ఆహ్వానించారు. తెలంగాణలో రాజకీయంగా వైఎస్‌ఆర్‌తో సన్నిహితంగా ఉన్న 88 మందికి విజయలక్ష్మి ఆహ్వానాలు పంపారు.  ఏపీ నుంచి 44 మందిని ఆమె స్వయంగా ఫోన్ చేశారు. సినిమా, సామాజిక, వ్యాపార, వైద్య ప్రతికా రంగాలకు చెందిన దాదాపు 350 మంది ఈ కార్యక్రమానికి హజరవుతారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ వెళ్లొద్దని టీపీసీసీ సూచించింది. టీపీసీసీ, ఏపీసీసీ అధ్యక్షులు కలిపి తీసుకున్న నిర్ణయం ప్రకారం నేతలు ఎవరూ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనవద్దని సూచించారు. వైసీపీ నేతలు కూడా హాజరయ్యే అవకాశాలపై అనుమానాలున్నాయి.  


అప్పట్లో వైఎస్‌ మంత్రివర్గంలోను, సన్నిహితులుగా ఉండి.. ప్రస్తుతం కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారినీ విజయలక్ష్మి ఆహ్వానించడంతో ఈ సంస్మరణ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారన్నది ఆసక్తికరంగా మారింది. జెండా పండుగ, ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకోవడంతో టీఆర్‌ఎస్‌ నాయకగణం గురువారం బిజీగా ఉండే పరిస్థితులున్నాయి. దీంతో ఆ పార్టీలోని ఆహ్వానితులు పాల్గొనే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే, పార్టీకి దూరంగా ఉంటున్న డీఎస్‌ హాజరవుతారా లేదా అన్నది స్పష్టత లేదు. కాంగ్రెస్‌ పార్టీలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆహ్వానితులు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా.. పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందన్న మీమాంసలో ఉన్నారు.


Updated Date - 2021-09-02T22:54:16+05:30 IST