మళ్లీ టీటీడీ చైర్మన్‌గా YV Subbareddy.. బోర్డు సభ్యుల ప్రకటన లేదేం..!?

ABN , First Publish Date - 2021-08-08T18:47:53+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) మరోసారి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని జగన్ సర్కార్ నియమించింది.

మళ్లీ టీటీడీ చైర్మన్‌గా YV Subbareddy.. బోర్డు సభ్యుల ప్రకటన లేదేం..!?

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) మరోసారి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని జగన్ సర్కార్ నియమించింది. అయితే పాలకమండలి సభ్యులను మాత్రం ఇవాళ ప్రభుత్వం ప్రకటించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కమిటీ నియామకం ఉంటుందని తెలుస్తోంది. కాగా వైసీపీ అధికారంలోకి వచ్చాక వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. అయితే రెండు సంవత్సరాలు పూర్తి కావడంతో ఆ పదవి వేరొకరికి ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ.. ఆ పదవిని తన బాబాయ్ వైవీకే జగన్ కట్టబెట్టారు. పాలకమండలిలో చోటు కోసం చాలా మంది వైసీపీ నేతలు ఎదురుచూస్తుండటంతో పాటు ఇతర రాష్ట్రాల నేతల కూడా ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఎవర్ని నియమించాలో ఏంటో అని అధిష్టానం తల పట్టుకుందోట. అందుకే ఇవాళ చైర్మన్‌ను నియమించినప్పటికీ పాలక మండలి సభ్యులను నియమించలేదట.


పాలకమండలి సంగతేంటో..!?

మొత్తానికి చూస్తే.. టీటీడీ చైర్మన్‌ పదవిపై సీఎం జగన్‌కు టెన్షన్‌ తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే పాలకమండలి సభ్యుల విషయంలో మాత్రం తలనొప్పి తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ నాయకులకే కాదు ఇటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చే సిఫార్సులను సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడాల్సివస్తోందట. కేంద్రమంత్రులు సైతం తమ మనుషులకు సభ్యులుగా అవకాశం కల్పించాలని సిఫార్సులు చేస్తున్నారట. ఒత్తిళ్లను తట్టుకునేందుకు గాను ఇప్పటికే గత పాలకవర్గంలో సభ్యుల సంఖ్యను 18 నుంచి 37కి పెంచి జంబో పాలకమండలిని తీసుకొచ్చారు. రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులన్నీ పూర్తి చేయడంతో అక్కడ పదవులు దక్కనివారు టీటీడీలో చోటు కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారట. దీంతో మరోసారి పాలకమండలి సభ్యులను పెంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారట. భక్తుల నుంచి విపక్షాల నుంచి జంబో పాలకమండలిపై వస్తున్న విమర్శలు గుర్తుకువచ్చి వామ్మో ఎట్టి పరిస్థితుల్లో సభ్యుల సంఖ్య పెంచే పని చేయొద్దని అనుకుంటున్నారట. మరి ఇవన్నీ చూసుకుని పాలకమండలి సభ్యులను జగన్ సర్కార్ ఎప్పుడు ప్రకటిస్తుందో ఏంటో..!



Updated Date - 2021-08-08T18:47:53+05:30 IST