Advertisement
Advertisement
Abn logo
Advertisement

వడ్డీ సొమ్ము ‘సున్నా’!

సున్నావడ్డీ పంట రుణాల్లో రైతులకు మొండిచేయి

గత ఏడాది బకాయి రూ.26.24 కోట్లు 

ఈ ఏడాది రావలసింది రూ.5.51 కోట్లు 

రైతులకు చెల్లించాల్సిన రూ.31.75 కోట్లకు మంగళం

అసైన్డ్‌ భూములకు పంట రుణాల నిలిపివేత   

పెట్టుబడి కోసం ప్రైవేటు రుణాలకు అసైన్డ్‌ రైతులు


పేరుకే అది సున్నా వడ్డీ.. రైతులు వడ్డీతో పంటరుణం చెల్లిస్తే, ఆ తరువాత తిరిగి వడ్డీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి. కానీ డాక్టర్‌ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాల పథకం ద్వారా ఇవ్వాల్సిన నగదును జమ చేయకుండా జిల్లా రైతులతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. ‘ముందుగా పంట రుణాలను వడ్డీతో చెల్లించండి.. ప్రభుత్వం సున్నా వడ్డీ సొమ్మును జమ చేస్తే మీ ఖాతాల్లో తిరిగి జమచేస్తాం’.. అంటూ బ్యాంకులు, పీఏసీఎస్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు తాము తీసుకున్న రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం సున్నావడ్డీ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. 


(ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం) : రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్న పాలకులు డాక్టర్‌ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాల పథకం నగదును రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడం గమనార్హం. రైతుల ఖాతాల్లో సున్నావడ్డీ సొమ్ము జమకాలేదని వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళితే ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌ పుస్తకం, భూమి వివరాల నమోదు సమయంలో పొరపాట్లు జరిగితే సరిచేయించుకోవాలని సలహా ఇస్తున్నారు


వడ్డీతో కలిపి కట్టించుకున్నారు 

రైతులు తమ భూమి పత్రాలను తనఖా పెట్టి, లక్ష రూపాయలలోపు పంట రుణం తీసుకుని, పది నెలలు, లేదా ఏడాది.. గడువు ముగిసేనాటికి ఆ రుణం చెల్లించాల్సి ఉంది. ఇలా చెల్లించిన పంట రుణానికి ప్రభుత్వమే వడ్డీసొమ్మును చెల్లించాలి. తీసుకున్న పంట రుణంపై ఆరు శాతం వడ్డీ, బ్యాంకు సర్వీసు చార్జీలు.. అన్నీ కలుపుకొని రూ.లక్షా 5వేల వరకు  రైతులు చెల్లించాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న  రైతులు వడ్డీతో కలిపి రుణాలు చెల్లిస్తే, వడ్డీ సొమ్మును ప్రభుత్వం తిరిగి వారి ఖాతాలో జమ చేస్తుందని పాలకులు హామీ ఇచ్చారు. బ్యాంకులు, పీఏసీఎస్‌లలో రైతులు తమ పరపతి పోకుండా ఉండేందుకు వడ్డీతో కలిపి రుణాలు చెల్లించారు. కానీ దానికి సంబంధించిన వడ్డీ సొమ్ము నేటివరకు అత్యధికుల ఖాతాల్లో జమ కాలేదు. 


వడ్డీ సొమ్ము కోసం ఏడాదిన్నరగా నిరీక్షణ

డాక్టర్‌ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం  ద్వారా 2019-20 సంవత్సరం ఖరీఫ్‌లో 71,790 మంది రైతులకు రూ.15.06 కోట్లు, రబీలో 51,089 మంది రైతులకు రూ.11.18 కోట్లు, మొత్తంగా రూ.26.24 కోట్లు వడ్డీగా రావాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారులు లెక్క తేల్చారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇంతవరకు ఆ సొమ్ము చాలామంది రైతుల ఖాతాల్లో జమకాలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 34,677మంది రైతులకు రూ.5.51కోట్ల సున్నావడ్డీ సొమ్మును చెల్లించాల్సి ఉందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదికను పంపింది. 


అసైన్డ్‌భూములకు పీఏసీఎస్‌ల ద్వారా రుణాల నిలిపివేత

మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, కైకలూరు తదితర ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములు అధికంగా ఉన్నాయి. ఈ భూముల్లో రైతులు కొన్నేళ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చాక అసైన్డ్‌ భూములకు పీఏసీఎస్‌ల ద్వారా పంట రుణాలు ఇవ్వడం నిలిపివేశారు. ఈ భూములకు భూమిశిస్తును కూడా కట్టించుకోవడం లేదు. పై అధికారుల ఆదేశాల మేరకు అసైన్డ్‌ భూములకు శిస్తు కట్టించుకోవడం లేదని వీఆర్వోలు ఖరాఖండిగా చెబుతున్నారు. గతంలో భూమిశిస్తు రసీదులు, రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో మార్టిగేజ్‌ చేయించిన పత్రాలు చూపితే పీఏసీఎస్‌లలో పంట రుణాలు ఇచ్చేవారు. రెండు సంవత్సరాలుగా ఈ భూములకు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మార్టిగేజ్‌ నిలిపివేశారు. మార్టిగేజ్‌ కావడంలేదు కాబట్టి పంట రుణాలు ఇవ్వలేమని పీఏసీఎస్‌ల్లోని సిబ్బంది చెబుతున్నారు.

 

సున్నావడ్డీ సొమ్ము ఇంతవరకు జమ కాలేదు 

నాపేరున, నా కుటుంబసభ్యుల పేరున ఏటా కానూరు పీఏసీఎస్‌లో పంట రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. గత ఏడాది తీసుకున్న పంట రుణానికి వడ్డీతో కలిపి చెల్లించాము. గురువారం కానూరు పీఏసీఎస్‌కు వెళ్లి  సున్నావడ్డీ సొమ్ము జమ అయిందా? అని ఆరా తీస్తే జమకాలేదని సిబ్బంది చెప్పారు. ప్రభుత్వం సున్నావడ్డీ ఇచ్చినట్టు చెప్పడమే తప్ప ఆచరణలో అమలు  చేయడంలేదు.  - గోపు సత్యనారాయణ, కానూరు, బందరు మండలం


అసైన్డ్‌ భూములకు పంట రుణాలు నిలిపివేశారు

బందరు మండలంలో అత్యధికంగా అసైన్డ్‌ భూములే ఉన్నాయి. వాటిని ఎన్నాళ్లుగానో రైతులు సాగు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్‌ భూములుగా, 22-ఏ భూములుగా నమోదై ఉంటే సంబంధిత భూములను సాగుచేసే  రైతులకు రెండు సంవత్సరాలుగా పంట రుణాలు నిలిపివేశారు. భూములకు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మార్టిగేజ్‌ చేసుకుని, ఆ పత్రాలు ఇవ్వాలని షరతులు పెడుతున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అసైన్డ్‌భూములకు మార్జిగేజ్‌ చేయడం లేదు. దీంతో రైతులు పంటలు సాగు చేసేందుకు పెట్టుబడి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. - వక్కపట్ల శ్రీనివాసరావు, తుమ్మలచెరువు, బందరు మండలం

Advertisement
Advertisement