Abn logo
Apr 30 2021 @ 00:00AM

ఆచరించాల్సిన సత్కార్యం

ఇస్లాం ధర్మంలోని సమస్త ఆరాధనల్లో నమాజ్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో ‘జకాత్‌’కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ముస్లింలు ఈ రెండిటిలో దేన్ని నిరాకరించినా అవిశ్వాసి అవుతాడనీ, వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండో దానికి విలువ ఉండదనీ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ‘జకాత్‌’ అంటే పవిత్రత, పరిశుద్ధత అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక పరిభాషలో... ధనికుడు తాను పవిత్రమయ్యే ఉద్దేశంతో ఏడాదికి ఒకసారి తన సంపద నుంచి రెండున్నర శాతం చొప్పున పేదలకూ, ధర్మ సంస్థాపన కార్యాలకూ దానం చేసే ధన, కనక, వస్తువులను ‘జకాత్‌’ అంటారు. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా నమాజ్‌ చేస్తున్నప్పటికీ, ప్రతి సంవత్సరం జకాత్‌ చెల్లించకపోతే ఆ నమాజ్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే మరో వ్యక్తి ఏటేటా జకాత్‌ చెల్లిస్తున్నా జీవితాతం నమాజు చెయ్యకపోతే అతని జకాత్‌ సత్కార్యం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. 


ఇస్లాం సౌధాన్ని నిలిపే అయిదు మూల స్తంభాల్లో... విశ్వాస ప్రకటన, నమాజ్‌ తరువాత, మూడవ స్తంభంగా జకాత్‌ పరిగణన పొందుతోంది. దివ్య ఖుర్‌ఆన్‌లో నమాజ్‌తో పాటు జకాత్‌ ప్రస్తావన కూడా కనీసం ముప్ఫై రెండు సార్లు వచ్చింది. దీన్ని బట్టి జకాత్‌కు ఎంత ప్రాధాన్యం ఉన్నదీ తెలుస్తుంది. అలాగే ‘ఈమాన్‌’ (విశ్వాస ప్రకటన) తరువాత నమాజ్‌, జకాత్‌ ప్రస్తావన కూడా దివ్య ఖుర్‌ఆన్‌లో అనేక చోట్ల ఉంది. ఇవే ధర్మానికి ముఖ్య ప్రాతిపదికలనే భావాన్ని ఇది స్ఫురింపజేస్తుంది. 


ఏ సంపద నుంచి జకాత్‌ తియ్యకుండా కలిసి ఉంటుందో... అది ఆ సంపదను నాశనం చేస్తుందని దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు. ‘‘దేవుడు తన అనుగ్రహంతో ప్రసాదించిన సంపద విషయంలో పిసినారితనం వహించేవారు ఆ ధోరణి తమకు మేలు కలిగిస్తుందని భావించకూడదు. అది వారికి హాని కలిగిస్తుంది. ఏ ధనం విషయంలో పిసినారితనం వహిస్తున్నారో అది ప్రళయ దినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది’’ అని హెచ్చరించారు. 


జకాత్‌ను ధన ప్రక్షాళన సాధనంగా దివ్య ఖుర్‌ఆన్‌ అభివర్ణిస్తూ.. సత్యాన్ని విశ్వసించి, సదాచార సంపన్నులై, నమాజ్‌ (విధి) నిర్వహిస్తూ, జకాత్‌ను నెరవేర్చేవారికి దైవం దగ్గర ప్రతిఫలం సిద్ధంగా ఉందనీ, వారికి పరలోకంలో ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదనీ స్పష్టం చేసింది. ‘‘విశ్వాసులైన స్త్రీ, పురుషులందరూ ఒకరికొకరు స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా ఉంటారు. వారు ప్రజలకు మంచి విషయాలు బోధిస్తారు. చెడు విషయాల నుంచి వారిస్తారు. నమాజ్‌ వ్యవస్థ స్థాపిస్తారు. జకాత్‌ చెల్లిస్తారు. దేవుని పట్ల, ఆయన ప్రవక్త పట్ల వినయ విధేయతలతో మసలుకుంటారు. దైవ కారుణ్యం వారిపైనే వర్షిస్తుంది’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. ‘‘దేవుడు జకాత్‌ చెల్లింపును ముస్లింలకు విధి (ఫరజ్‌)గా చేశాడు. దీన్ని ధనికుల నుంచి వసూలు చేసి, నిరుపేదలకు అందజేయడం జరుగుతుంది’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు (హదీస్‌ గ్రంథం). ఈ హదీస్‌ని గమనిస్తే... జకాత్‌ పేద ప్రజల హక్కు అని తెలుస్తోంది. కాబట్టి జకాత్‌ను విశ్వాసులు విధిగా ఆచరించాలి. దీనివల్ల అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే కాదు, అల్లాహ్‌ కరుణను కూడా పొందుతారు.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Advertisement
Advertisement
Advertisement