Abn logo
May 7 2021 @ 00:00AM

గురువుకు జ్ఞానబోధ

ప్రసిద్ధి చెందిన జెన్‌ గురువుల్లో ఒకరైన షెన్‌స్యాన్‌ జపాన్‌కు చెందినవాడు. ఆయన బాల్యం నుంచీ ఒక మఠాధిపతి పెంపకంలో పెరిగాడు. ఆ మఠాధిపతి చాలా సహృదయుడు. గొప్ప పండితుడు. ఎన్నెన్నో శాస్త్రాలను అధ్యయనం చేసి, తన శిష్యులకు బోధించేవాడు. ఆయన మఠంలో ఎందరో సన్న్యాసులు ఉండేవారు. షెన్‌స్యాన్‌కు అద్భుతమైన తెలివితేటలు ఉండడం గమనించిన ఆ మఠాధిపతి తనకు తెలిసినవన్నీ అతనికి బోధించాడు. ఆ తరువాత, తనకన్నా గొప్పవాడైన పాయ్‌చాంగ్‌ దగ్గరకు అతణ్ణి పంపాడు. 

పాయ్‌చాంగ్‌ దగ్గర షెన్‌స్యాన్‌ కొంతకాలం ఉండి, ఆయన పర్యవేక్షణలో సాధన చేశాడు. శ్రద్ధతో, వినయంతో మెప్పించాడు. తీవ్రమైన సాధన చేసి జ్ఞానాన్ని పొందాడు. పాయ్‌చాంగ్‌కు అంజలి ఘటించి, సెలవు తీసుకున్నాడు. చిన్ననాటి నుంచి తనను ప్రేమతో పెంచి పోషించిన... తన పాత గురువైన మఠాధిపతిని దగ్గరకు వచ్చాడు.

అప్పటికి ఆ గురువు దాదాపు నూరు సంవత్సరాల వృద్ధుడయ్యాడు. ఆయనకు ఎంతో పాండిత్యం ఉంది కానీ జ్ఞానోదయం కాలేదు. పండితుల కన్నా పామరులకే త్వరగా జ్ఞానోదయం అవుతుందనీ, పాండిత్యమే వారి జ్ఞానోదయానికి ఒక పెద్ద ఆటంకంగా ఉంటుందనీ పెద్దలు చెబుతారు. జ్ఞాని అయిన షెన్‌స్యాన్‌ ఆ మఠాధిపతినే తన తండ్రిగా, గురువుగా భావించి అన్ని సేవలూ చేసేవాడు. ఒక రోజు ఆయనకు స్నానం చేయిస్తూ... వీపు రుద్దుతూ ‘‘ఈ శరీరం ఎంతో మంచి ఆలయం. కానీ ఇందులో ఉన్న బుద్ధుడు పవిత్రుడు కాడు’’ అన్నాడు. 

ఆ గురువు వెనక్కు తిరిగి షెన్‌స్యాన్‌ను చూశాడు. అప్పుడు షెన్‌స్యాన్‌ ‘‘బుద్ధుడు పవిత్రుడు కాకపోయినా వెలుతురు ప్రసరింపజేయగలడు’’ అన్నాడు.

ఆ వృద్ధుడు ఆశ్చర్యచకితుడై, మౌనంగా ఉండిపోయాడు. ‘‘ఈ షెన్‌స్యాన్‌ ఇక్కడి నుంచి పాయ్‌చాంగ్‌ దగ్గరకు వెళ్ళి వచ్చాక ఎంతో మారిపోయాడు. ఇతని మాటలు గంభీరమైన అర్థంతో ఉంటున్నాయ్‌. ఇతని ముఖంలో వర్చస్సు ఉంది. ఇతణ్ణి ఇంకా గమనిద్దాం’’ అనుకున్నాడు.

ఒక రోజు ఆ పీఠాధిపతి కిటికీ దగ్గర కూర్చొని ఒక పాత గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాడు. ఆ కిటికీకి ఒక పలచని కాగితం తెర ఉంది. ఆ తెరను తొలగించుకొని బయటకు పోవాలని శాయశక్తులా కృషి చేస్తున్న ఒక తేనెటీగను షెన్‌స్యాన్‌ చూశాడు. ‘‘ప్రపంచం ఎంతో విశాలంగా ఉంది. నువ్వు చాలా స్వేచ్ఛగా జీవించవచ్చు. నువ్వు మూర్ఖంగా ఈ పాత కాగితాన్ని తొలగించడానికి కాలాన్ని ఎందుకు వృథా చేస్తావు? అలా ఆ వాకిలి మీదుగా బయటకు వెళ్ళొచ్చుగా?’’ అన్నాడు.

తేనెటీగ పాత కాగితాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తోంది. ఆ వృద్ధ గురువు పాత గ్రంథాన్ని చదువుతున్నాడు. బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛా జీవితాన్ని గడపడానికి ఆ తేనెటీగకు బాగా తెరిచి ఉన్న ద్వారం ఉంది. కానీ తెలివిలేని ఆ తేనెటీగ దాన్ని వినియోగించుకోవడం లేదు. అలాగే నిర్వాణాన్ని పొందడానికి అనువైన ధ్యానం ఉంది. కానీ ఆ గురువు తెలివితక్కువగా ఇంకా గ్రంథ పఠనంలోనే ఉన్నాడు. షెన్‌స్యాన్‌ మాటలు ఆ విషయాన్నే సూచించాయి. దీనిలో భావాన్ని ఆ గురువు గ్రహించాడు. షెన్‌స్యాన్‌ కన్నా తాను పెద్దవాడినీ, పండితుడినీ అనే గర్వం తొలగిపోయింది. గ్రంథాన్ని పక్కన పడేశాడు. ‘‘ఈ జ్ఞానం నీకెలా వచ్చింది?’’ అని అడిగాడు.

‘‘నా గురువు పాయ్‌చాంగ్‌ దయవల్ల నాకు ఈ జ్ఞానం, ఈ శాంతి లభించాయి. నేను మీకు ఎంతో ఋణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకోవడానికే మీ దగ్గరకు తిరిగి వచ్చాను’’ అన్నాడు షెన్‌స్యాన్‌.

తన మఠంలోని సన్న్యాసులు అందరి సమక్షంలో షెన్‌స్యాన్‌కు ఆ వృద్ధ గురువు పాద నమస్కారం చేశాడు. ఆ క్షణమే ఆయనలో జ్ఞాన జ్యోతి వెలిగింది

- రాచమడుగు శ్రీనివాసులు