కాణిపాకం సాక్షిగా వైసీపీ హైకమాండ్‌కు తలనొప్పులు

ABN , First Publish Date - 2021-07-26T18:15:03+05:30 IST

గత ప్రభుత్వాలు ఉభయదారులకు అవకాశం కల్పించి గౌరవ హోదాలు కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం పదవి ఇవ్వకపోగా పక్క నియోజకవర్గాలను పైకెత్తుకోవడం ఏంటనే చర్చ మొదలైంది.

కాణిపాకం సాక్షిగా వైసీపీ హైకమాండ్‌కు తలనొప్పులు

కాణిపాకం సాక్షిగా అధికార వైసీపీలో నాయకులపై అపనమ్మకాలు పెరిగిపోతున్నాయట. ఆలయ కమిటీ చైర్మన్‌గా నాన్‌లోకల్‌ను నియమించడంపై స్థానిక క్యాడర్‌ కన్నెర్ర చేస్తోంది. గత ప్రభుత్వాలు ఉభయదారులకు అవకాశం కల్పించి గౌరవ హోదాలు కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం పదవి ఇవ్వకపోగా పక్క నియోజకవర్గాలను పైకెత్తుకోవడం ఏంటనే చర్చ మొదలైంది. ఇంతకీ కాణిపాకం ఆలయ కమిటీ చైర్మన్‌ ఎన్నిక వెనుక ఏం జరిగింది? ఉభయదారులకు అవకాశం దక్కకపోవడానికి కారణమేంటి? వారి భవిష్యత్‌ కార్యచరణ పూతలపట్టు వైసీపీకి ఎలాంటి హెచ్చరికలు పంపుతోంది.



నామినేటెడ్‌ పదవులతో ద్వితీయశ్రేణి క్యాడర్‌కు న్యాయం చేశామని గొప్పలు పోతున్న వైసీపీ హైకమాండ్‌కు ఎక్కడికక్కడ స్థానిక సెగ తప్పడం లేదట. చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయ కమిటీ చైర్మన్‌ ఎంపిక.. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ పట్టు చేజారేలా చేసే అవకాశాలున్నాయనే టాక్‌ వస్తోంది. తిరుమల, శ్రీకాళహస్తి తర్వాత అంతటి ప్రసిద్ది పొందిన కాణిపాకం ఆలయంలో ఉభయదారులకు ప్రతీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వస్తుండేది. అయితే వైసీపీ సర్కార్‌ పాత జమానాకు పాతరేసి కొత్త సంప్రదాయానికి తెరలేపిందనే ప్యాన్‌ పార్టీ కార్యకర్తలు కసిగా రగిలిపోతున్నారట. 


ఇటు కాణిపాకం దేవస్థానం ఉన్న పూతలపట్ట నియోజకవర్గంలోని ఉభయదారులకు కాకుండా, సెగ్మెంట్‌లోని కార్యకర్తలకు కాకుండా పక్కనున్న పూతలపట్టు అసెంబ్లీ పరిధిలోని నేత కుటుంబానికి ఆలయ కమిటీ చైర్మన్‌ పదవి కేటాయించడంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది.గంగాధరనెల్లూరు నియోజక వర్గం పరిధిలోని పెనుమూరు మండలంకు చెందిన ప్రమీల రెడ్డి అనే మహిళకు పదవిని తొలుత కట్టబెట్టింది. ఆ తర్వాత కుటుంబ సమీకరణాలు, వయసు తదితర కారణాలు నెమరువేసుకుని ఆమె కోడలు లతారెడ్డికి పదవి అప్పజెప్పింది. చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులకు పదవి దక్కడం వెనుక జిల్లాకు చెందిన వైసీపీ కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 




కాణిపాకం ఆలయ చైర్మన్‌గా గంగాధరనెల్లూరు నియోజకవర్గం నేతను నియమించడంతో స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు ఉభయదారుల నుంచి కార్యకర్తల నుంచి నిరసన సెగ తప్పడం లేదు.  గతంలోనే స్ధానిక  ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు స్ధానికేతరులను కాణిపాకం కమిటీ చైర్మన్‌గా  ఓ మహిళను నియమించాల‌ని నిర్ణయించుకోవడంతో ఆలయ ఉభయదారుల నుండి ఎం.ఎస్.బాబు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోన్నారు. అప్పట్లో అసమ్మతి ఎదుకావడంతో ఎం.ఎస్.బాబు తన నిర్ణయాన్ని విరమించుకోక తప్పలేదు. తీరా ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏకంగా  ఉభయదారులకు కాకుండా స్థానిక నేతలకు కాకుండా నాన్ లోకల్‌కు చెందిన మహిళకు పదవి కట్టబెట్టడంతో వస్తున్న వ్యతిరేకతపై ఎమ్మెల్యేకు ఎటూ చెప్పలేని పరిస్థితి ఎదురవుతోందట. తన మనుషులకు పదవి ఇప్పించుకోలేకపోవడం ఒక రకమైన ఫెయిల్యూర్‌ అయితే నియోజవర్గంలో ఇతరుల పెత్తనం ఎమ్మెల్యే సత్తాకు సవాల్‌ చాటినట్లు అయిందనే టాక్‌ పూతలపట్టులో చక్కర్లు కొడుతోందట. 


 

వైసీపీ హైకమాండ్ ఆలయ కమిటీ చైర్మన్‌గా ఉభయదారులను నియమించకపోవడంపై  నియోజవర్గం వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పోరుబాట చేయాలని నిర్ణయించుకున్నారట.వంశపారంపర్యంగా కాణిపాకం ఆలయాన్ని అభివృద్ది చేస్తూ వస్తున్న ఉభయదారుల్లోని కుటుంబాలు చైర్మన్‌ ఎంపిక విషయంలో తమను పట్టించుకోకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నాయట. కాణిపాకం ఆలయ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించే ఉభయదారుల్లో  వైసీపీ సర్కార్‌ తీరుపై  అసంతృప్తి పెరిగిపోతుందట. సంప్రదాయాన్ని మార్చడంపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారట. నియోజకవర్గం వ్యాప్తంగా 14 గ్రామాల్లో ఉన్న కాణిపాకం ఉభయదారులు ఏకతాటిపైకి వచ్చి న్యాయపోరాటం చేయాలనుకుంటున్నారట. ఆలయం ఎదుట ఆందోళనకు సిద్దమైన ఉభయదారులకు, స్థానిక నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేయడం, కార్యక్రమాలను భగ్నం చేయడంపై పూతలపట్టు వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందట. అయితే ఇందులో తమ ప్రమేయం ఏమీలేదని, పొరుగు నియోజకవర్గాల పాత్ర ఉందని వ్యతిరేకతను తప్పించుకునే ప్రయత్నాన్ని ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు చేస్తున్నారట. కాణిపాకం ఇష్యూ జిల్లా వ్యాప్తంగా పార్టీలో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో అనే చర్చ జరుగుతోందట. 

Updated Date - 2021-07-26T18:15:03+05:30 IST