కోవిడ్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం చేయట్లేదు : వైసీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-08-03T22:45:44+05:30 IST

అనంతపురం : జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం చేయట్లేదని గత వారం రోజులుగా

కోవిడ్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం చేయట్లేదు : వైసీపీ ఎమ్మెల్యే

అనంతపురం : జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం చేయట్లేదని గత వారం రోజులుగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతటి ఆగని ఆయన.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజాప్రతినిధులు వెళ్తే కానీ వైద్యులు కోవిడ్‌ వార్డుల్లోకి రావడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరకముందే ప్రాణాలు పోతున్నాయని.. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించడం లేదని అనంత వ్యాఖ్యానించారు.


మంత్రికి ఎమ్మెల్యే ఫిర్యాదు..

డాక్టర్లకు కౌన్సెలింగ్ ఇప్పించాలని జిల్లా వైద్యాధికారులకు ఆయన సూచించారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని అనంత వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించిందన్నారు. ఈ సందర్భంగా వైద్యుల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నానికి ఎమ్మెల్యే అనంత ఫిర్యాదు చేశారు. కరోనా బాధితుల పట్ల వైద్యుల చిన్నచూపు తగదని.. నాసిరకమైన భోజనం అందిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆయన కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్‌ చేస్తామని నాని హెచ్చరించారు.


కాగా.. అనంతపురం జడ్పీ కార్యాలయం ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమావేశమయ్యారు. కరోనా విస్తరణ నేపథ్యంలో నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకరనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-08-03T22:45:44+05:30 IST