కరోనా సాయం: వైసీపీ ఆధిపత్యం.. టీడీపీ నేతపై దాడి

ABN , First Publish Date - 2020-04-07T20:08:26+05:30 IST

కరోనా సాయం పంపిణీలో వైసీపీ ఆధిపత్య దాడులకు దిగుతోంది..!

కరోనా సాయం: వైసీపీ ఆధిపత్యం.. టీడీపీ నేతపై దాడి

తిరుపతి : కరోనా సాయం పంపిణీలో వైసీపీ ఆధిపత్య దాడులకు దిగుతోంది.! ఇప్పటికే పలు చోట్ల వాలెంటీర్లు దాడి చేసినట్లు వార్తలు వెలువడగా తాజాగా శ్రీకాళహస్తిలో మరో ఘటన వెలుగుచూసింది. లాంకో పరిశ్రమలో పీఆర్ఓగా పని చేస్తున్న బత్తిరెడ్డి సూచనలతో పరిశ్రమ యాజమాన్యం పరిసర గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులను అందించడానికి నిర్ణయించింది. అయితే.. బత్తిరెడ్డి టీడీపీ నేత కావడంతో ఆయన ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాల నిర్వహణకు వైసీపీ శ్రేణులు అభ్యంతరం తెలిపారు. నిత్యావసర సరుకులు తీసుకురావడానికి పరిశ్రమకు వెళ్తుంటే బత్తిరెడ్డిని మార్గమధ్యంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడి చేశారు. ఈ దాడిలో బత్తిరెడ్డి  తీవ్రంగా గాయపడ్డాడు.


నేతల పరామర్శ..

విషయం తెలుసుకున్న స్థానికులు, టీడీపీ నేతలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సోదరుడు మాజీ ఎంపీపీ  హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు మునిరాజా నాయుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రవి, దశరథ చారి, వెంకటేశ్వర నాయుడు తదితర  నాయకులు ఏరియా ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. బత్తిరెడ్డిపై దాడికి నిరసనగా చల్ల పాలెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శ్రీకాళహస్తి, తిరుపతి మార్గంలో పూతలపట్టు- నాయుడుపేట రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై వైసీపీ నేతలుగానీ.. పోలీసులు గానీ ఇంతవరకూ స్పందించలేదు.

Updated Date - 2020-04-07T20:08:26+05:30 IST