అధికారుల దృష్టికి సమస్యల చిట్టా

ABN , First Publish Date - 2022-01-22T05:32:10+05:30 IST

గ్రామస్థాయిలో డ్రైనేజీ, పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, విద్యుత్‌ అంతరాయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థాయీ సంఘాల సభ్యులు సమస్యలను వివరించారు.

అధికారుల దృష్టికి సమస్యల చిట్టా
హాజరైన సభ్యులు

జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం
 భానుగుడి (కాకినాడ), జనవరి 21: గ్రామస్థాయిలో డ్రైనేజీ, పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, విద్యుత్‌ అంతరాయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థాయీ సంఘాల సభ్యులు సమస్యలను వివరించారు.  అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రజాప్రతినిధులను కిందిస్థాయి అధికారులు చిన్నచూపు చూస్తున్నారని  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ దృష్టికి  తీసుకొచ్చారు.  జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, వైస్‌ చైర్మన్‌-1 బుర్రా అనుబాబు, వైస్‌ చైర్మన్‌-2 మేరుగు పద్మలత ఆధ్వర్యంలో 7 స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు.  మంచినీటి సమస్యపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారే తప్ప నిర్మాణ పనులు ఎందుకు చేపట్టడం లేదని అధికారులను ప్రశ్నించారు. మంచినీరు పుష్కలంగా ఉన్న సమయంలో కూడా తాగునీటి ఎద్దడిపై సమస్యలు వస్తున్నాయంటే వచ్చే వేసవిలో ఈ సమస్య మరింత జటిలమవుతుందని చెప్పారు.  అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. అలాగే పంచాయతీరాజ్‌కు సంబంధించి రహదారులు, బ్రిడ్జి నిర్మాణాలపై చర్చ  జరిగింది. జిల్లా వ్యాప్తంగా రహదారులు పూర్తి అధ్వానంగా ఉన్నాయని అఽధికారులు గోతులు కూడా పూడ్చడం లేదని సభ్యులు చెప్పారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేశవరం- ద్వారపూడి రహదారికి బిల్లులు మంజూరయ్యాయని, అయితే 20 శాతం కన్నా పనులు పూర్తి కాలేదన్న నెపంతో రద్దయ్యాయని చెప్పారు. మండపేట నియోజకవర్గంలో పలు రహదారులు దారుణంగా తయారయ్యాయని దీనిపై అధికారులు సమాఽధానం చెప్పడం లేదన్నారు.  గ్రామాల స్థాయిలో పారిశుఽధ్య నిర్వహణ పూర్తిగా కుంటిపడిందని సభ్యులు ప్రస్తావించారు. తడి, పొడి  చెత్తను వేరు చేయడానికి ఏర్పాటు చేసిన ప్లాంట్‌లు నిరుపయోగంగా మారాయన్నారు. అలాగే గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని, చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రికల్‌  ఫోల్స్‌ మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.   వ్యవసాయ రంగంలో 92 శాతం నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ జేడీ రామ్మోహనరావు తెలపగా మిగిలిన 8శాతం నీటి ఎద్దడి కారణంగా నాట్లు వేయలేదన్నారు. దీనిపై జడ్పీ చైర్మన్‌  కలగజేసుకుని వ్యవసాయ అధికారులు సమావేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లాలో నీటి ఎద్దడి ఎక్కడా లేదని, అధికారులు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. జిల్లాలో రబీ పంటకు నిర్దిష్టమైన ప్రణాళికతో శివారు ప్రాంతాలకు కూడా నీటిని అందిస్తామన్నారు.  స్థాయీ సంఘాల సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:32:10+05:30 IST