మేధావికి ధర్మ బోధ!

ABN , First Publish Date - 2021-01-29T06:47:16+05:30 IST

జెన్‌ గురువుల మాటలూ, చేతలూ వింతగా కనిపిస్తాయి. కానీ వాటిలో లోతైన, గంభీరమైన అర్థాలు ఉంటాయి. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దానికి చెందిన జెన్‌ గురువు న్యాన్‌సేన్‌.

మేధావికి ధర్మ బోధ!

జెన్‌ గురువుల మాటలూ, చేతలూ వింతగా కనిపిస్తాయి. కానీ వాటిలో లోతైన, గంభీరమైన అర్థాలు ఉంటాయి. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దానికి చెందిన జెన్‌ గురువు న్యాన్‌సేన్‌. ఆయన తొమ్మిదేళ్ళ వయసులోనే సన్యాసం స్వీకరించాడు. తీవ్రమైన సాధనలు చేశాడు. ఎందరెందరితోనో చర్చలు సాగించాడు. ఎంతెంతో విషయ సేకరణ చేసి, పాండిత్యాన్ని సంపాదించాడు. బ్యాసో అనే గురువుకు శిష్యుడయ్యాడు. న్యాన్‌సేన్‌కు బ్యాసో చేసిన మొదటి సూచన- ‘‘ఇప్పటివరకూ తెలుసుకున్నదీ, నేర్చుకున్నదీ పూర్తిగా మరచిపో!’’ అని. ప్రఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి కూడా ‘ఏదైనా నేర్చుకోవాలంటే, అంతకుముందు నేర్చుకున్నదాన్ని మరచిపోవాలి’ అని చెప్పారు. సత్యాన్ని దర్శించాలని ధ్యానంలో కూర్చున్న వ్యక్తికి... అప్పటికే అతను విన్న విషయాలతో పాటు తెలిసిన వ్యక్తులు, గురువులు దర్శనమిస్తారు.


సత్య దర్శనానికి అడ్డుపడతారు. అందుకే ‘వాటిని మెదడు నుంచీ తీసేయాలి’ అంటారు జెన్‌ గురువులు. న్యాన్‌సేన్‌ అదే చేశాడు. ఆ తరువాత ఆయన గురువయ్యాడు. న్యాన్‌సేన్‌ అనే పర్వతం మీద కుటీరాన్ని స్వయంగా నిర్మించుకొని, అందులో నివసించేవాడు. ఆ పర్వతం పేరుతోనే ఆయన ప్రఖ్యాతుడయ్యాడు. ఆయన అసలు పేరు నాన్‌ క్వాన్‌ పుయూయాన్‌. ఆయన ఎనభయ్యారేళ్ళు జీవించాడు. 


ఒకసారి న్యాన్‌సేన్‌ దగ్గరకు తత్త్వవేత్త, ఆచార్యుడు అయిన ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేసి, వివిధ ఆలోచనా విధానాల గురించి తెలుసుకున్న వాడు. న్యాన్‌సేన్‌ను దర్శించి, చర్చలు జరపాలన్నది అతని సంకల్పం. అతణ్ణి చూడగానే న్యాన్‌సేన్‌ సాదరంగా ఆహ్వానించాడు. 


ఆ వచ్చిన మేధావి ‘‘జెన్‌ అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.

‘‘ముందు మీరు కూర్చోండి. ఎంతో దూరం నుంచి వచ్చారు. అలసిపోయి ఉంటారు. ముందు కాస్త తేనీరు తాగండి’’ అన్నాడు న్యాన్‌సేన్‌.


అతని చేతికి ఒక కప్పు ఇచ్చి, అందులో తేనీరు వేయడం మొదలు పెట్టాడు. ఆ కప్పు నిండిపోయి, తేనీరు బయటకు దొర్లిపోతున్నా... ఆయన పోస్తూనే ఉన్నాడు. 

ఆ తేనీరు ఆ మేధావి దుస్తులను తడిపేసింది. అతనికి దిక్కు తోచలేదు. ‘ఒక కప్పులో ఎంత తేనీరు వేయాలో తెలియని ఈ పెద్ద మనిషికి జెన్‌ అంటే ఏం తెలిసి ఉంటుందబ్బా!’ అనుకున్నాడు. బిక్కమొహంతో ఆయన వైపు చూశాడు.


న్యాన్‌సేన్‌ చిరునవ్వు నవ్వుతూ ‘‘మీ మస్తిష్కం ఈ కప్పు మాదిరిగానే రకరకాల సిద్ధాంతాలతో నిండిపోయి ఉంది. ఇక అందులో జెన్‌కు స్థానం ఎక్కడిదీ?’’ అని ప్రశ్నించాడు. వింత వింత విభిన్న విషయాలతో నిండిన మనసుకు నిజమైన ధ్యానం అంటే ఏమిటో అర్థం కాదని తన మాటలతో ఆ మేధావికి ఆయన సూచించాడు. 


రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2021-01-29T06:47:16+05:30 IST