Tirupati : పింఛను తీసేశారని ప్రశ్నిస్తే.. దళిత దంపతులను చితకబాదిన YSRCP యువనేత!

ABN , First Publish Date - 2021-09-04T12:06:50+05:30 IST

కొన్నేళ్లుగా ఇస్తున్న పింఛనును ఎందుకు తొలగించారని అడిగినందుకు...

Tirupati : పింఛను తీసేశారని ప్రశ్నిస్తే.. దళిత దంపతులను చితకబాదిన YSRCP యువనేత!

  • దళిత దంపతులపై అధికార పార్టీ నేత దాడి
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

చిత్తూరు జిల్లా/తిరుపతి/వి.కోట : కొన్నేళ్లుగా ఇస్తున్న పింఛనును ఎందుకు తొలగించారని అడిగినందుకు అధికార పార్టీకి చెందిన యువనేత తమపై దాడి చేశాడని వి.కోట మండలం చింతమాకులపల్లెకు చెందిన సుబ్బన్న, ప్రమీల దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. పింఛను సొమ్ము రూ.200 ఉన్నప్పటినుంచి నుంచి సుబ్బన్నకు పెన్షన్‌ వస్తోంది. ఇటీవల సామాజిక తనిఖీ నిర్వహించిన సచివాలయ సిబ్బంది పింఛనుకు ఈయనకు అర్హత లేదని నిర్ధారించి పేరు తొలగించారు. ఈ విషయమై ఈ నెల ఒకటో తేదీన సచివాలయ వెల్ఫేర్‌ అధికారితో సుబ్బన్న వాదనకు దిగారు. అధికార పార్టీ నాయకుల మాటలు విని తన పింఛను తొలగించారని ఆరోపించారు.


సామాజిక తనిఖీలో సుబ్బన్నకు ఇస్తున్నది వితంతు పింఛనుగా తేలిందని, అతడి వయస్సు 58 కావడంతో తొలగించినట్లు అధికారులు తేల్చి చెప్పారు. సచివాలయం వద్ద గొడవ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి, యువ నేత అక్కడికి చేరుకుని సుబ్బన్నను వారించే ప్రయత్నం చేశారు. అయినా అతడు వినకపోగా కావాలనే తన పింఛను తొలగించారని నిష్ణూరమాడారు. దీంతో రెచ్చిపోయిన యువనేత సుబ్బన్నను దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నారు. అడ్డొచ్చిన అతడి భార్యను  కూడా కొట్టారు. దీనిపై బాధితులు సీఐ ప్రసాద్‌బాబుకు ఫిర్యాదు చేశారు.


దళితులైన తమపై అధికార పార్టీకి చెందిన నేత దాడి చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేయకపోగా తమపై ఎదురుకేసు పెట్టేందుకు పథకం పన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను  తొలగించారని అడిగినందుకు దళితుడిపై దాడి చేయడం అమానవీయమని, పోలీసుశాఖ స్పందించి బాధ్యులపై కేసు నమోదు చేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు రంగనాథ్‌ డిమాండ్‌ చేశారు. కాగా, సామాజిక తనిఖీలో పింఛను తొలగించినందుకు సుబ్బన్న తమను దుర్భాషలాడాడని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరు పక్షాల వద్ద ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఏంచేయాలో తెలియక తికమక పడుతున్నారు.

Updated Date - 2021-09-04T12:06:50+05:30 IST