రీ కౌంటింగ్ చేయాల్సిందే.. YSRCP అభ్యర్థి ధర్నా...

ABN , First Publish Date - 2021-11-17T18:53:45+05:30 IST

అనంతరం ఇరుపక్షాల ఏజెంట్లు సంతకాలు చేయటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ...

రీ కౌంటింగ్ చేయాల్సిందే.. YSRCP అభ్యర్థి ధర్నా...

కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేటలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో అధికార పార్టీ నేతలు హల్‌చల్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగో వార్డులో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై.. టీడీపీ అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి 14 ఓట్లతో గెలిచినట్లు అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించేశారు. అనంతరం ఇరుపక్షాల ఏజెంట్లు సంతకాలు చేయటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఇద్దరూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అయితే రెండు గంటల తర్వాత మళ్లీ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి రీ కౌంటింగ్ చేయాలని వైసీపీ అభ్యర్థి పట్టుబట్టారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. డబుల్ డిజిట్ మెజారిటీ వస్తే కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో రీకౌంటింగ్ చేయాలని కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థితో పాటు మిగతా అభ్యర్థులు, స్థానిక నేతలు ధర్నాకు దిగారు.


మరోవైపు.. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి గెలిచినా డిక్లేర్ చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఫలితం వెల్లడించాలని టీడీపీ అభ్యర్థి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాను అధికారులు బయటికి పంపించేశారు. సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ హుటాహుటిన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అటు రీ కౌంటింగ్‌పై.. ఇటు పెండింగ్‌లో ఉన్న ఫలితంపై సబ్ కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా.. జగ్గయ్యపేట నగర పంచాయతీలో ఫలితాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ తెలుగుదేశం- 08, వైసీపీ- 08 స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు. మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తికాగా.. ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2021-11-17T18:53:45+05:30 IST