మాటతప్పిన కేసీఆర్‌ గద్దె దిగాలి

ABN , First Publish Date - 2021-10-27T08:49:55+05:30 IST

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాట తప్పిన సీఎం కేసీఆర్‌ వెంటనే గద్దె దిగాలని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

మాటతప్పిన కేసీఆర్‌ గద్దె దిగాలి

  • తిమ్మాపురంలో ‘నిరుద్యోగ’ దీక్షలో వైఎస్‌ షర్మిల
  • ఏడో రోజు కొనసాగిన పాదయాత్ర 


కందుకూరు/ఇబ్రహీంపట్నం, అక్టోబరు 26: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాట తప్పిన సీఎం కేసీఆర్‌ వెంటనే గద్దె దిగాలని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని పేదలను కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు. మూడు ఎకరాల భూమి ఇస్తామని దళితులను, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని విద్యార్థులను, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మైనార్టీలను ఆయన మోసం చేశారని అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఏడో రోజు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్‌మియాగూడ నుంచి మంగళవారం రెండు కిలోమీటర్లు పాదయాత్రగా తిమ్మాపురం గ్రామానికి చేరుకున్న షర్మిల ఇక్కడే సాయంత్రం వరకు ఒక రోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిరుద్యోగులకు నెలకు రూ.3,016 వేల భృతి ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ దీనిని అటకెక్కించారన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్త జిల్లాలు, మండలాలను కలుపుకుని చూస్తే 3.85 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు తేలిందని ఆమె తెలిపారు.



నిరుద్యోగులు నిరాశకులోనై ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ అధికారంలోకి వస్తే మొదట ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.  దీక్ష అనంతరం షర్మిల సాయంత్రం మరో రెండు కిలోమీటర్లు నడిచి గ్రామ శివారులో బస చేశారు. కాగా, షర్మిల పాదయాత్ర బుధవారం కందుకూరు మండలం తిమ్మాపురం శివారు నుంచి ఉదయం 9.30 గంటలకు మొదలై రాచులూరు, గాజులబుర్జుతండా, బేగంపేట, మాదాపురం మీదుగా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చేరుకుంటుంది. అక్కడే మాట-ముచ్చట కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అనంతరం ఎలిమినేడులోనే బస చేస్తారు.  

Updated Date - 2021-10-27T08:49:55+05:30 IST